అమ్మ అల్లరి చేస్తే.....?

Kavita Ganduri

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

గడిచిన రోజులు తియ్యనివి....తిరిగిరానివి......

ప్రతివారిజీవితంలో అమ్మతో గడిపిన రోజులు ఎంతో మధురమైనవి,మరువలేనివి,మరపురానివి....అందులో మీ కోసం చిన్నినా టి ఈ నా అనుభవం...

మా అమ్మ ఎంతో చలాకైనది,హుషారైనది.ఎప్పుడూ అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూ ఉంటుంది....అందుకే ఆమెకంపెనీని అన్ని వయస్సుల వాళ్ళూ ఆస్వాదిస్తారు...

నాకప్పట్లో పదేళ్ళుంటా యేమో....మా అన్నయ్యకి నాకూ ఆరేళ్ళు తేడా.సమ్మర్‌ హాలిడేస్‌ లోమా బాబాయ్‌ పిల్లలు,అత్తయ్య పిల్లలు,పిన్ని పిల్లలు...మొత్తం ఒక పదిమంది ఉంటాం... అంతా మా ఇంట్లో చేరేవాళ్ళం.ఎంతో సరదాగా రోజులు గడచిపోYఏవి. పొద్దునంతా ఇంట్లో,సాయంత్రం డాబా మీదో,కింద వరండాలోనో ఆడేవాళ్ళం. పొద్దునపూట అమ్మ ఎండలో బయటకు వెళ్ళనిచ్చేది కాదు....దొంగ పోలిస్‌,కరెంట్‌ షాక్‌ వగైరా ఆటలు సాయంత్రం ఆడేవాళ్ళం.పగలే ఇంట్లో కట్టేసినట్టుండేది....

మా అందరిలోకి పెద్దవాడైన మా అన్నయ్యే మాకు 'గ్యాంగు లీడరు '. మాకు రోల్‌ మోడల్‌ కూడా వాడే.అంతా వాడి మాట వినే వాళ్ళం. ఆ రోజున అన్నయ్యకి కత్తి లాంటి ఆఇడియా వచ్చింది.

మాకు ఇంట్లో పెద్ద అటక ఉండేది.అంతా అటక ఎక్కి అక్కడ ఆడుకోవాలని మా గ్యాంగు లీడరు అనడంతో వాడికి ఫుల్‌ మెజారిటీ ఓట్లు పడ్డాయి. అమ్మ అన్ని అందిస్తే, ముందుగా వాడు స్టూలు ఎక్కి అటక మీదకి వెళ్ళి సామానంతా వెనక్కు నెట్టేసి,పై పైన చీపురుతో శుభ్రం చేసేసి,రెండు చాపలు కూడా వేసి మా కోసం 'రణ రంగం ' సిద్ధం చేసాడు. ఆ రోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు అటక మీదే గడపాలని కమిటీ మెంబర్లంతా తీర్మానించుకున్నాము.

పొద్దున భోజనాలవ్వగానే అందరినీ బాత్రూం ప్రోగ్రాం ముగించుకుని రమ్మని లీడరు ఆర్డరు వేస్తే దానిని మేమంతా శిరసావహించాము. లైన్‌ లో నిలబడ్డ వాళ్ళందరినీ అన్నయ్య ఒకొక్కరినీ అమ్మ సాయంతో అటక మీదకు ఎక్కించాడు.అంతా మా 'హరివిల్లు ' కు చేరాక ఆ అనందం మాటల్లో చెప్పలేనిది...ఎదో పెద్ద ఎవెరెస్టు ఎక్కిన్నంత గర్వంగా అంతా ఫీల్‌ అయ్యాము...

ఇక మా అల్లరి మొదలయ్యింది...లూడో,పేకాట,చైనీస్‌ చెక్కర్‌,స్నేక్‌ అండ్‌ లాడెర్‌...ఇలా అన్నీ ఆటలూ ఆడాము...పాపం అన్నీ అందించలేక అమ్మ పనైపోయింది....ఈలోగా ఒకళ్ళకి ఆకలి,ఇంకొకరికి దాహం...అమ్మ మంచి నీళ్ళు,మాంగో షేకు,ఫ్రూట్‌ సలాడు,జంతికలు,పుచ్చకాయ ముక్కలు ఇలా అన్నీ సప్లయ్‌ చేసింది...విపరీతమైన గోల చేస్తూ చాలా సేపు ఆడుకున్నాము.

కాసేపయ్యాక, అమ్మ వచ్చి అన్నయ్యతో 'ఏరా! నాకూ అటకెక్కాలని ఉందిరా! చిన్నప్పుడెప్పుడూ ఎక్కలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకూ సరదాగా ఎక్కాలని ఉంది ' అంది. అంతే పిల్లలమంతా ఒక్కసారి అరుస్తూ చప్పట్లు కొడుతూ అమ్మ కూడా అటక మీదకి రావాలి అని నినాదాలు మొదలెట్టాము. అన్నయ్య మాత్రం నువ్వెలా వస్తావమ్మా,వీళ్ళంతా చిన్నవాళ్ళు కాబాట్టి నేను, నువ్వు కలిసి ఎత్తుకుని ఎక్కించేసాము.నిన్ను నేను ఎలా ఎక్కించను అంటే...అమ్మ ఇంకో రెండు స్టూళ్ళు తెచ్చింది.మొత్తానికి ఎలాగైతేనేం అమ్మ కూడా అటక ఎక్కేసింది. కాసేపు అంతా ఆ థ్రిల్‌ ని అనుభవించాము.

ఇక సాయంత్రం నాలుగు దాటుతుంటే అమ్మ, 'ఇక దిగుదాం నాన్నగారు వచ్చే వేళయింది...అందరినీ ఇలా అటక మీద చూస్తే ముందు నన్ను ఛీవాట్లెడతారు.అసలు నేను అటకెక్కాని తెలుస్తే...అమ్మో!.... నన్ను ముందు దింపరా అని గోలెట్టేసింది...

ఎక్కడం ఈసీగా ఎక్కేసిందిగానీ కింద స్టూలు మీద కాలు పెట్టాలంటే తెగ భయ పడి పోయింది.బాబోయ్‌ నావల్ల కాదంది. సరే ముందు పిల్లలందరినీ దిగమంది. అన్నయ్య ఎత్తుకుని ఒక్కొక్కరినీ దింపేసాడు. మళ్ళీ అమ్మ వంతు వచ్చింది. అమ్మ ఎంత చెప్పినా స్టూలు మీద కాలు పెట్టనంటుంది.ఒకటే భయం. నాన్నగారు వచ్చే టైము అవుంతోందని ఒక పక్క ఖంగారు...ఇప్పుడెలా?

******************************************************

మర్నాడు మా పిన్ని ఇంటికి వచ్చింది. అమ్మ పడుకుని వుంటే ఏంటక్కా ఒంట్లో కులాసాగా లేదా అంటే అమ్మ ఇలా చెప్పింది.

'నిన్న పిల్లల సరదా చూసి నాకూ ముచ్చటేసి అటక ఎక్కానే...ఎక్కడం ఎక్కాను కానీ దిగటం చాలా కష్టమయ్యిందనుకో. చివరికి ఇలా కాదు అని నేను, మావాడు కలిసి ఒక ప్లాను వేసాము. కింద రెండు బొంతలు, పరుపు,ఎనిమిది దిండ్లు వేసుకుని దానిమీద దూకుదామని డిసైడ్‌ అయ్యాను. కానీ మళ్ళీ భయం వేయడంతో ఇద్దరు పిల్లలు దూకి చూపిస్తే సరే నని ధైర్యం చేసి మొత్తానికి దూకేసాను. హమ్మయ్య అని లేచి మొత్తనికి గండం గడిచింది భగవంతుడా అనుకున్నాను. సాయంత్రం ఈయన వచ్చారు...అంతా బాగానే ఉంది కదా అనుకున్నాను. ఆయనకి ఏమీ చెప్పలేదు.

ఇదిగో పొద్దున లేద్దామంటే నడుంపట్టేసింది, ఒకటే ఒళ్ళు నొప్పులూ...అందరూ దూకారు కదా అని నేనూ దూకాను... ఏ వయసులో చేయాల్సిన పని ఆ వసులో చేయాలని అందుకనే అంటా రేమోనే...' మీ బావగారికి చెప్పే ధైర్యం లేక పొద్దున లేచి మామూలుగా ఉండటానికి కొంచం నటించాను...ఇదిగో పనులన్నీ అయ్యి నడుంవాల్చాను.... నువ్వొచ్చావు......'

పిన్ని కడుపునొప్పి వచ్చేటంతగా నవ్వుతూనే వుంది........................!