Ugadi Geyalu

Bhargavi Rao

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



ఆమనీ వసంత యామినీ

ఆమనీ వసంత యామినీ ఎక్కడిదీ ఇంతహొయలు ఎందుకమ్మ ఇంతవగలు ||ఆమనీ|| కోయల గొంతుల కుహకుహలూ చైత్ర శోభల సరిగమలు రంగవల్లికల అల్లికలో శుభసందేశపు సంగీతాలు ||ఆమనీ|| మామిడి గుబురుల మధురిమలు తీగెల పూచిన మల్లియలూ ఆశల చిగురుల అందాలు అందరి మనసున ఆనందాలు ||ఆమనీ||



సంబరాలో సంబరాలు

సంబరాలో సంబరాలు ఉగాది పండుగ సంబరాలు ఉల్లాసంగా ఉత్సాహంగా అందరు కలసి ఆనందించే ||సంబరాలో|| ఉదయం లేచి తలంటి పోసి ఉగాది పచ్చడి రుచిచూసి సంతోషంగా ఆడీపాడీ పులిహోర బొబ్బట్లు తింటామండి ||సంబరాలో|| మామిడికాయలూ మల్లెపూవులు కోయల పాటల కొత్తదనాలు పెద్దలు చెప్పే మంచిమాటలు పిల్లలు చేసే తీర్మానాలు ||సంబరాలో||



ఉగాది పచ్చడి

రండి రండి పిల్లలూ ఇటురండి ఉగాది పచ్చడి రుచిచూడండి ||రండి|| రవ్వంత చేదు - కొద్దిగా పులుపు నోరంత తీపి, ఉప్పుకారాలు షడ్రుచులు కలసిన పచ్చడండి ఇది ఉగాది పచ్చడి! ||రండి|| జీవితమంటే ఇదే ఇదే చేదులాటి నిజాలు కొన్ని తియ్యటి పుల్లటి క్షణాలు కొన్ని ఉప్పూ కారం కలసీ మెలిసీ రంజుగ రుచిగా ఉంటుంది ||రండి||