బంగారం పూత

Kavita Sekhar

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

మధురవాణి,మనోజవర్ధన్‌ ల వివాహం ఒక విశేషం.మరి గురువారం ప్రొద్దున పెళ్ళి చూపులు చూసుకుని,మధ్యాన్నం పెళ్ళిమాటలు పూర్తి చేసుకుని,సాయంత్రం తాంబూలాలు పుచ్చుకుని,శుక్రవారం పెళ్ళి జరిపించేసి,శనివారం అప్పగింతలతో ముగిస్తే విశేషం కాక ఇంకేమంటారు? కాకపోతే ఇలాంటి హడావిడి పెళ్ళిళ్ళు ఈ రోజుల్లో మామూలైపోయాయనుకోండి.అమెరికాలో సాఫ్టువేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న మనోజవర్ధన్‌ కు, భూమ్మీద పడ్డాక అమలాపురం దాటని మధురవాణికి భలే తమాషాగా లింకు కలిపాడా పైనున్న పరమాత్ముడు. ఇంతకీ ఆ 'తమాషా ' ఏవిటో చూద్దాం. ఒకే ట్రైనులో ముఖ పరిచయం కూడా లేని మధు మేనమామ,మనోజ్‌ బావగార్ల మాట మాట కలవడంతో పాటు వారిళ్ళలోని పెళ్ళికి రెడీగా ఉన్న జంటల కులాలు,శాఖలు కూడా కలిసి,గోత్రాలు వేరవ్వడం... ఎక్కడో బీరకాయ పీచు రిలేషను కూడా బయట పడడంతో ఈ 'హడావిడి ' పెళ్ళికి నాంది పలికారు.

మధు గోరింటాకు వెలవక ముందే ప్లైటెక్కేసాడు మనోజ్‌. అసలు పెళ్ళి హడావిడిలో ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లడుకోలేదు కూడాను . మధుకి పెళ్ళి ఫోటోలు చూసుకున్నప్పుడు కానీ మనోజ్‌ మొహం గుర్తుకురాలేదు. పెళ్ళి హడావిడి,అలసట తీరిందో లేదో పాస్పోర్టు పోస్టులో వచ్చేసింది. ఇరవై మూడేళ్ళు అమ్మ,నాన్నలతో గడిపినా పెళ్ళయ్యాక మధు తన ఊరిలో తన వాళ్ళతో గడిపిన ఆ ఇరవై మూడు రోజులు ఎంతో అమూల్యమైనవి,మరపురానివి.అమ్మ, నాన్నలతో కబుర్లన్నీ అవ్వకముందే అమెరికాకు ఫ్లైట్టేక్కేసి టాటా చెబుతూ కన్నీటి వీడ్కోలు పలికేసింది మధు.

ఎయిర్పోర్టులో తనని రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన మనోజును చూస్తూనే మధు మొహంలో ఎడారిలో చినుకులు పడినంత ఆనందం చోటు చేసుకుంది. ముప్ఫై ఆరు గంటల ఉపవాసం,జాగారం అన్నీ మరిచిపోయింది. (ఎందుకనో తెలియదు...ఉత్సాహమో,భయమో,ఆదుర్దానో ....ఫ్లైటులో పెట్టిన గడ్డి ఎక్కలేదు...కంటికి కునుకు కూడా పట్టలేదు). ఫ్లైటులో ఉన్నంతసేపూ ఈ రోజు శివరాత్రి అయితే ఎంతబావుండేదో...తనకు శివుడు టన్నుల కొలదీ పుణ్యం ఇచ్చేవాడేమో అనుకుంది.

మనోజ్‌ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ అన్నీ మధు బుర్రలోకి ఎక్కట్లేదు. తను ఫ్లైటు ఎక్కానన్న సంతోషం తీరకుండానే, ఫారెన్‌ కంట్రీలోకి అడుగు పెట్టేసింది. ఒళ్ళంతా కళ్ళుంటే బావుణ్ణు అనుకుంటోంది ఆ ఏయిర్పోర్టు హంగు చూసి. లగేజి అంతా కలెక్టు చేసుకుని బయటకు వచ్చి కారులో కూలబడేసరికి మధుకి వాళ్ళ తాత ముత్తాతల దర్శనభాగ్యం దక్కింది.

కొత్త దేశం,కొత్త ప్రదేశం,కొత్త వాతావరణం,కొత్త జీవితం,అన్నింటికీ మించి కొత్త మొగుడు...కొత్త కాపురం....ఇన్ని కొత్తదనాల మధ్యన మధుకి పెద్ద బెంగ తెలియలేదు.మనోజ్‌ ఆప్యాయత,రెండురోజులకొకసారి అమ్మానాన్నలతోతో మాట్లాడటం...రోజూ పలకరించే తన చిన్ననాటి స్నేహితురాలు...కేలండర్లోని రోజులు గిర గిరా మారిపోతున్నాయి. జెట్లాగు తీరడం,ఇల్లంతా సర్దుకోవడం,కొత్త జీవిత విధానానికి అలవాటు పడటం......కొద్ది రోజులు మధుకి తెలియకుండా రోజులు పరిగెత్తాయి.

