ఆశా దీపాలు

Kavita Ganduri

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

రాఘవయ్య గారి ఇంట్లో అంతా సందడిగా ఉంది. ఒకటే హడావిడి. ఢిల్లీ లో ఉండే పెద్దకొడుకు,హైదరాబాదులో ఉండే రెండవ కొడుకు,మద్రాసులో ఉండే మూడవ కొడుకు,ఆ ఇంటి ఆడపచులు అంతా కుటుంబసమేతంగా పిల్లాపాపలతో వచ్చేసరికి ఇల్లంతా కళ కళ లాడిపోతోంది. దీపావళి వచ్చేస్తోంది కదా మరి....అందుకే ఆ హడావిడి.సీతమ్మగారు మడి కట్టుకునివంట ఇంట్లో ఉన్నారు. కోడళ్ళు ఆవడికి వంటలో సహాయం చేస్తున్నారు. కొడుకులు తలా ఒక పని చేస్తున్నారు. పెద్దాడు - సూర్యం, బయటికి వెళ్ళి చేసుకురావల్సిన పనులన్నీ లిస్టు రాస్తున్నాడు. రెండవ వాడు- ప్రకాశం ఇంటికంతా లైటింగు ఏర్పాటు చేయడంలో తలమునకలై ఉంటే, చిన్నాడు గిరీశం తండ్రి చెప్పిన పని మీద బయటకు వెళ్ళాడు. ఇంటి ఆడపడుచులు పిల్లలకి స్నానాలు చేయించడం,వాళ్ళకు పాలు ఇవ్వటం, వాళ్ళు పోట్లాడుకుంటుంటే వాళ్ళ సమస్యలకు తీర్పులివ్వడం లో బిజీగా ఉన్నారు. ఇంటి అళ్ళుళ్ళు మావగారితో కబుర్లు చెబుతూ ఇంట్లో ని ఆ పనీ ఈ పనీ చేస్తూ చేదోడు వాదోడు గా ఉన్నారు.

మెల్లిగా పిల్లలంతా డాబా మీదకు చేరారు. టపాకాయలను ఎండలో పెడుతూ వాటాలు పంచుకుంటున్నారు. సాయంకాలం నేను ఇన్ని మతాబులు కాలుస్తాను,అన్ని చిచ్చిబుడ్లు కాలుస్తాను అని పోటీపడుతున్నారు. నేను అన్నీ బాంబులే కాలుస్తాను మిగతావన్నీ చిన్నపిల్లలు కాల్చుకోండి అని వాళ్ళళ్ళో పెద్దవాడైన శ్రీకర్‌ పేలాడు.అంతే వెంటనే ఉక్రోషంతో అందరిలోకి చిన్నవాడైన రెండేళ్ళ అన్వేష్‌, అన్నయ్యా, 'నేను నీతంతే ఎత్తువ తాతల పూవత్తులు తాలుత్తాను ' అని అన్నాడో లేదో అంతా ఘొల్లున నవ్వారు. వాడు అంతా తనని గొప్పగా భావించి నవ్వారనుకుని గర్వంతో మురిసి పోయాడు.

ఇక ఎండలో ఆడింది చాలర్రా కిందకి దిగండి అని రాఘవయ్యగారి కేక వినపడటంతో పిల్లలంతా కిందకి దిగారు. లేకపోతే తాతగారి చేతిలో వారి వీపు విమానం మోత మోగుతుందని వాళ్ళకి బాగా తెలుసు గనక!పెద్దవాళ్ళందరికీ ఒక గదిలో అరిటాకుల మీద భోజనం వడ్డించారు కోడళ్ళు.రాఘవాయ్యగారు,సూర్యం తినటం మొదలెట్టాక మిగతావాళ్ళంతా మొదలెట్టారు.

