గున్నమామిడి కొమ్మ

వారణాసి ప్రసాద్‌

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

గున్నమామిడి కొమ్మ
గుబురుటాకుల నుండి
సన్నగా వినిపించు సంగీతమది యేమో?
సందేశమది యేమో?

మావి పూవులు తిన్న మత్తకోకిలమొకటి
మైమరచి పాడేటి మధుర గీతంబేమో! ||గున్న||

నీలిమబ్బులగాంచి నెమలి పించము విప్పి
నయగారమునచేయు నటనంబదియేమో?
నాట్యంబది యేమో!

ప్రియమారదరిజేర్చు ప్రియుని కౌగిటనున్న
ప్రియురాలు చూపేటి ప్రేమాతిశయమేమో! ||గున్న||

పున్నమీ చంద్రుని పొడగన్నకడలిలో
పొంగి పొరలేదివ్య శృంగారమది యేమో!
సౌందర్యమది యేమో!

అనురాగమొలికించు ఆత్మీయులనుగూర్చు
అనురాగమొలికించు ఆత్మీయులనుజేర్చు
అనుపమానంబైన అనుభవంబదియేమో!
ఆకర్షణదియేమో! ||గున్న||