తెలివి తేటలు

పల్లవిశ్రీరాం

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు వుండేవాడు, అతనికి ఒక్కడే కొడుకు,వాడే సోముడు. ఒక్కడే కావడంతో చాలా గారాబంగా పెరిగాడు. రోజురోజుకి తాను చాలా తెలివి గలవాణ్ణి అని గర్వపడుతూ వచ్చాడు. వాడికి తన తెలివితేటలలో నమ్మకం హెచ్చిన కొద్దీ, తండ్రికి తగ్గసాగింది. ఇలా కొంతకాలం జరిగాక, రైతు కొడుకుతో , "నీకు 20 ఏళ్ళు నిండాయి కదా, కాస్తయినా చేతికిందకి సాయానికి రాకుండా వున్నావే! ఆలోచించినకొద్దీ నీకు తెలివితేటలు శూన్యంగా వున్నట్టు కనబడుతున్నది" అన్నాడు. ' తెలివితేటలు నాకు లేకపొతే ఇంకెవరికి ఉన్నాయి? నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు" అన్నాడు సోము. 'మన ఇంట్లో గొర్రె చర్మం వుంది. దానిని రేపు సంతలో అమ్ముకుని రా, నీ తెలివితేటలు చూద్దాం ' అన్నాడు రైతు. 'క్షణంలో చర్మం అమ్మేసి డబ్బు తీసుకువస్తాను చూడూ అన్నాడు సోముడు. 'ఓరి పిచ్చివాడా, చర్మం అమ్మి డబ్బులు తీసుకురావటంలో తెలివి ఏమున్నది? ఆ పని ఎవడైనా చేస్తాడు. నిజంగా తెలివిగలవాడివైతే చర్మమూ, దాని ఖరీదూ కూడా తీసుకునిరావాలి" అన్నాడు రైతు. సోముడు కొంచెం కూడా ముందూ వెనకా ఆలోచించకుండా, 'ఓ, అలాగే చేస్తాను, రేపు సాయంకాలం లోపల గొర్రె చర్మమూ, దాని ఖరీదు కూడా తెస్తాను చూసుకో ' అని ప్రగల్భాలు పలికాడు.

మర్నాడు ఉదయం పెందలాడే వాడు గొర్రెచర్మం చుట్టి, చంకన పెట్టుకుని సంతకు బయలుదేరాడు. వాడు సంతలో అడుగు పెడుతూండగానే ఎవరో ఎదురై, " గొర్రెతోలు అమ్మకానికా? ఎంతకిస్తావు?" అని అడిగాడు. "ఎంతకిచ్చినా నాకు తోలూ, దాని ధరా కూడా కావాలి" అన్నాడు సోముడు. అవతలివాడు గట్టిగా నవ్వి, "భలే ఆలోచనే! ఇటువంటి గొప్ప ఆలోచన ఇంతవరకు ఎవరికీ తట్టలేదు. ఐనా నలుగురినీ అడిగి చూడూ అంటూ తన దారిన తాను వెళ్ళాడు. సంతలో ఎంతోమంది సోముడిని చర్మం ఖరీదు అడిగారు. కానీ, వాడు అదే సమాధానం చెప్పడంతో నవ్వి వెళ్ళిపోయారు.

మిట్టమధ్యాహ్నం దాటిపోయింది. పొద్దువాలిపొతున్నది. సోముడు చంకన ఇంకా గొర్రెతోలు అలాగే వుంది. సంత అంతటా తిరిగి తిరిగి వాడు ఒక గుంపు గుమికూడి ఉన్న చోటికి వచ్చాడు. ఆ గుంపు నడిమధ్య ఒక విప్రవినోది ఇంద్రజాలం చేస్తున్నాడు. వాడు సోముణ్ణి చూడగానే, "అబ్బాయీ, ఈ తోలు ఒకసారి ఇయ్యి, మంచి వినోదం చూపిస్తాను" అన్నాడు.

సోముడు తోలుని ఇచ్చాడు. వాడు ఆ తోలు చుట్టను భూమి మీద నిలబెట్టి, దానిపైన ఒక బట్ట కప్పి, అందరినీ చప్పట్లు కొట్టమన్నాడు. అప్పుడు పై బట్టను తీసేసరికి అక్కడ ఒక మామిడిమొక్క ఉన్నది. దానికి ఒక మామిడికాయ కూడా ఉన్నది.

