జవాబు తెలియని ప్రశ్నలు

Kavita Ganduri

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

ప్రియంవద, అంటే నా పేరే. ప్రీతం, మా వారు, సాయంకాలం నవలడానికి ఇంట్లో ఏ గడ్డి (చిరుతిళ్ళు) లేవంటే, ఇదిగో ఈ రోజు తీరిక చేసుకుని, చేగోడీలకి పిండి తడిపాను. తెలియకుండా కిలో పిండి కలిపేశానేమో, అన్నీ ఒక్క దానే ఒత్తాలంటే....బాబోయ్‌ అనుకుంటూ...కాస్త టి.వీ చూస్తూ వత్తుదామని హాలులో చాప వేసుకుని కూలబడ్డాను.అబ్బా, ఏ ఛానెల్‌ పెట్టినా...సినిమాల సోదో లేక ఏడుపు సీరియల్స్‌...నొక్కుతున్న రిమోటు బటన్‌ లు ఒక్కసారిగా ఆపేసాను. 'ప్రజావేదిక కొద్ది క్షణాల్లో.....' అని చూసిన ఆ క్షణంలో...

టి.వి లో వేదిక మీద ఒక ఆంకరు, నలుగురు వక్తలు ఆశీనులయ్యి ఉన్నారు. ఒక్కొక్కరే పరిచయం చేసుకున్నారు.

మధ్యలో కూర్చున్నావిడ తన పేరు 'అనసూయ ' అని, హౌస్‌-వైఫ్‌ అనీ.... రోజంతా మనవలు, మనవరాళ్ళ బాగోగులు చూడటం, చదవటం, ఖాళీ సమయాల్లో చిన్న చిన్న కధలు రాయడం, తన హాబీలు గా చెప్పారు.

తర్వాత మధురిమ (35 సంవత్సరాలుంటాయేమో....ఆవిడ కట్టిన బ్లూ కలర్‌ బిన్నీ క్రేప్‌ సారీ నన్ను ఆకట్టుకుంది) , సమన్విత(కాలేజి స్తూడెంట్‌), సునయన (స్కూల్‌ టీచర్‌, పాతికేళ్ళుంటాయేమో....నల్ల పూసల గొలుసు డెజైను చాలా బావుంది...) వారి వారి పరిచయాలు ముగించారు.

కమర్షియల్‌ బ్రేక్‌ రావడం, ఒక పాతిక చేగోడీలు వత్తడం ఒకేసారి జరగడంతో, స్టవ్‌ మీద బాణలి పెట్టి నూనె పోసి వెలిగించి వచ్చి కూర్చున్నాను.

**********************

ఆంకరు: ఈనాటి మన టాపిక్‌ ఫర్‌ డిస్కషన్‌ -'పెద్దవాళ్ళని రెటైర్మెంట్‌ హోంస్‌ లో ఉంచడం ఎంతవరకు సమంజసం?' ప్రతి ఇంట్లోనూ ఈ ప్రశ్న ఎప్పుడో అప్పుడు ఎదురవుతూ ఉంటుంది.మీ అభిప్రాయాలను తెలుపవలసిందిగా కోరుతున్నాను.

అనసూయ: ఇది చాలా మంచి టాపిక్‌ అండీ. ఎన్నో అలోచల్ని ప్రేరేపించే వివాదాస్పదమైన సబ్జెక్ట్టు .....ప్రతి ఇంట్లోనూ ఎదో ఒక రోజున ఎదురయ్యే సిట్యువేషన్‌ ఇది.రోజులు మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలున్న ఇళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. పిల్లలను పెంచి పెద్దచేసిన తల్లితండ్రులు పిల్లల మీద ఆధార పడే పరిస్థితి వచ్చినప్పుడు, వారి శేష జీవితాన్ని పిల్లలతో గడపాలనుకోవడం ఎంతో సమంజసం. అది పిల్లల భాద్యత కూడా. అటువంటప్పుడు తలెత్తే సమస్యలు ఎన్నో. చాలా సినిమాలలో చూస్తూ ఉంటాము......కానీ నా స్వానుభవం గురించి చెప్తాను. మా అత్తగారు పోయి చాలా కాలం అయ్యింది. ఆవిడ పోయాక మా మావగారు పెద్దకొడుకు దగ్గిర ఉండాలని మాదగ్గిరకు వచ్చినప్పటి సంగతులు మీతో పంచుకుంటాను.ఆయన వయస్సు 89 సంవత్సరాలు.ఆయన పనులన్నీ ఆయన చేసుకోలేకపోయేవారు.నాకూ వయస్సు మల్లటం వల్ల ఓపిక నశించి ఎంత డబ్బైయినా ఫరవాలేదు...పనివాడిని పెట్టుకుందామని ఎంతో వెతికాను...కానీ సరయిన వాళ్ళు దొరకలేదు.ఎంఈ చెయ్యలేని పరిస్థితి...ఆయన్ని ఇంట్లో వదిలి ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి....

