ఎందరో హంతకులు అందరికీ నా విన్నపం....
Endaro hantakulu .. andariki naa vinnapamu

Kavita Sekhar

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

హత్య అనే పదానికి అర్థం -'సజీవంగా లేక బ్రతికున్నదానిని చంపేయడం ' అనుకుంటే, నేను చెబుతున్న హత్య కేసులో ఎందరో నిందితులు.రైలు వేగంగా వెళుతోంది. చల్లటి గాలికి కునుకు పట్టేసిన మౌనికకు లైటు వెలగడంతో మెలుకువ వచ్చింది. పక్కన తన తల్లి ఎదో అలోచిస్తున్నట్లుగా కిటికీ లోంచి చూస్తోంది. ఎదురుగా ఉన్నవాళ్ళు ఎక్కడ దిగిపోయారో తెలియదు కానీ ఆరుగురు కుర్రళ్ళ కొత్త మొహాలు కనపడ్డాయి. అంతా ఇరవై యేళ్ళ లోపు వాళ్ళే. మౌనికదీ ఇంచుమించు అదే వయస్సు. కుర్రాళ్ళు మహా హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు.వాళ్ళళ్ళో ఒకడన్నాడు, 'మావా! డిన్నరయ్యాక పేకాట మొదలెడదాం. అప్పటి దాకా సరదాగా ఒక గేము ఆడదాం'. బాసూ! మేమంతా రెడీ...అన్నారు మిగతా పాండవులు.

బాసు: మనం కరెక్టుగా అరగంట టైము పెట్టుకుందాం. ఈ అరగంటా అందరూ ఏదైనా మాట్లడవచ్చు. కాకపోతే అందులో ఒక్క 'ఇంగ్లీషు ' మాట కూడా ఉండకూడదు. ఎవడన్నా 'ఇంగ్లీషు ' మాట వాడితే వాడి నెత్తి మీద మిగతా వాళ్ళంతా మొట్టికాయ వేస్తారన్నమాట. ఎవడు అందరి కంటే తక్కువ మొట్టికాయలు తింటాడో వాడు గెలిచినట్టు.

మిగతా వాళ్ళంతా అదిరింది గురూ ...ఇక మొదలెట్టు మరి అన్నారు....

'సరే, అవర్‌ టైం స్టార్ట్స్‌ నౌ ' అని అన్నాడో లేదో వాడి నెత్తి మీద మొట్టికాయ పడింది.

'క్షమించరా బాబూ ఇంకా ఆట మొదవలేదు అనుకున్నా...నాయనా వికాసూ నివ్వు మొదలెట్టరా'.

వికాస్‌: ఏరా ఈ ట్రైను చెన్నైకు రైటు టైముకి చేరుతుందంటావా?

వెంటనే మొట్టికాయ పడింది. ట్రైను కాదు రైలు అనాలి వికాసుడా అంటూ....

మౌనికకు ఈ ఆట భలే సరదాగా అనిపించింది. దాదాపు అరగంటలో ప్రతీ వాడికీ మొట్టికాయాలు పడుతూనే ఉన్నాయి. ఇది సరదాగా ఆడే ఆటైనా ఒక్క నిమిషం మనం మాట్లాడే తెలుగులో ఎన్ని ఇంగ్లీషు పదాలు వాడతామో అనుకుంది. అసలు ఇంగ్లీషు వాడకుండా తెలుగు ఫ్లూయెంటుగా మాట్లడటం ఇంపాసిబుల్‌ అనిపించింది. కాసేపు 'ఫ్లూయెంటు ' కి తెలుగు మాట కోసం వెత్తుకుంది. ఊ హు....తనకి తట్టలేదు. పక్కనున్న తల్లిని అడిగింది...తల్లి నవ్వుతూ 'అనర్గళంగా ' అని చెప్పింది.మనస్విని ఆ మధ్య కలిసినప్పుడు ప్రేరణతో అంది, 'అక్కా, మొన్న చూసెళ్ళిన బెంగుళూరు సంబంధం వాళ్ళకి నేను నచ్చలేదట. 'అదేమిటే, చక్కగా ఉంటావు,చక్కటి చదువు, పెద్దకంపెనీలో ఉద్యోగం, ఒక్కగానొక్క కూతిరివి...వాళ్ళకింకా ఏమి కావాలట?' అని అడిగింది ప్రేరణ. మనస్విని అంది, ' మధ్యవర్తి ద్వారా తెలిసిందేంటంటే అక్కా,వాళ్ళకి అన్ని విధాలా సంబంధం నచ్చిందట కానీ నేను అంతా తెలుగులోనే మాట్లాడానట. ఇలా అచ్చ తెలుగులో మాట్లాడే అమ్మాయిని వాళ్ళ సర్కిల్లో పల్లెటూరి గబ్బిలాయ్‌ అనుకుంటారని, బెంగుళూరులో నేను అడ్జస్ట్‌ అవ్వలేనని అబ్బాయి అభిప్రాయ పడ్డాడట '.