సోముడు మొదట ఆశ్చర్యపడ్డాడు, మళ్ళీ తేరుకునేసరికి ఆ విప్రవినోదిని కాస్తా అదృఉశ్యమయ్యాడు. రైతు కొడుకు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. వాడు చర్మాన్నీ, దాని ఖరీదునూ కూడా తెచ్చి ఇస్తానని తండ్రికి మాట ఇచ్చాడు. ఇప్పుడు వట్టి చేతుల్తో ఇంటికిపోతే తనకు బుధ్ధి లేదని రుజువవుతుంది. ఈ మనోవేదనకు తోడు వాడికి ఆకలి కూడా వేస్తున్నది. ఎదురుగా ఉన్న మామిడి మొక్కకు కాయ కనిపిస్తున్నది.దాన్ని తిని అయినా ఆకలి బాధ కొంత నివారించుకుందామనుకుని వాడు ఆ కాయను పట్టుకున్నాడు. వెంటనే మామిడి మొక్క మాయమై గొర్రెచర్మం కనిపించింది. అంతే చాలు అనుకుని, సంతోషంతో వాడు ఆ గొర్రెచర్మం చుట్టి చంకన పెట్టుకుని ఇంటిదారి పట్టాడు. సూర్యాస్తమయం కాబోతున్నది. దారి నిర్మానుష్యంగా ఉన్నది. కొంతదూరం వెళ్ళేసరికి వెనకనుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. సోముడు తిరిగిచూస్తే అక్కడ వాడికి విప్రవినోదిని కనిపించాడు.

విప్రవినోదిని సోముడి వెంట నడుస్తూ, " నువ్వు చాలా బుధ్ధిమంతుడివి. నీకొక్క సలహా చెబుతాను, దానిని మర్చిపోకు! దారిలో ఆడవాళ్ళు కనబడితే వాళ్ళను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వెయ్యి, చాలు" అని చెప్పి వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు. సోముడు తన గ్రామం వైపు నడుస్తూ చీకటి పడేసరికి ఒక వాగు వద్దకు వచ్చాడు. ఆ వాగుకు అంతదూరంలో ఒక ఇల్లు వున్నది. ఆ ఇంట్లోంచి ఒక పదహారేళ్ళ పిల్ల బిందెతో వచ్చి వాగులో నీళ్ళు తీసుకోడం చూసిన సోముడికి విప్రవినోదిని ఇచ్చిన సలహా గుర్తు వచ్చింది. అప్పుడు "అమ్మాయీ, అంతా కులాసానా?" అని అడిగాడు.

"మీరంతా కులాసాయేనా?" అని ఆ అమ్మాయి కుడా అడిగింది. ఇద్దరూ మాట్లాడుకోవటంలో, ఆ పిల్ల సోముడు పొద్దుటినుండీ భోజనం చెయ్యలేదని తెలుసుకుని, అతన్ని తన ఇంటికి తీసుకుపోయి జొన్న రొట్టెలు పెట్టింది. తరువాత అతన్ని గొర్రె తోలు గురించి అడిగింది. "మా అయ్య దీనిని అమ్మి దీని ఖరీదూ, చర్మమూ కూడా తీసుకురమ్మన్నాడు, నాకు సాధ్యం కాలేదు." అన్నాడు బాధగా. "ఓస్‌, ఇంతే గదా, నేను నీకు చర్మమూ, చర్మం యొక్క ఖరీదు ఇస్తానుండు", అంటూ ఆ పిల్ల సోముడు వద్ద గొర్రె తోలు తీసుకుని దాని మీదున్న బొచ్చంతా కత్తిరించి, తోలూ, బొచ్చు ఖరీదూ కూడా సోముడుకి ఇచ్చేసింది.

సోముడు పరమానందం చెంది ఇంటికి వచ్చేసాడు. తన కొడుకు తెచ్చిన చర్మమ్మూ, డబ్బులూ చూసిన రైతు ఎంతో సంతోషించి, "నీకీ ఉపాయం చెప్పినది ఎవరు" అని అడిగాడు. "మగ కాదు, ఆడ మనిషి నాన్నా" అంటూ సోముడు సిగ్గుతో జరిగినదంతా చెప్పాడు.

"ఇదేనా నీ తెలివి? అటువంటి ఆడపిల్ల తటస్థపడితే వెంట తెచ్చుకుని పెల్లి చేసుకోరూ? నీకు తెలివితేటలు లేవని నేను మొదటి నుండి అంటూనే వున్నాను!" అన్నడు రైతు. సోముడు అప్పటికప్పుడే బయలుదేరి వాగు దగ్గరకి వెల్లి ఆ పిల్లతో, "నన్ను పెళ్ళాడతావా?"అని అడిగాడు. ఆ పిల్ల సిగ్గు పడుతూనే ఒప్పుకుని సోముడి వెంట వచ్చేసింది. అప్పుడు రైతు వాళ్ళిద్దరికీ ఘనంగా వివాహం చేసాడు.

నీతి:

కాబట్టి పిల్లలూ అందరికన్నా తనకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని గర్వించడం ఎంతమాత్రమూ వలదు.