మధురిమ: మా నన్నగారికి మగపిల్లలు లేరు. మా అక్క చాలా సంవత్సరాలనుండి అమెరికా లో ఉంది. నాన్నని ఎన్ని సార్లు పిల్చినా ఆయన ఈ వయస్సులో వెళ్ళే ఇంటరెస్ట్‌ చూపించలేదు.డబ్బు సహాయం తప్ప వేరే సహాయం చేయలేని పరిస్థితి దానిది. కని పెంచిన తల్లితండ్రుల ఋఉణం మనం ఎలాగూ తీర్చుకోలేము...రిటైర్‌ అయిన తర్వాత నాన్నని (అమ్మ లేదు) మా దగ్గిరకు రమ్మని బలవంత పెడితే వచ్చారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. మా పిల్లలకు నాన్న ఎన్నో కధలు, చక్కటి విషయాలు చెప్పేవారు. ఆయనకున్న రిచ్‌ experience ముందు నేటి ఎడ్యుకేషన్‌ ఎంత అనిపిస్తూ ఉంటుంది.స్వామీ వివేకానంద అన్నట్టు ఈ రోజుల్లో character building education అవసరం ఎంతయినా ఉంది.నాన్న ఉన్నప్పుడు నాకు ఎంతో మోరల్‌ సపోర్ట్‌ ఉండేది. పెద్దవారి సలహా విన్నాక నేను తీసుకున్న డెసిషన్‌ సరైనిదిగా తోచి నా కాన్‌ ఫిడెన్సు లెవెల్సు పెరిగేవి. అయితే, కొన్ని ప్రాక్టికల్‌ ప్రాబ్లంస్‌ చెప్తాను. టి.వి దగ్గిర మా పిల్లలకి, నాన్నకి వాదన వచ్చేది. పిల్లలు ఒక ఛానెల్‌ అంటే నాన్న న్యూస్‌ ఛానెల్‌ అనేవారు. పెద్దాయన, మీరే సర్దుకు పోవాలంటే బుంగమూతి పెట్టుకుని లోపలికి వెళ్ళేవారు.పాపం ఆయనకి న్యూస్‌ పేపరు, టి.వి న్యూస్‌ తప్పించి వేరే కాలక్షేపం ఏముంటుందని నాకనిపించేది.ప్రతీ విషయం లోనూ తలదూర్చి అనవసరంగా సలహాలు ఇస్తున్నారని పిల్లలు కంప్లైన్‌ చేసేవారు.పెద్దాయన ఛాదస్తం కొద్దీ ఎదో చెప్తారు, విని ఊరుకోమని సర్దిచెప్పేదాన్ని. ఆయనకీ మా పిల్లలకీ రెండు జెనరేషన్‌ ల గ్యాప్‌ కదా మరి!ఎవరో ఒకరు సర్దుకుపోవాలి...ఈ వయస్సులో ఆయన్ని మార్చడం.......?

సమన్విత: మా మామ్మగారు మా ఇంట్లో కొంత కాలం ఉన్నారు. poor old lady! she used to shower all her affection on me!.కానీ ఎప్పుడూ నా డ్రెస్సింగు, బిహేవియర్‌ మీద restrictions పెడుతూ ఉంటుంది. అమ్మ, నాన్న ఆవిడనే సపోర్ట్‌ చేస్తారు. తర్వాత నన్నే అడ్జస్ట్‌ అవ్వాలని కన్విన్స్‌ చేయడానికి ట్రయ్‌ చేస్తారు.ఆ క్షణంలో మామ్మ మీద చాలాకోపం వస్తూ ఉండేది.కానీ, poor old lady అని తర్వాత అనిపిస్తుంది.

సునయన: మా అత్తగారు, మావగారు మాతోనే ఉంటారు. అందరం కలిసి మెలిసి ఉంటాము. మా చంటాడిని నిశ్చింతగా ఇంట్లో వదిలి స్కూలికి వెళ్తున్నానంటే అది వారి పుణ్యమే...కొంచం మడి, ఆచారం, అంటు, సొంటు అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు మా అత్తగారు. ఇంకా ఎంత కాలమే నీ ఛాందస్తం అనడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి...మావారిది.కొన్ని కొన్ని సరదాలకు దూరం అయ్యనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు..సినిమాలకు వెళ్ళడం మానేసాము.హోటళ్ళకు వెళ్ళి చాలా సంవత్సరాలయ్యింది...మా అత్తగారు బైట భోంచేయరు...పెద్దవాళ్ళను ఇంట్లో వదిలి మనం తిరగటం బావుండదంటారు...మా శ్రీవారు...!

