అయ్యబాబోయ్‌ .......అబ్బాయా....?

Kavita Ganduri

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఏవిటి ...మళ్ళీ మగపిల్లాడా? తన కోడలు ముచ్చటగా మూడోసారి కూడా మగపిల్లాడిని కనేసరికి బావురుమంటూ నిట్టూర్చింది వాసంతి. ఆడపిల్ల పుట్టాలని తను మొక్కిన అమ్మవార్లు,వ్రతాలు పూజలు చేయించుకున్న వైభవ లక్ష్మి మరియు ఇతర లక్ష్ములు తననిలా నిరుత్సాహ పరుస్తారని కలలో కూడా ఊహించలేదు. తనకెటూ ఆడ పిల్లలు లేరు, కనీసం వచ్చే కోడలైనా ఇంటికి లక్ష్మీ దేవిని తెస్తుందని వెతికి వెతికి ఏడుగురు ఆడపిల్లలున్న ఇంటినుంచి విభావరిని తెచ్చుకుంది వాసంతి.వీధి గది తలుపులు బార్లా తీసి ఉన్నాయి. హేమలత ఆశ్చర్యంతో ఇంటి లోపలికి వెళ్ళింది. హాలులో ఎవరూ లేరు. ఎవరూ చూడకపోయినా టి.వీ లో ప్రోగ్రాంసు ఏవీ పట్టనట్లు వాటిదారిన అవి వస్తూనే ఉన్నాయి. అన్ని గదుల్లో ఫ్యాన్‌ లు,లైట్లు వాటి వాటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. హేమలత 'వాసంతీ' , 'వాసంతీ' అని రెండు సార్లు పిలిచినా రెస్పాన్సు లేదు. ఏ బాతురూములోనో ఉండి ఉంటుంది అని అనుకుంది కానీ అన్ని తలుపులూ తెరిచే ఉండడంతంతో ఖంగారుగా పెరటి వైపుకు వెళ్ళింది. అక్కడ పడక కుర్చీలో పట్టపగలు ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కనపడింది వాసంతి.

ఎవిటే వాసంతి...పగటి పూట ఏవిటీ పరధ్యానం ? నేను ఇంట్లోకి వచ్చి పది నిమిషాలయ్యింది. ఏ దొంగాడు ఇంట్లోకి జొరబడినా అడిగే దిక్కు లేదు. అలా తలుపులన్నీ తీసి నువ్విలా పెరట్లో ఆకాశంలో పగటి పూట చుక్కల్ని లెక్క పెడుతున్నావా? అని హేమలత గల గలా మాట్లాడుతుంటే అప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చింది వాసంతి. అసలు ఇంతకు ముందు తానేమీ విననట్టు ....'రావే హేమా రా...ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఇదేనా రావటం'..అంటూ పలకరించింది వాసంతి. రెండు సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితురాళ్ళు కులాసా కబుర్లు చెప్పుకుంటూ కుర్చీల్లో కూల బడ్డారు. హేమలత: ఏవిటే వాసంతి...నీలో చాలా మార్పు కనిపిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం నేను దుబాయి వెళ్ళేముందు నిన్ను చూశాను. మనిషివి చిక్కడంతో పాటు కళ్ళకింద కూడా కాటిక పెట్టినట్టు ఆ అలంకారం....ఏవిటి సంగతి...అంతా కులాసానా?

వాసంతి: నీదగ్గిర దాచేదేముందే హేమ......నీ అంత అదృష్టం లేదు నాకు. హాయిగా ఇద్దరే ఆణిముత్యాల్లాంటి ఆడపిల్లలు...ఇద్దరికీ సంబంధాలు వెతుక్కుంటూ వాకిట్లోకి వస్తే పెళ్ళిళ్ళు చేసేసి, పురుడ్లు పోసేసి హాయిగా మనవలు మనవరాళ్ళ కోసం దేశాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నావు.