పిల్లలందరినీ వేరే గదిలో కూర్చోబెట్టి అందరికీ తినిపిస్తున్నారు సీతమ్మగారు.మామ్మా నాకు పెద్ద లడ్డు చేసి పెట్టవా అని ఒక మనవరాలడిగితే ముందు నాకు లడ్డు పెట్టమని ఇంకో మనవడి గొడవ. భోజనాల తంతంతా ముగిసేసరికి వంటిగంట దాటింది.అసలు దీపావళి వారం ఉందనగానే ఇంట్లో హడావిడి మొదలయ్యింది. గిరీశం చాలా సరదా అయినవాడు. ఇంట్లో అంతా గిరిబాబు అని పిలుస్తారు (పిల్లలంతా 'బాబాయి 'ని 'బాబు ' అని కుదిస్తే చివరికి పెద్దవాళ్ళకి కూడా అలాగే పిలవడం అలవాటైపోయింది).కావల్సిన రసాయనాలన్నీ తెచ్చి మతాబులు,చిచ్చిబుడ్లు,మిర్చీలు ఇంట్లోనే పిల్లలందరితో కూర్చుని తయారు చేసేవాడు. పిల్లలు ఇంట్లోని నోటుబుక్కులన్నీ దాచేసుకుని అందులోని కాగితాలను చింపి తమకు కావల్సినన్ని మతాబులు గిరిబాబుతో చేయించుకుని ఎవ్వరికీ కనిపించకుండా దాచుకునేవారు. దీపావళి వస్తే ఇంట్లోని నోటుబుక్కులు,స్క్రూడ్రైవర్లు,అట్లకాడలు కనుమరుగయ్యేవి. మతాబులకు ఒక వైపు మందు మరో వైపు ఇసుక కూరేవాడు గిరిబాబు. ఇసుక కూరిన వైపు అట్లకాడో, స్ర్క్రూడ్రైవరో గుచ్చి మరో వైపు మతాబు వెలిగించేవారు.

మరో పక్క కొడుకులు,కోడళ్ళు,ఆడపడుచులు,అళ్ళుళ్ళు అంతా పేకలు ఆడేవారు. అడ్డాటలో ఎప్పుడూ సూర్యానిదే పైచేయి. అందుకని అతని భాగస్వామిగా ఉండాలని అందరూ తాపత్రయ పడేవారు.అనుకున్న పండగ రోజు వచ్చేసింది. నరక చతుర్ధసి నాడు అంతా తెల్లవారు ఝామునే నిద్రలేచి బాయిలర్‌ వేసుకుని స్నానాలు కానిచ్చారు. పిల్లలంతా తమ వాటాలోని కొన్ని టపాకాయలు కాల్చారు. తర్వాత అంతా కొత్త బట్టలు కట్టుకుని రాఘవయ్య, సీతమ్మ లకాళ్ళకు నమస్కారం చేసారు. మనవలు,మనవరాళ్ళందరికీ ఏదైనా కొనుక్కోమని వారు డబ్బులిచ్చారు.దీపావళి రోజున సాయంత్రం ఇంటి ప్రహరీ గోడ మీదంతా అందంగా దీపాలు పెట్టారు ఆ ఇంటి ఆడవారు.ప్రమిదల్లో దీపం కొడెక్కకుండా చూసుకోవడం మగాళ్ళ భాద్యతనమాట!ప్రకాశం ఇంటి చుట్టూ లైటింగు పెట్టి అంతా ప్రకాశవంతం చేసాడు. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని పిల్లలు ఎదురు చూసి లోపలి నుంచి టపాకాయలు తెచ్చారు. ఆ వీధిలో అందరి కంటే తామే ముందు కాల్చడం మొదలు పెట్టి అందరికంటే చివర్న ముగించాలని వారి తాపత్రయం. కొన్ని టపాకాయలను లోపలే దాచుకునే వారు. ఒక వేళ ఎవరన్నా ఆ వీధిలో అంతా అయిపోయిందనుకున్న తర్వాత కాలిస్తే గబ గబా శ్రీకర్‌ వెళ్ళి ఏ బాంబో,చిచ్చుబుడ్డో కాల్చి వచ్చి తామే గ్రేటంటూ చాటుకునేవాడు.

అలా చాలా సంవత్సరాలు రాఘవయ్యగారి ఇంట్లో ఎంతో కోలాహలంగా దీపాల పండగ - దీపావళి జరిగేది.

కానీ మంచి రోజులు ఎల్లకాలం ఉండనివ్వడు ఆ భగవంతుడు.మనుషులు మారారు,మనస్థత్వాలు మారాయి...కాలం తెచ్చే మార్పులతోపాటు అందరి పరిస్థితులూ,స్థితిగతులూ మారాయి.పిల్లల చదువులనో,అఫీసుల్లో సెలవ దొరకలేదనో,ఒంట్లో బాగోలేదనో...ఇలా అనేక కారణాలవల్ల ఆ సంవత్సరం దీపావళికి రాఘవయ్యగారి ఇల్లు బోసిపోయింది. రాను రాను ప్రతి దీపావళికీ ఆ ఇంట్లో కళ తరుగుతూనే వచ్చింది.డబ్బు అనే జబ్బు అంటువ్యాధిలా వ్యాపించింది. ఒకనాటి ఆప్యాయతలు,అనుబంధాలు,అభిమానాలు కరువైపోయాయి.కుటుంబమంటే నేను,నా భార్య,నా పిల్లలు మాత్రమే అన్న భావం నాటుకుపోయింది. సూర్యం పెద్ద కూతిరి పెళ్ళిలో తమకు అవమానం జరిగిందని గిరిబాబు పెదవి విరిచాడు. ప్రకాశం గృఉహప్రవేశం చేసుకున్న నాడు తనకి నాసిరకం చీర పెట్టారని ఒక ఆడపడుచు అలిగింది. ఒకళ్ళ పిల్లలకి అమెరికా వీసా వచ్చిందని ఇంకోళ్ళకి అవమానం.... ఎవరి ఊళ్ళళ్ళో వాళ్ళు విశాలమైన భవంతులు కట్టుకున్నా వాళ్ళ మనసులు చాలా ఇరుకైపోయాయి.రాఘవయ్యగారికి,సీతమ్మకు వయస్సు మళ్ళటంతో ఆస్థి పంపకాలు చేసి పిల్లల చెంతకు చేరారు.కొడుకులు,కోడళ్ళు ఎంతో భాధ్యతో బరువుగా వారి భారాన్ని మోసారు. రాఘవయ్యగారు కన్ను మూసినప్పుడు కొడుకలంతా కళ్ళు తెరిచారు...ప్రతిజ్ఞలు చేసారు...'ఆయన మనమధ్య లేకపోయినా ఎప్పటికీ ఇలాగే కలిసుంటామని '.

పదమూడవ రోజు అయిపోగానే సూర్యానికీ,గిరీశానికీ మాటా మాటా వచ్చింది. ఇప్పటికి మూడేళ్ళయింది వారిద్దరూ ఒకరినొకరు పలకరించుకుని....ప్రతి కుటుంబంలోనూ నిత్యం జరిగే సంఘటనలే ఇవి...ఎన్నో సినిమాల్లోను,సీరియళ్ళలోను చూపించే పాత కధే ఇది...కానీ నేను మాత్రం ఈ కధని జీర్ణించుకోలేకపోతున్నాను...ఎందుకంటే ఈ కధలో నేను ముఖ్య పాత్ర ధారిణిని కనుక...ఆ సీతమ్మను నేనే.....!ఇప్పుడక్కడ మా 'ఆనంద నిలయం ' లేదు. కొడుకులంతా ఎవరి వాటా వాళ్ళు అమ్మేసుకున్నారు. పెద్ద పెద్ద అపార్టుమెంటులు నిలిచాయి ఇప్పుడక్కడ.నాకు సంతోషమే వేసింది...ఎందుకంటే ఆస్థులమీద గొడవ పడే సావకాసమే లేదు కనుక!శ్రీకర్‌ నుంచి అన్వేష్‌ వరకు అంతా పెళ్ళిళ్ళు చేసుకుని పెద్ద పెద్ద దేశాలలో ఉన్నారు.అంతా బాగా అభివృఉద్ధి లోకి వచ్చారు.కనీసం ఒకళ్ళ పిల్లల పేర్లు కూడా ఇంకొకళ్ళకి తెలియవు.ఆయన ఉన్నప్పుడు రోజులే వేరు. ఎక్కడో వేలు విడిచిన,బీరకాయ పీచు చుట్టరికం వున్నవాళ్ళు కూడా ఇంటికి వచ్చి పలకరించి భోజనం చేసి పోతూ ఉండేవారు. ఆయన అద్రుష్టవంతులు.భగవంతుడు ఆయన్ని త్వరగా తీసుకుపోయాడు.నన్నింకా ఈ పరీక్షలో గట్టెంకించలేదు. ఆ సుదినం కోసం నేను ఎదురు చూడని రోజు లేదు, క్షణం లేదు....ఎప్పటికీ రోజులు ఒకేలా ఉండాలని నేను కోరుకోను.రేపే దీపావళి.అంతా ఒకచోట కలవాలని నేను ఆశించను...కనీసం ఫోను చేసి ఎలా ఉన్నారని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటే చాలు.అప్పుడైనా రాఘవయ్యగారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఈ పండు ముసలి దాని ఆశ.....

నా కంటి దీపాలు దీపావళిని మళ్ళీ చూస్తాయా?