'అదేవిటీ, నువ్వు ఇంగ్లీషులో గడ గడా మాట్లాడతావు కదా, పైగా ఇంగ్లీషు పోయెట్రీ లో నీకు ఆ మధ్య ప్రైజులు కూడా వచ్చాయి కదా ' అంది ప్రేరణ. 'నిజమే అక్కా కానీ , పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని మర్యాద కోసం తెలుగులో మాట్లాడాను. అయినా ఇదేవైనా బిజినెస్‌ మీటింగా? మనం తెలుగు వాళ్ళమయుండి తెలుగులో మాట్లడటానికి నామోషీ 'ఎందుకక్కా? అసలు ఇలాంటి సంబంధం తప్పిపోయినందుకు సంతోషంగా ఉంది ' అంది.

మనస్విని మాటలు విన్న ప్రేరణ చెల్లెల్ని మనస్ఫూర్తిగా అభినందించింది."ఒసామా బిన్‌ లాడెన్‌ అన్నమయ్య వి.సి.డి చూస్తుంటే... సోమవారం మొదలైన చిత్రహింసల టి.వి. సీరియల్‌ మంగళవారమే ముగిన్పుకొచ్చేస్తే... కొమ్మపై కోయిలమ్మకు జలుబే చేసి విక్సు వాడుతుంటే.... తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళతో ఈ రోజుల్లో పాటలు పాడిస్తే..... విడ్డూరం విడ్డూరం.....

ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలో పాట ఇది. సరదాగా రాసిన ఈ పాటలో ఆఖరి లైనులో ఎంతో నిజం ఉంది. అసలు మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు తొంభై సాతం హీరో ఇన్లకు తెలుగు రాదు. వచ్చినా తమ డబ్బింగ్‌ తాము చెప్పుకోరు. డబ్బింగు చెప్పేవారికి కూడా అసలు తెలుగు వచ్చో రాదో ననికొన్ని సార్లు అర్థం కాదు. ఎందుకంటే వారు మాట్లాడే తెలుగు అంత నాజూకుగా ఉంటుంది. అసలు ఇంగ్లీషులో రాసుకుని మాట్ళడుతున్నరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పట్టి పట్టి ఎంతో వయ్యారంగా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయింది. ఈ రోజుల్లో ఎంత ఎక్కువ ఇంగ్లీషు వాడితే అంత గొప్ప కదా! స్వఛ్చమైన తెలుగు వినడమే కరువైపోయింది.ట్రింగ్‌ ట్రింగ్‌...ట్రింగ్‌ ట్రింగ్‌....

హలో అని ఫోను ఎత్తింది కల్పన.

హలో వదినా, నేను భావనని అని పలికింది అవతలి కంఠం. ఆ చెప్పు భావనా..ఎలా ఉన్నారు ఏంటి సంగతులు అని అడిగింది కల్పన.