మళ్ళా నా చేగో డీలు వేయించుకునే అవకాశం ఇచ్చింది బ్రేకు...!

**********************

ఆంకరు: ఇలాంటి సమస్యలకు కొంత పరిష్కార మార్గం చూపడానికి retirement homes, old age homes' ప్రాచుర్యం లోకి వస్తున్నాయి. వీటి మీద మీ అభిప్రాయలను తెలపండి.

అనసూయ: ఒక రకంగా అలోచిస్తే ఈ old age homes బావుంటాయండి. ఒక వయస్సు వచ్చాక, అలాంటి చోట్ల ఉంటే పెద్దవాళ్ళకు బోలేడు కాలక్షేపం. తోటి వారంతా తమ వయస్సు వారే కాబట్టి వారి అలోచనలు, మనోభావాలు కలుస్తాయి. కనుక బాగా పొద్దుపోతుంది.వైద్య సహాయం అందుబాటులో ఉంటుంది, ఎల్లప్పుడూ కనిపెట్టుకునే నర్సింగ్‌ సదుపాయాలుంటాయి.తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు...చేసేవారికి, చేయించుకునే వారికి కూడా ఇబ్బంది ఉండదు.వీళ్ళకు చూడాలనిపించినా, పిల్లలకు చూడాలనిపించినా...ఎప్పుడుకావాలంటే అప్పుడే కలవచ్చు.అంతగా ఉండలేకపోతే కొన్ని రోజులు పిల్లల దగ్గిర ఉండచ్చు...

వెస్టర్న్‌ కంట్రీస్‌ లో ఇలాంటివి accept చేస్తారు కానీ, మన దేశం లో, సొసైటీలో ఇలాంటివి జీఇర్ణించుకోలేరు...దిక్కు, మొక్కు లేని వాళ్ళో, లేక వాళ్ళు మనకి బరువైపోయారని తీసుకెళ్ళి ఈ 'జైళ్ళలో ' పడేస్తున్నామనో, పెద్దవాళ్ళు ఆ వయసులో 'rejection' కి లోనవుతున్నామని కృంగిపోతారు. ఆ వయసులో వాళ్ళకి అన్నీ explain చేసి కన్విన్స్‌ చేయడం చాలా చాలా కష్టం. అసలు అంత సాహసం చెయ్యడానికి పిల్లలూ వెనకాడతారు....

మధురిమ: బాగా సెలవిచ్చారు అనసూయ గారూ....మన దేశంలో ఈ ట్రెండు రావడానికి చాలా సంవత్సరాలో, యుగాలో పడుతుంది.పిల్లలు బతికుండగానే అనాధులైపోయామని, ఈ వయసులో భగవంతుడు తమకి ఇలాంటి శిక్ష విధించాడని వారు కుమిలిపోతారు.... పెద్దవాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తప్పకుండా వస్తాయి.అంతమాత్రాన వాళ్ళని దూరంగా ఉంచితే సమస్యలు దూరంగా నెట్టెసినట్టే కానీ, వాటిని పరిష్కరించినట్టు కాదు. మనల్ని పెంచి పెద్దచేయడానికి వాళ్ళు ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. అంతమాత్రాన వారు మనల్ని ఏ హాస్టలుకో లేక మరో చోటీకో పంపించేసి మనల్ని వదిలించేసుకున్నారా? తప్పు ఎవరు చేసినా అది ఇంట్లో నలుగురితో పంచుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించి వారి మనసుని నొప్పించకుండా అర్థమయ్యేలా వివరించాలి.అలాగే పెద్దవారు కూడా తాము చెప్పినదే సరైనది, ఇంట్లోని వారంతా తమ మాటకే విలివివ్వాలని పట్టుదలకు పోకుండా ఉంటే, చాలా సమస్యలు సమస్యలుగా మిగిలిపోవు.

సమన్విత: ఒక మనిషి విలువ వెళ్ళిపోయాకే తెలిస్తుందంటారు....! మా తాతగారు చనిపోయాకే ఆయన లేని లోటు తెలుస్తోంది. probably ఆ వయస్సు వస్తే నేనూ ఛాదస్తంగా అయిపోయి నా గ్రాండ్‌ చిల్‌ డ్రెన్‌ కి క్లాసులు పీకుతానేమో అనిపిస్తుంది. grand parents తప్పని సరిగా మన ఇంట్లో నే ఉండాలి..ఈ జెనెరేషన్‌ ఆ జెనెరేషన్‌ కలిసి ఉండి adjustment కి అలవాటు పడటంలోనే ఎంటో maturity ఉంటుంది.

