చీమ చాతుర్యం

శ్రీనివాస్‌ బయ్యరపు

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

అనగనగా ఒక రాజుగారు. రాజు గారికి ఏడుగురు కొడుకులు.

ఒకరోజున ఈ ఏడుగురూ అడవి లోకి వేటకి వెళ్ళారు. వేటాడి ఏడు చేపలని పట్టుకొని తెచ్చారు. ఈ ఏడు చేపలని ఎండ లో ఎండపెట్టారు. ఏడు చేపలలో ఆరు చేపలు మాత్రమే ఎండాయి. ఒక చేప ఎండలేదు.. రాజు గారు వచ్చి,

'చేపా.. చేపా, నువ్వు ఎందుకు ఎండ లేదూ, అని అడిగారు.

చేప తనకి గడ్డిమెట్ట అడ్డు వచ్చింది అని చెప్పింది.

గడ్డిమెట్ట దగ్గిరకి వెళ్ళి, గడ్డి..గడ్డి, నువ్వు ఎందుకు చేపకి అడ్డు వచ్చావు అని అడిగారు..

గడ్డి, తనను ఆవు మేయలేదని చెప్పింది..

ఆవు దగ్గిర కి వెళ్ళి , ఆవు.. ఆఅవు, నువ్వు ఎందుకు గడ్డి మేయలేదు అని అడిగారు..

ఆవు తనని పాలికాపు (అంటే ఆవులను కాచేవాడన్నమాట) వదలలేదు.. తనని తాడుతో కట్టేసారు కదా అని చెప్పింది...

పాలికాపు దగ్గిర కి వెళ్ళి, పాలికాపు.. పాలికాపు, నువ్వు ఆవుని ఎందుకు వదలలేదు అని అడిగారు....

పాలికాపు అమ్మగారు ఇంకా తనకి సద్దిబువ్వ పెట్టలేదు అని చెప్పాడు..

అమ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏంటీ నువ్వు మన పాలికాపుకి అన్నం పెట్టలేదా అని అడిగారు..

ఆవిడేమో... మన పాప ఏడుస్తోందండి .. అందుకే పాలికాపుకి అన్నం పెట్టలేదు అని చెప్పింది..

పాప దగ్గిరకి వెళ్ళి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు .. ఏమయ్యింది అని అడిగారు..

పాప, తనని చీమ కుట్టిందని చెప్పింది....

చీమ దగ్గిరకు వెళ్ళి, చీమా చీమా, మా పాపని ఎందుకు కుట్టావు అని అడిగితే.....

అప్పుడు ఆ చీమ ఏమందో తెలుసా......?

మరి నా బంగారు పుట్టలో చెయ్యిపెడితే కుట్టనా....... అని అడిగిందిట!

నీతి: ఎవరి జోలికీ వెళ్ళనంత కాలమూ మనకు ఎటువంటీ హాని జరగదు!