భావన: ఆ..... బావున్నాము వదినా. స్నేహకి మూడెళ్ళు నిండాయి కదా వచ్చే సంవత్సరం ఏ స్కూల్లో వెయ్యాలా అని ఇన్‌ ఫర్మేషన్‌ కలెక్టు చేస్తున్నాను. రెండు మూడు స్కూళ్ళను షార్టులిస్ట్టు చేసాము. సరే, నీ ఒపీనియన్‌ కూడా తీసుకుందామని కాల్‌ చేసాను. యెబిసి స్కూలు, పిక్యు ఆర్‌ స్కూలు బావున్నాయట.యెబిసి ఇంటికి దగ్గిర, డొనేషన్‌ తక్కువ కానీ అందరు టీచర్లూ పిల్లలతో ఇంగ్లీషు లో మాట్లాడరట వదినా. అందుకని పిక్యు ఆర్‌ ని ప్రిఫర్‌ చెస్తున్నాను. అక్కడయితే తెలుగులో మాట్లాడితే ఫైను కూడా వెస్తారట. ఏముంది ఆటో మాట్లాడితే సరిపోతుందనిపిస్తోంది...నువ్వేమంటావు వదినా...?

కల్పన: బావుంది భావనా. నీకు,విహారికి ఏది మంచి దనిపిస్తే అదే చేయ్యండి. కానీ మంచి నమ్మకమైన ఆటో వాడిని చూడండి. అసలే రోజులు బాగాలేవు, కొన్ని కేసులు వింటుంటే భయంగా వుంటుంది.

అలా వాళ్ళిద్దరూ కాసేపు అవీ ఇవీ కబుర్లు చెప్పుకున్నారు.

ఫోను పెట్టేసాక, కల్పన ఈ విషయం గురించి అలోచించింది. ఊళ్ళో యెబిసి స్కూలుకి మంచి పేరే ఉంది.భావన వాళ్ళ ఇంటికి పక్కనే ఆ స్కూలు. పిల్ల ఎక్కువగా అలసి పోదు.పైగా డొనేషన్‌ తక్కువ, సెంట్రల్‌ సిలబ్బస్‌. ఒకప్పుడు పిల్లల్ని ఏ స్కూల్లో వెయ్యలా అని అలోచించినప్పుడు - ఇంటికి దూరం, టేచర్లు ఏలా చెప్తారు,ఫీజులు,ప్లే గ్రౌండు, మిగతా సదుపాయాలు ఇలా అనేక విషయాల గురించి అలోచించేవారు. కానీ ఇప్పుడు ఆ స్కూల్లో ఇంగ్లీషు లోనే మాట్లడతారా లేదా అన్న విషయానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. లాంగ్వేజి సెలక్ట్టు చేసుకునేటప్పుడు తెలుగుకి బదులుగా 'స్పెషల్‌ ఇంగ్లీషు ' ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే 'తెలుగు ' కష్టమైన సబ్జెక్టు పైగా మార్కులు కూడా ఎక్కువ రావు అనేది చాలా మంది అభిప్రాయం. అసలు 'తెలుగు ' చదువుకోవడం వల్ల పెద్ద ఉపయోగాలేమీ లేవు అని యెంతో మంది తనతో అన్నారు కూడా.

పక్కింటి వాళ్ళ పాప గల గలా ఇంగ్లీషులో మాట్లాడుతుంటే వాళ్ళమ్మ మురిసిపోతుంది.మా అమ్మాయి ఇంత చిన్న వయస్సులోనే ఇంగ్లీషు లో దంచుతుంది అని ఆవిడకి ఎంతో మురిపెం. ఒకప్పుడు చంటి పిల్లలకు మాటలు నేర్పుతున్నప్పుడు పిల్లి,కుక్క,కాకి అని చెప్పేవారు. ఇప్పుడు కాట్‌,డాగ్‌,క్రో అని నేర్పిస్తున్నారు. అమ్మ,నాన్న బదులు మమ్మీ, డాడీ అనీ.... అత్తయ్య,మావయ్య,బాబాయ్‌,పిన్ని బదులుగా ఆంటీ అంకుల్‌ అని పిలవక పోతే కల్చురల్లీ బాక్వార్డ్‌ అనుకునే రోజులొచ్చేసాయి. అసలు పిల్లలు తెలుగు నేర్చుకోకపోయినా ఫరవాలేదు ఇంగ్లీషులో మాత్రం దంచేయాలన్న కోరిక తల్లితండ్రుల్లో పెరిగిపోయింది. కొంత మంది తల్లితండ్రులు పిల్లలకి త్వరగా ఇంగ్లీషు రావలని ఇంట్లో ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నారు. అందుకనే ఈ తరం పిల్లలు తెలుగు గడ్డపై పుట్టి పెరిగినా అందులో చాలా తక్కువ మంది మాత్రమే తెలుగు చదవగలుగుతున్నారు. ఇక వ్రాయడం సంగతి సరే సరి.

