ఇండియా ఎండలు

Kameswari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here
ఎండలు ఎండలు 
మండే ఎండలు 
మోడు వారిన 
తరులతలు 
బీడు వారిన భూమి 
తడియారిన గొంతుల 
తేమలేని తటాక 
జలశయాలు 

కడివెడు నీటికై 
క్రోసెడు దూరం 
పరుగులు 
నీలాటి రేవులదరి 
కలహాల కోలాహలం 

గాడ్పులు, గాడ్పులు 
వడ్గాడ్పులు 
వసివాడిన ప్రకృతిని 
మలమల మాడ్చేగాడ్పులు 
అడుగులు బయటపెట్టు 
అదురుపుట్టు 
నీడపట్టున 
చేదదీర ఇచ్చపుట్టు 

కూలివారి కూలికి 
కూటికి కరవు 
కణకణలాడే ఎండల 
కాలే బాటల 
కాలినడక పయనాలకు వెరపు 
కార్లలో ఏ.సీ.వాహనాలలో 
కలవారి పయనాలు 
కలిగిన వారింట 
కూల్‌డ్రింకులు 
ఏ.సీ లు ఐస్క్రీములు 
ఫ్రిడ్జి నీటి చల్లదనాలు 
కడుపేదల 
గూడుల 
కడవనీటి చల్లదనాలు 
గంజిమెతుకులే గగనం 
విసిని కర్రలే వైభోగం 

వడగాడ్పుల 
హోరులో 
బడబానల హేలలో 
బడుగుజీవులెన్నోబలి 
గూడులెన్నో మసినుసి 
చలివేంద్రాలు 
చప్పబడిపోయి 
కొబ్బరి నీరు 
కూల్‌డ్రింకులు 
ఐస్క్రీములు 
ఏ.సీలగిరాకి పేరుగు 
ఎండలు ఎండలు 
ఇండియా ఎండలు