బుడుంగ బుడుంగ లొట్టన్న

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

అనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి...అబ్బాయి పేరు 'లొట్టన్న '...వాళ్ళ అమ్మా,నాన్నా ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, అతనికి మాత్రం ఆ పెరంటే అస్సలు నచ్చదు. ఎవరన్నా తనని ఆ పేరుతో పిలుస్తే మహా కోపం,చెడ్డ చిరాకు....

పాత బడిలోకి వెళ్ళనని మారాం చేస్తున్న లొట్టన్నని వాళ్ళ అమ్మ, నాన్న కొత్త బడిలో వేసారు.

ఉదయాన్నే లేచిన నాని(ఇంట్లో లొట్టన్న ముద్దు పేరు) కొత్త స్కూలుకి వెళ్ళాలన్న ఉత్సాహంతో గబ గబా 'ready' అయిపోయాడు. పేచిపెట్టకుండా వాళ్ళమ్మ పెట్టిన 'ఇడ్లీ' తినేసాడు...పాలు కూడా ఎత్తిన గ్లాసు దించకుండా గడ గడా తాగేసాడు. 'నా బంగారు తండ్రి ' అని వాళ్ళమ్మ ముద్దు పెట్టి స్కూల్లో దిగబెట్టింది.

స్కూల్లో ఎవ్వరడిగినా వాడు తన పేరు 'నాని ' అని చెప్పేవాడు. అలా కొన్ని రోజులు వాడు హాయిగా స్కూలుకి వెళ్తుండేవాడు.

ఒక రోజు క్లాసుకి 'circular' వచ్చింది. అందులో ఆ నెల 'ఫీజులు ' కట్టని వాళ్ళ పేర్లు టీచరు చదువుతోంది. పేర్లున్న పిల్లలంతా బెంచీ మీద లేచి నిలబడుతున్నారు. 'లొట్టన్న ' అని చదవడంతో వేరే దారి లేక నానిగాడు కూడా బెంచీ ఎక్కాడు.

సాయంత్రం స్కూలు వదిలే సమయానికి వాడి అసలు పేరు తెల్సుకున్న తోటి పిల్లలు 'లొట్టన్న ' అని పిలుస్తూ గేలి చెయ్యడం మొదలెట్టారు. వాడికి తిక్క రేగిపోయింది. వెర్రి కోపంతో వాళ్ళందరి మీదా విరుచుకుపడి ఏడుస్తూ ఇంటి ముఖం పట్టాడు.

దారిలో వాడి పాత స్కూలు స్నేహితుడు ఎదురు పడి, ఏరా! లొట్టన్నా, కొత్త స్కూలు ఎలా ఉంది అని పలకరించడంతో వాడి కోపం మరింత ఎక్కువై వాడి చెంప మీద ఛెళ్ళున కొట్టి వెళ్ళిపోయాడు.

ఇంటికి చేరాడు. వాళ్ళమ్మ భోజనం వడ్డించింది. గ్లాసులో నీళ్ళు పోస్తుంటే వాడికి 'గుడ గుడ లొట్టన్న ,గుడ గుడ లొట్టన్న ' అన్నట్టు వినపడ సాగింది.

గ్లాసు విసిరేసాడు. అమ్మ మజ్జిగ పోస్తుంటే మళ్ళీ అలాగే వినిపించింది....కంచం దొడ్లోకి విసిరి కొట్టాడు.పక్కనే పొంచివున్న పిల్లి ఆత్రంగా తినటానికి ముందుకి వచ్చింది. వాడికి కోపం వచ్చి దానిని కొట్ట బోయాడు. అది 'మ్యావ మ్యావ లొట్టన్న మ్యావ మ్యావ లొట్టన్నా ' అన్నట్టు వాడికి గోచరించింది. వాళ్ళమ్మ అన్నం తినమని చెప్తున్నా వినకుండా తన సైకిలు తీసి బైటకి పోయాడు. దాని బెల్లు 'ట్రింగ ట్రింగ లొట్టన్న , ట్రింగ ట్రింగ లొట్టన్నా ' అన్నట్టు వాడికి వినిపించింది. కోపంతో దానిని పక్కన పడేసి నడక మొదలెట్టాడు.చాలా సేపు అలా నడుచుకుంటూ పోతున్నాడు. ఈలోగా కాలి చెప్పు అరిగిపోయిన శబ్దం చేయడం మొదలెట్టింది. అది వాడికి 'కిర్రు కిర్రు లొట్టన్న, కిర్రు కిర్రు లొట్టన్న 'లా వినిపించింది. వాడికి కోపం ముంచుకొచ్చింది.

పక్కెనే ఉన్న బావిలో వాటిని విసిరి కొట్టాడు. 'బుడుంగ బుడుంగ లొట్టన్న, బుడుంగ బుడుంగ లొట్టన్న ' అని వినిపించింది వాడికి. పిచ్చివాడిలా అయిపోయాడు. బావిలో దూకేదామన్నంత అవేశం వచ్చింది...

ఇదంతా పక్కనుంచి చూస్తున్న ఒక తాతగారు దగ్గిరికి వచ్చి లొట్టన్నని దగ్గరకి తీసుకుని తన వొడిలో కూర్చో బెట్టుకుని...నెమ్మదిగా విషయం కనుక్కున్నారు. వాడితో ప్రేమగా , 'చూడు నాయనా మనిషి గొప్పతనం పేరులో లేదు ', గుణం లో ఉంది. పిచ్చయ్య,పెంటమ్మ లాంటి పేర్లు పెట్టుకున్నవారు కూడా ఎంతో పెరు ప్రతిష్టలు సంపాదించారు. అయినా లొట్టన్న పేరు చక్కగా,ముద్దుగా ఉంది. నిన్ను అలా పిలిచి గేలి చేసినవారంతా సరదాగా నిన్ను ఆట పట్టించడానికే తప్ప నీమీద ఇష్టం లేక కాదు. పిల్లి,బావి,చెప్పు... లొట్టన్న అని అనడం కేవలం నీ భ్రమ మాత్రమే. అన్నీ నువ్వు కల్పించుకున్నవి. నువ్వు ఇలా కోపం తెచ్చుకోవడం వల్ల నష్టం నీకు మాత్రమే. ఈసారి నిన్ను ఎవరన్నా లొట్టన్న అని పిలిస్తే, నువ్వు నవ్వుతూ సమాధానం ఇస్తే వాళ్ళు కూడా నిన్ను ఏడిపించడం మానేస్తారు. కాబట్టి చూడు బాబూ 'తన కోపమే తన శత్రువు... తన శాంతమే తనకు శ్రీరామ రక్ష ' అన్నారు '. ఇలా చాలా సేపు ఆ తాతగారు వాడిని బుజ్జగించారు...వాడికి దాని సారంశం బోధ పడింది.

వాడు మెల్లిగా ఇల్లు చేరాడు....

ఆ తర్వాత లొట్టన ఎప్పుడూ తన పేరు గురించి బాధ పడలేదు. చక్కగా చదువుకుని జీవితంలో బాగా వృఉద్ధి లోకి వచ్చాడు.

కాబట్టి పిల్లలూ, ఎప్పుడూ కోపం పనికి రాదు.

కధ కంచికి మనం ఇంటికి........టట్టడోయ...!