ఇంగ్లీషు నేర్పించడం నేర్చుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో బతికి బట్ట కట్టాలంటే ఆ భాషే ఎంతో అవసరం. కానీ ఇంగ్లీషు నేర్చుకునే మోజులో పడి మనం మాత్రుభాషని మరచిపోవడం ఎంత వరకు సమంజసం? ఇంట్లో పూజ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ తరం వారు ఎంత మంది మంత్రాలు, కధ చదవగలుగుతున్నారు? ఏ కాసెట్టో లేక సిడి పెట్టి పూజ జరిపించేసామని అనుకోవడం తప్ప! అందుకే 'తెలుగు ఛాలెంజ్డ్‌(హాండికాప్డ్‌ ') జనాభా తెలుగు వారిలో పెరిగిపోతోంది. అసలే కుంటుతున్న బాష కాళ్ళు,చేతులూ పోకుండా జాగ్రత్త పడాలి అనుకుంది కల్పన.

వెంటనే భావనకు ఫోను చేద్దామని ఫోను దగ్గరికి నడిచింది .మా బాబాయికి తెలుగుబాషంటే ఎనలేని అభిమానం.తనుండేది ఢిల్లీలో అయినా ఇంట్లో పిల్లలితో తెలుగులోనే మాట్లాడతాడు. వాళ్ళు పొరపాట్న హిందీలో మాట్లాడితే ఊరుకోడు...మీ హిందీ,ఇంగ్లీసు భాషా ప్రావీణ్యం అంతా బైట వెలగబెట్టండని అంటాడు. వాళ్ళబ్బాయి చుట్టు పక్కన చాలా 'ఇల్లులు ' ఉన్నాయి, బట్టలు 'ఎండలేదు ' లాంటి పదాలు వాడితే, బాబాయ్‌ వెర్రి కోపంతో ,'అన్ని దారిద్రాలలోకి దుర్భరమైనది బాషా దారిద్రం, సరిగ్గా తెలుగు కూడా మాట్లాడలేరు...తెలుగు ట్యూషన్‌ పెట్టించినా ఇలా అఘోరిస్తున్నారు...గ్రాంధిక బాష వాడక్కర్లేదు అసలు తెలుగులో సరిగ్గా మాట్లాడరా బడుద్ధాయ్‌...అంటూ ఛీవాట్లెట్టాడు. వేరే రాష్ట్రలలో, వేరే దేశాలలో ఉండి కూడా తెలుగిని బతికించుకోవాలని తాపత్రయ పడుతున్న వారూ ఉన్నారు....కానీ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగులో మాట్లాడటానికి సిగ్గు పడే సంస్కృఉతిని పారద్రోలే వరకు తెలుగు తల్లి హర్షించదు.కొంతమంది తాము తెలుగు వారని చెప్పుకోవడాం చిన్నతనంగా భావిస్తారు. కాలక్రమేణా వచ్చే మార్పులకనుగుణంగా మనమూ మారాలి. అన్నిటితో పాటుగా మన బాష కూడా మారుతుంది. మన బామ్మలు, తాతగార్లు మాట్లాడే బాష మనం మాట్లడలేము. కనీసం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాబోయే వారసులు ఇదివరకటి రోజుల్లో మన పూర్వికులు అంతా తెలుగులోనే మాట్లాడుకునేవారట పైగా తెలుగు చదవడమే కాదు వ్రాయడం కూడా చేసేవారట అని చెప్పుకునే రోజున తెలుగుబాష హత్యకు గురైనట్లు కాదా?

ఇతర బాషలను నేర్చుకోవాలి...కానీ మన మాత్రుబాషని ఎగతాళి చెస్తే మన కన్న తల్లిని ఎగతాళి చేసినట్టే. పరబాష మోజులో పడి మన బాషని చంపుకోవద్దు. ఈ హత్యలో మనం భాగం పంచుకోవద్దు.