సంక్రాంతి

Kameswari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereశుభోదయం శుభోదయం
సంక్రాంతి శుభోదయం
సర్వలక్షణ సుశోభిత
పర్వదినం సంక్రాంతి శుభోదయం

పండిన పంటలతో
దండిగ యిల్లునిండగ
రైతన్నల కన్నుల
నూతన కాంతులు

మంచు సోనలమధ్య
వీధివీధి తిరుగు
జంగమదేవర
పొద్దుపొడుపు
హరిలోరంగ హరి పాటల
శుభోదయం

మామిడి తోరణాలు
పచ్చని పసుపును
ఎర్రని కుంకుమబొట్లతో
కళకళలాడు గుమ్మములు

ముద్దుగుమ్మలు దిద్దిన
రంగురంగుల రంగవల్లులు
ముద్దబంతి పూలాంకరణాలు
ముచ్చటగా గొబ్బిళ్ళు
తమతమ కోర్కెల
తమకములతో
పడుచుపిల్లల
గొబ్బెమ్మపూజలు
సంక్రాంతి శుభోదయం

పసిపిల్లల చీడపీడలు
పరిహారార్ధం పేరంటాలు
భోగిపండ్ల సంబరాలు
సంక్రాంతి శుభోదయం

షడ్ర్సోపేతరుచుల
వంటల సమారాధనలు
పట్టుచీరల పరపరధగధగలు
పుణ్యస్త్రీల పసుపుకుంకుమ
పంచిపెట్టుతో
సంక్రాంతి శుభోదయం

కనుమస్నానాలు
మినుము వంటలు
గారెలు బూరెల విందులు
గంగిరెడ్లవారి గంటలు
బాకామోతలు
గడపగడపకు తిరుగు
డూడూ బసవన్నల
మువ్వల గణగణలు
దీవెనలు
పగటి వేషాల వినోదం
పల్లె పల్లెలలో పరసలు
పొంగులు చక్కెర చిలుకలు
చిన్న చిన్న బొమ్మలు
రంగు రంగుల కళ్ళద్దాలు
బూరాలు బాకాల అంగళ్ళా
గారడి వారి గరిడివిద్యలు
గందర గోళాలు
కోలాహలాలు
వలువేడుకల పర్వదినం
సంక్రాంతి శుభోదయం