ప్రకృతి-పురుషుడు

Kameshwari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereపచ్చదనాలే పడతిగ  
పసిడి భాగ్యాలె పొలతిమేని చాయగ 
సంపెంగ సొంపైన నాశికగ 
నీలాల నింగి తేలియాడు 
మేఘమాలికలె నిగనిగలాడు కురులుగ 
సొగసరి మీనాలె సోగకన్నులుగ 
నల్లని భ్రమరమ్ములె 
విల్లంటి కను బొమలుగ 
విద్యులతలె వేణీబంధాలుగ 
రవిరాజు రేరాజు 
రంగారు బంగారు 
శిరోభాషనాలుగ నొప్పార 
వాగువంకలన్ని 
వంపుసొంపులై 
నురుగుల పరుగుల 
సాగర గమనాలె 
సొగసరి నడకలుగ 
పచ్చని పచ్చిక పైరులన్ని 
పట్టు వలువలుగ 
మంచుముత్యాలె 
ముత్యాలసరాలుగ 
సెలయేటిగలగలలె 
కాలి అందియ సవ్వడులుగ 
మణిమాణిక్యాలె 
మేని అలంకారములుగ 
కోయిల గానాలు 
కమ్మని కంఠస్వరముగ 
కలహంసల నడకలె 
కల కంఠ వయ్యారాలుగ 
మలయమారుతాలె 
ముసి ముసి నవ్వులైన 
ముగ్ధ మోహనాంగిగ 
ప్రకృతి కన్నెనుగాంచి 

ఫాలనేత్రుడు 
ప్రణవనాదాలె 
ప్రణయ రాగాలుగ 
ప్రమధ గణాలె 
పురోహితులుగ 
ఢమ ఢమ ఢమ 
ఢమరుక ధ్వనులే 
మృదంగ వాద్యములుగ 
మూడు నేత్రములు 
మోహావేశాన 
అరనిమోతాలుగ 
విభూదిరేఖలె 
విరజిమ్మే అత్తరులుగ 

పరవశుడై 
పురుష పుంగవుడే 
సరగున ఆశగ 
అందాల ప్రకృతికన్నె 
సరసన జేరి 
పరిణయమాడె 
నందివాహనుడు 
ప్రకృతి పురుషుల 
ప్రణయానందాల 
విశ్వమంత వినూత్న 
శోభల పులకించి 
ఫలపుష్ప భరితమాయె 
కుహు కుహు కోయిల కమ్మని గానాల 
కలహంసల నాట్యాల కళకళలాడె 
సప్తవర్ణాల హరివిల్లె 
సుందర సుమతల్పమాయె 
నవధాన్యరాశులే 
సడ్రసోపేత విందులాయె 
ఫలములన్ని ఫలహారములాయె 
అంత 
ప్రకృతి పురుష 
ప్రణయకలహాలె 
ప్రళయహేతువులై 
ప్రకృతికాంత కినుకను 
విసరిన కురులె 
మెరపులు ఉరుములు 
వానలు వరదలై 
ఉప్పెనలై పుడమిని ముంచ 
పశువృక్ష పక్ష్యాది 
మాన వాళి 
మట్టిపాలాయె 
పురుషుడలగి 
విసరిన జటాజూటమే 
మృత్యుఘంఠమై 
డమరుకధ్వనులే 
మృత్యు మృదంగమై 
శంఖారావమ్మె 
శోకగీతములై 
హాలాహల జ్వాలలై 
అంతర్యుద్ధములురేగి 
అణ్వస్త్రప్రయోగాల 
భువిదద్దర్లి భూప్రకంపనల 
అనువులు బాసె జీవకోటి 
బూదిరాసులుగ భావనగృహాదులు 
భూసమాధికాగ 
ప్రకృతి పురుషులవైర 
విలయ తాండవాన 
విశ్వమంత విలవిలలాడె 
పుడమి అంత జలమయమై 
పురుషుడలిగి తొలగిపోవ 
ప్రకృతి వికృతిగా మారి 
పుడమితల్లికి 
పట్టరాని గర్భశోకమాయె