హేమ: నీకు మాత్రం ఇప్పుడేమి తక్కువ? మీవారు రెండు చేతులా సంపాదిస్తున్నారు, లంకంత కొంప,చేతికింద పనివాళ్ళు. ఒక్కగానొక్క బంగారం లాంటి కొడుకు. అమెరికాలో పెద్ద ఉద్యోగంలో స్థిరపడ్డాడు. రేపో మాపో తగ్గ కోడలొస్తుంది. ఇంక నువ్వు కూడా దేశాలన్నీ తిరిగి రావచ్చు కదా....

వాసంతి: అదేనే.... ఆ రేపో మాపో రోజు రావడానికి రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అన్నీ ఉన్నాయి మా వాడికేమి తక్కువ...'కో' అంటే కోటి మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారు అనుకుంటే ఒక్క సంబంధం కూడా కుదరటం లేదు. మొదట్లో జాతకాలు,శాఖలు,ఇంజినీరుంగు బాగ్రౌండు,కనీసం 5'4" పొడవు,చిన్న కుటుంబం ఇలా కొన్ని కోరికలుండేవి. ఇప్పుడు ఏదీ పట్టించుకోవటం లేదు. అమ్మాయి షుమారుగా ఉండి,గ్రాడ్యుయేటు అయ్యుండి మంచి కుటుంబం నుంచి వస్తే చాలనుకుంటున్నాము. అయినా సరైన సంబంధం రావటం లేదు....ముద్దు ముద్దుగా ముప్ఫైయ్‌ మూడేళ్ళు వచ్చేసాయి మా విహాన్‌ కి.

హేమ: అసలేమిటి ప్రాబ్లం? ఈ మధ్య చాలా మంది దగ్గిర మగపిల్లలకు అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉందని వింటున్నాను.

వాసంతి:ఒకటా రెండా ....ముప్ఫై సంబంధాల దాకా చూసాము ఇప్పటికి. అందులో పాతిక మావాడి వరకు కూడా వెళ్ళలేదు. తెలిసిన వాళ్ళందరి దగ్గిర మావాడి బయో డేటా, ఫోటోలు ఉన్నాయి. పెద్ద పెద్ద మ్యారేజి బ్యూరోలన్నిటిలో డబ్బులు కట్టడం అయ్యింది. మావాడికి కూడా విసుగు పుట్టి వాడే అమ్మాయిని వెతుక్కుంటానంటూ తెలుగుమాట్రిమోని.కాం,షాదీ.కాం లాంటి సైట్లలో రిజిస్టరు కూడా చేసుకున్నాడు. మావాడి పెళ్ళి చూపుల అనుభవాలని ఒక పుస్తకం వ్రాయచ్చునేమో అనిపిస్తోంది.

ఈ మధ్యన ఇక్కడే హైదరాబాదులో ఒక అమ్మాయిని చూసాము. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది,M.C.A చేసింది. నేను మావారు వెళ్ళి చూసి అంతా బావుంది అనుకున్నాము. ఆ అమ్మాయి తల్లితండ్రులు అసలు పెళ్ళి అయిపోయినట్టే అంతా మాట్లాడారు. ఇంకేముంది పిల్లా పిల్లాడు ఒకరి నొకరు చూసి 'ok' చేసుకోవడమే తరువాయి అనుకున్నాము. మావాడు అతి కష్టం మీదం ఒక వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి దిగాడు. పెళ్ళి చూపుల్లో ఆ పిల్ల మావాడితో ప్రైవేటుగా మాట్లాడాలంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఈ రోజుల్లో ఇదంతా మామూలే కదా. ఒక అరగంట తర్వాత మావాడు బయటకి వచ్చాడు. సరే ఏ సంగతి ఇంటికి వెళ్ళి ఫోను చేస్తామని చెప్పాము. మా వాడు కారెక్కెగానే అమ్మాయి నచ్చలేదని బాంబు పేల్చాడు. అందం కాదు,చదువు కాదు...ఏవిటో సరిగ్గా చెప్పడు. నాకూ వాడికీ పెద్ద గొడవ. చివ్వరికి వాళ్ళ నాన్నగారు సరైన కారణం చెప్పక పొతే మాట్ళాడననేసరికి అప్పుడు వాడు నెమ్మదిగా విషయం చెప్పాడు.

ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాక తనకీ సంబంధం ఇష్టం లేదని తన క్లాస్మేట్ని ఇష్టపడుతోందనీ, కానీ ఆ అబ్బాయి సెటిల్‌ అయ్యేదాకా వెయిట్‌ చెయ్యాలని, ఇంట్లో చెప్తే చంపేస్తారని అందుకని మావాడ్నే తను నచ్చలేదని చెప్పమని ఆర్డరు వేసిందట. మా వెర్రి వెంగళప్ప ఎక్కడ ఆ అమ్మాయి వాళ్ళు ఆ అమ్మాయిని కష్టపెడతారో అని భయపడి మా దగ్గిర కూడా వెంటనే చెప్పలేదు. అసలు ఇంకోళ్ళయితే ఆ తల్లి తండ్రుల దగ్గిరకి వెళ్ళి చడా మడా మని నాలుగూ పెట్టేవాళ్ళు. అసలు అంత ఇష్టం లేని పిల్ల రెండో సారి పెళ్ళి చూపులకెందుకు ఒప్పుకుందో తెలియదు. మావాడు ఎంతో కష్టం మీద సెలవు పెట్టి అంత దూరం నుంచి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు. పైగా ఆ పిల్ల అంటుందిట " పెళ్ళయ్యాక మీ జీవితం స్పాయిల్‌ చెయ్యకుండా నేను మీకు ఇప్పుడే ఈ విషయం చెప్పినందుకు మీరు నాకు థ్యాంక్సు చెప్పాలి" అని

హేమ: ఇదేదో సినిమా కధలా ఉంది వాసంతి..ఈ రోజుల్లో అమ్మాయిలు తమకిచ్చిన స్వేఛ్చని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ మధ్యన ఒకే కంపనీలో పని చేసే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం తరచుగా వింటున్నాను. వాళ్ళిదరికీ కామన్‌ పాయింటు ఏవిటంటే ఒకటే కంపెనీలో పనిచేయడం...నెల తిరిగే సరికి చేతినిండా డబ్బులు, పెళ్ళైయ్యాక వేరే ఊరు మారక్కర్లేదు...'Marriage of Convenience'. సాఫ్టువేరు కంపెనీల్లో పని చేసే అమ్మాయిలు చాలా మంది తమ పార్ట్నరును తామే ఎంచుకుంటున్నారు. మాకు తెలిసినావిడ ఆ మధ్యన కలిసినప్పుడు వాళ్ళమ్మాయి గురించి చెప్పి ఒకటే బాధపడింది.... వాళ్ళమ్మాయి, అల్లుడు ఇలాగే పెళ్ళి చేసుకున్నారని, వెరే మతమైనా ఒప్పుకున్నామని చివ్వరికి ఇప్పుడు ఇద్దరూ సఖ్యంగా ఉండటం లేదట.

వాసంతి: అందరూ ఇలా ఉంటున్నారని కాదుకాని ఈ మధ్యన అమ్మాయిలను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అబ్బాయి హైటు ఇంతకంటే ఉండకూడదని,ఏజు గ్యాపు రెండేళ్ళకు మించరాదని,పెళ్ళయ్యాక జాయింటు ఫామిలీలో ఉండకూడదని,పేరెంట్సు ఇంటికి వచ్చినా నెలల తరబడి తిష్ట వేయకూడదని,ఆడబడుచులు ఉండకపోతే మంచిదని,...ఉన్నా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యిపోయి ఉండాలట...ఇలా ఒకటి కాదులే పెళ్ళికి ముందే అనేక కండిషన్‌ లు.

ఆరునెలల క్రితం మా విహాన్‌ అక్కడే M.S. చేసిన ఒక అమ్మాయిని చూసాడు. ఒక నెల రోజులు ఫోన్‌ లు,చాటింగులు నడిచాక ఇద్దరూ ఒక ప్లేస్లో మీట్‌ అయ్యారు. మాట్లాడిన మూడు గంటల్లో ఆ అమ్మాయి మా వాడు మాట్లాడటానికి ఒక పావుగంట ఛాన్సు ఇచ్చిందట. మావాడు కాస్త పిల్ల టాకెటివ్‌ అనుకున్నాడు. నువ్వు ఈ దేశంలోనే (అమెరికాలో) సెటిల్‌ అవ్వాలని కండిషన్‌ పెట్టిందిట. మన పిల్లలు వేరే దేశస్థులను పెళ్ళి చేసుకుంటే నువ్వు ఆక్సెప్టు చేస్తావా, నీ ఫామిలీతో నీ కెటువంటి కమిట్మెంట్సు ఉన్నాయి...ఇలా అనేక ప్రశ్నలు వేసిందిట. ఇలా మాట్లాడితే బ్రాడ్మైండెడ్‌ నెస్సు,ఫోర్థాటు ఉందని అనుకుంటారు కాబోలు. అసలు పాతిక ముప్ఫై సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు తీసుకునే డిశెషన్‌ స్కి నువ్వు ఎలా రియాక్టు అవుతావు అంటే ఎవడు చెప్పగలడు? ఆ రోజు పరిస్తితులను బట్టి డిసెషన్‌ తీసుకోవచ్చు. ఒక వేళ ఇప్పుడు ఎదో ఒక సమాధానం చెప్పినా పాతిక ముప్ఫై సంవత్సరాలలో ఒక మనిషి ఆలోచనా విధానం ఎన్నో మార్పులకు గురవుతుంది. ఎక్కడ సెటిల్‌ అవ్వాలన్న డెసిషన్‌ ఎప్పుడూ మన చేతుల్లో ఉండక పోవచ్చు. తల్లి తండ్రులతో పిల్లలకున్న కమిట్మెంట్సు పెళ్ళికి ముందే తెలుసుకోవాలనుకున్న పిల్ల పెళ్ళయ్యాక ఎన్ని షరతులు పెడుతుందోనని మావాడు ఆ సంబంధం వద్దనుకున్నాడు.

ఇలాంటి కబుర్లు కాలక్షేపానికి బానే ఉంటాయి కానీ లైఫ్‌ లో డెసిషన్స్‌ కి డిసైడింగ్‌ ఫాక్టర్స్‌ కాకూడదంటాడు విహాన్‌.

ఇలాగే వాడు ఇంకో ఇద్దరు అమ్మాయిలను అక్కడే చూసి వద్దనుకున్నాడు. ఒకమ్మాయి తను చేసుకోబోయేవాడు ముందు తన ఫ్రెండ్సుకు నచ్చాలని అందిట.

హేమ: స్వేచ్ఛ,స్వాతంత్రం,ఇండిపెండెంటు థింకింగు ఉండటం ఎంత అవసరమో వాటి హద్దులు కూడా తెలుసుకోవాలని ఈ జెనెరేషన్‌ పిల్లలు గ్రహించుకోలేకపోతున్నారు. డేటింగు,పెళ్ళికి ముందు కలిసి ఉండటం లాంటి కాన్సెప్‌ ట్లు మనకు ఎంత వరకు ఉపకరిస్తాయని తెలుసుకోవటం ఎంతయినా అవసరం.

ఆ మధ్యన మా చుట్టాలబ్బాయికి ఎంగేజుమెంటు అయ్యాక పెళ్ళి కాన్సిలు అయ్యింది. ఫోనులో ఆ అమ్మాయి హనీమూనుకు యూరప్‌ వెల్దామన్నదిట. ఆ అబ్బాయి జపాన్‌ లో పనిచేస్తాడులే. అతను తనకు రెండు వారాల కంటే శెలవు దొరకదు ఈ లోగా పేరెంట్సు తిరుపతి,షిరిడి,వాళ్ళ సొంత ఊరు అవీ పెళ్ళైయ్యాకవెళ్ళాలంటున్నారు కాబాట్టి మనం జపాన్‌ లో కాపురం పెట్టాక యూరప్‌ వకేషన్‌ కి ప్లాను చేద్దాం అన్నాడట. ఆ అమ్మాయి పెళ్ళి కాకముందే తన ఒపీనియన్‌ స్కు విలువ ఇవ్వటం లేదు పైగా పేరెంట్సు సెంటిమెంట్సుకి ఇంతలా ఒగ్గుతున్నాడని పెళ్ళి కాన్‌ సిల్‌ అందిట. నా కయితే ఆ సంబంధం తప్పిపోవడమే మంచిదనిపించింది.

వాసంతి: బాగా చెప్పావు హేమ. ఈ రోజుల్లో మరీ పాత చింతకాయ పచ్చడిలా అమ్మాయిలు ఉండాలని ఎవరూ అనుకోవటం లేదు...కానీ పాశ్చాత్య దేశాల్లోని కల్చరును కాపీ కొట్టాలన్న తాపత్రయంలో తాము ఎటు పయనిస్తున్నామని మరచిపోతున్నారు. పెళ్ళికి ముందే అన్నీ తెలుసుకుని,మాట్లాడేసి అబ్బాయిని అతని కారెక్టరును కాచి వడపోద్దామనుకోవటం మూర్ఖత్వం. ఏ మనిషినైనా పూర్తిగా తెలుసుకోవాలంటే కొంత కాలం పడుతుంది. అది వారం,నెల,సంవత్సరం అని చెప్పలేము. ఒక్కోసారి ఒక మనిషితో ఆరు నెలలు మాట్లాడినా తెలుసుకోలేని విషయాలు ఆరు రోజులు కలిసున్నాక తెలుసుకోవచ్చు. పెళ్ళికి ముందు అందరూ తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఇంప్రెస్‌ చేద్దామని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలలో ఒక్కోసారి వాళ్ళ ట్రూ సెల్ఫు బయట పడక పోవచ్చు. ఏ మనిషీ పర్ఫెక్టు కాదు. కొంత వరకు సర్దుకు పోయి, కాంప్రమైజు అవుతూ, సరైన అండర్‌ స్టాండింగు డెవలప్‌ చేసుకుంటే ఏ కాపురమైనా సాఫీగా సాగిపోతుందన్న నిజాన్ని ఈ కాలం జెనెరేషను వాళ్ళు గ్రహించుకోవాలి.

హేమ: నిజమే వాసంతి. నీ క్కాబోయే కోడలు ఎక్కడో పూజ చేసుకుంటూ ఉండి ఉండాలి. డోంట్‌ వర్రి...త్వరలోనే విహాన్‌ కి చక్కటి పిల్ల దొరుకుతుంది. ఆల్‌ ద బెస్ట్‌. నువ్వు మాత్రం ఇలా దిగులు పడకు. " Marriages are Made in Heaven but made successful on Earth" అని ఊరికే అనలేదులే.

సరే మరి ఇక నేను వెళ్ళాలి. ఇంట్లో చాలా పని ఉంది. ఎదో పని మీద ఇటు వెళ్తూ ఓసారి నిన్ను పలకరిద్దామని వచ్చాను. అందుకే వచ్చేముందు ఫోను కూడా చేయలేదు. మళ్ళీ తీరిగ్గా కలుద్దాం.'వాసంతీ' ' వాసంతీ' ...అని విశ్వనాథ్‌ తట్టి లేపుతుంటే ఈ ప్రపంచంలోకి వచ్చింది వాసంతి. మధ్యాన్నం హేమ వెళ్ళాక తెలియకుండా కునుకు పట్టినట్లుందని విశ్వనాథ్‌ తో చెప్పింది.విభావరి,మూడో మనవడు అంతా తన కలని తెలుసుకుంది. తన కల గురించి మొగుడితో చెప్తే అతను.."మూడోసారి మనవడు పుడితే మాత్రం ఎందుకంత బాధ" అన్నాడు. " ఆ మీకేమి తెలుసు నా బాధ మనవాడికి అమ్మాయిని వెతకడానికే ఇంత తంటాలు పడుతున్నాను ఇక ముగ్గురు మనవళ్ళకి అమ్మాయిలను వెతకడానికి నేను నా కోడలు ఎన్ని అవస్థలు పడాలో " అని వాసంతి అంటుంటే....విశ్వనాథ్‌ కడుపుబ్బ నవ్వుతూనే ఉన్నాడు.