సునయన: చెప్పడానికీ, చెయ్యడానికీ ఎంతో తేడా ఉంటుంది సమన్వితా.నువ్వింకా చిన్నదానివి కనుక అలా అన్నావు.అందరూ విడిపోవాలన్న ఉద్దేశ్యం కాదు. మన పెద్దవాళ్ళు మనల్ని ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి పెంచి పెద్ద చేసారు.కాబట్టి వారి ఋఉణం మనం వాళ్ళని ఓల్డ్‌ ఏజి లో దగ్గిరుంచుకుంటే తీరిపోయినట్లే నా....? చిన్నప్పుడు నిన్ను నేను చూసాను కనుక పెద్దయ్యాక నువ్వు నన్ను చూసుకోవాలి అనుకోవడానికి ఇది ఏవైనా వ్యాపరమా? అప్పుడు లెక్క సరిపోతుందా? పరిస్థుతులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు.మన ఇష్టంతో ప్రమేయం లేకుండా ఈ జీవన యాత్రలో ఎన్నో సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి....

ఆదర్శానికీ, ఆచరణకీ ఎంతో దూరం ఉంటుంది. ఏదో మంచాన పడినప్పుడో లేక పిల్లలు భాద్యత స్వీకరించలేని పరిస్థితి ఉన్నప్పుడో, రిటైర్మెంట్‌ హోంలను ఆశ్రయించక తప్పదు.కాలానుగుణంగా మారక తప్పదు.రేపు నా పిల్లలు నన్ను ఓల్డ్‌ ఏజి హోమెలో ఉంచితే నేను దానిని accept చేయాలి...అదేనా మెచ్యూరిటీకి నిదర్శనం అవుతుంది.

మళ్ళీ బ్రేకు రావడంతో నా చేగోడీల డబ్బా నిండిపోయింది....

**********************

ఆంకరు: బావుందండీ డిస్కషన్‌ చాలా వేడెక్కుతోంది. అనసూయ గారు అన్నట్లు పెద్దవాళ్ళు మంచాన వున్నప్పుడు వారిని రిటైర్మెంట్‌ హోంసులలో ఉంచవల్సిన పరిస్థితి ఎదురవ్వ వచ్చు కానీ పెద్దవారి మనసును నొప్పించటడం అవుతుంది కనుక అది అంత సులువైన మార్గం కాదన్నారు.అలాగే మధురిమ గారు తల్లితండ్రులను దగ్గిరవుంచుకుని వారి యోగక్షేమాలను కనిపెట్టుకోవాలసిన బాధ్యత తమ పిల్లలదే నని ...ఈ ప్రాసెస్‌ లో ఎన్ని కష్టాలెదురైనా తట్టుకోవాలని అని అన్నారు.సమన్విత గారు కూడా ఇంచు మించు మధురిమ గారి అభిప్రాయాన్నే సపోర్ట్‌ చేసారు...ఇక సునయన గారు చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని రిటైర్మెంటు హోంస్‌ లో వుంచాలని అన్నారు.

అసలు ఏది రైటూ ఏది రాంగు అని తేల్చి చెప్పలేని టాపిక్కు ఇది...ఎందుకంటే ఇది కుటుంబ సమస్య...ఇది మనసులకు మన్యుషులకి, సంబంధిచిన విషయం. ప్రతి కుటుంబంలో పరిస్థితులు వేరుగా వుంటాయి కాబట్టి, ఇదీ సొల్యూషన్‌ అని తేల్చి చెప్పడం కష్టం.

మీరంతా మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో, మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శెలవతీసుకుంటున్నాను.

**********************

మధ్యాన్నం కునుకు తీసే అలవాటున్న నాకు ఆ రోజు రెప్ప పడలేదు...నిజమే కదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఆనందంతో పాటు ఎదురయ్యే సమస్యలు ఎన్నో అనిపించింది....

సాయంత్రం ప్రీతం చెగోడీలు లొట్టలేసుకుంటూ నములుతుంటే...దగ్గిరగా చేరి అన్నాను...

'మనం మాత్రం ఓపిక ఉండి మన కాళ్ళ మీద నిలపడగలిగినంత కాలం విడిగా ఉందాము.పండగలకీ, పబ్బాలకీ చూడాలనిపించినప్పుడు పిల్లల దగ్గిరకి వెళ్ళి వస్తూ ఉందాము.చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక పని పిల్లను పెట్టుకుందాము.కుదరక పోతే రిటైర్మెంటు హోంకి వెళ్ళి పోదాం '. ఎల్‌.కే.జీ. చదివేవాడిని పదవ క్లాసులో కూర్చోబెట్టినట్టు మొహం పెట్టారు ప్రీతం....!

కానీ నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది...ఏది రైటు ఏది రాంగు.. నాకూ తెలియదు...జీవితంలో కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం....