దీపావళి

G.వెంకటేశ్వర రావు (G. Venkateshwara Rao)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here


వెండి వెన్నెల ఓ జాబిల్లీ
చూడలేవే నీవు దీపావళీ
నీవు లేని ఒక అమావస్య రోజునే
ఎంత సంబరపడెదరే జనావళి

అష్టభార్యలతో కులుకుతు
గగనములేలే నెలరాజువే
ఎన్నిశౌక్యములున్ననేమీ,
చూడలేవే నీవు దీపావళీ

దేశంకాని దేశంలో ఘనంగా
సకలభోగభాగ్యాలు అనుభవించుచూ
తృప్తిగా జీవించుచున్నాము గానీ
మేమూ చూడలేమే దీపావళీ

ఈ పాటికి మనవూరిలో
లేచి తలస్నానము చేసివుందురో
అమ్మ చేసిన పిండివంటలన్నీ
నిండుగా ఆరగించి పడుకుని వుందురో

హడావిడిగా లేచి బ్రేక్ఫస్ట్‌ దిగమింగి
"no shampoo" అను అరుపులతో త్వరస్నానం చేసి
హోంవర్క్‌ సర్దుకొని బుస్స్‌కై పరిగెత్తే
మా పిల్లలు చూడలేదే అసలు దీపావళీ

అక్కడ ఇప్పటికే వారం రోజులుగా
టపాకాయలు కాల్చివుందురే
రాత్రి కొరకు ఎదురు చూచుతూ
స్నేహితులతో క్రికెట్‌ ఆడుతుందురే

మరిక్కడైతే ఓ జాబిల్లీ
నెలరోజులుగా తెలుగుసంఘం డాన్సులకై
ప్రాక్టీసులతో అలసి విసిగెత్తిన పిల్లలు
ఊహించుకోనైనాలేరే అసలు దీపావళీ

అక్కడ మతాబాలు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు
రివ్వున గగనానికేగే రాకెట్టులు
ఢమాలుమని పేటంతా దద్దరిల్లే బాంబులు
ఎన్నికాల్చినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందే

వచ్చే సారైనా అందరం కలశి
ఈ పాటికి మావూరు వెడతాంలే ... లేకున్న,
నీకుమల్లేనే మా పిల్లలుకూడా
ఇక ఎప్పడికీ చూడరేమో దీపావళి!