మనోజ్‌ మధులో అమలాపురం వాసనలు బాగ ఉన్నాయని...అమెరికా లైఫుస్టయిలు కు అలవాటుపడాలని,ఇక్కడి కల్చరుని కొంతవరకైనా అలవాటు చేసుకోకపోతే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టమని హిత బోధ చేస్తుండేవాడు. అమలాపురం దాటనిమధుకు ఇలాంటి చోటుకి రావడం ఒక వింత అనుభూతే మరి. మారాలని ఉన్నా కొన్ని కొన్ని సార్లు పొరపాట్లు చేయడం వల్లన మనోజ్‌ కొంచెం చికాకు పడేవాడు. అలా స్పీడుగా సాగిపోతున్న మధు జీవితంలో తుంపర్లు మొదలయ్యాయి. క్రమంగా అవి చిటపట చినుకులయ్యాయి.

క్రమేపీ మనోజ్‌ లో అసహనం పెరగసాగింది. ఒకసారి తన ఆఫీసు కొలీగు పార్టీ ఇస్తే మధుని హోటల్కు తీసుకు వెళ్ళాడు నూడిల్సు ఆర్డరు ఇస్తే అవి స్పూను,ఫోర్కుతో తినడానికి నానా ఇక్కట్లూ పడింది మధు. ఇక లాభంలేదనుకుని సుబ్భరంగా చేత్తో తింటుంటే మనోజ్కి తల కొట్టేసినట్లయింది. అసలు ఈ అమలాపురం సరుకుని తనకి అంటగట్టినందుకు వాళ్ళ బావగారిని తిట్టుకున్నాడు. మధుని ఎలా మార్చాలో అతనికి పాలు పోలేదు. మధు కొంత టైము తీసుకుని మారతానని మనోజ్కి సర్దిచెప్పడానికి చూసింది. ఎంతసేపూ తన స్నేహితుల పెళ్ళాలతో మధుని పోల్చుకుంటూ ప్రపంచంలో అందరి లోకి తనకే శుద్ధ పల్లెటూరు,చాదస్తపు పెళ్ళాం దొరికిందని తెగ ఫీలయిపోయాడు. ఈ చినుకులు తన జీవితంలో తుఫానుగా మారకుండా చూడమని దేవుడితో మొరపెట్టుకుంది మధు.

ఒకసారి మనోజ్‌ మధు ని తన స్నేహితులింటికి తీసుకుని వెళ్తే వాళ్ళ దగ్గిర చాలా విషయాలు నేర్చుకుంటుంది....పైగా తనకి కొత్త చోట్లు చూపించి నట్లవుతుందని తలచాడు. మధుకి ముందే చెప్పాడు...ప్రతీదీ చూసి పల్లెటూరివాళ్ళ లాగా ఆశ్చర్య పోవద్దని...కొత్త విషయాలు తొందరగా గ్రాస్ప్‌ చేయడం నేర్చుకోవాలనీ...తన స్నేహితుడి భార్య ఇక్కడ ఎన్నో Yఏళ్ళుగా ఉండటం వల్ల అమెకు అన్ని విషయాలలోనూ మంచి అవగాహన ఉంటుందని చెప్పాడు. ఆమె ఇక్కడే ఎం.ఎస్‌ చేసి మంచి ఉద్‌Yఓగంలో ఉందని చెప్పాడు.

థాంక్సు గివింగ్కి నాలుగు రోజులు సెలవలు కలిసి వస్తున్నాయని వాటికి ఇంకో ఆరు రోజులు జత చేసి లాస్‌ ఏంజిల్సు, లాస్‌ వెగాసు,గ్రాండుకాన్యన్‌ వెళ్దామని ప్లాన్‌ చేసాడు. మనోజ్‌ వాళ్ళ స్నేహితులు సాన్‌ హోజేలో ఉంటారు. అక్కడనుంచి డ్రైవు చేసుకుని ఈ ప్రదేశాలన్నింటికీ వెళ్దామని ప్లాను చేసారు.

ముందుగా ఆ న్యూలీ వెడ్‌ కపుల్‌ సాన్‌ హోజేలో ఉన్న మనోహర్‌ వాళ్ళింట్లో చెప్పులు విడిచారు. మనోహర్‌ తన భార్య మాడలిన్ని పరిచయం చేసాడు. మధు మొహంలోని ఆశ్చర్యాన్ని పసిగట్టినట్లు మనోహర్‌ మళ్ళీ చెప్పాడు...మాధవీలత ఇక్కడికి వచ్చిన కొన్ని సంవత్సరాలకి మాడలిన్‌ గా మారిందని.ఆమె పేరుతో పాటు వేష బాషలు కూడా మేకప్‌ వేసుకున్నాయి.'చనువు తీసుకుంటున్నానని అనుకోక పోతే నువ్వు ఇంకా మారాలి ' అని పెద్ద జడతో,చేతినిండా గాజులేసుకుని,కాళ్ళకి మట్టెలు,మెడలో మంగళసూత్రం,నల్లపూసలు,దోసగింజ బొట్టుతో చూడీదార్లో దిగిన మధుతో అంది మాడీ. వెంటనే మనోజ్‌, 'భలేవారండి మీరు...మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటివి తనకు నేర్పించక పోతే ఇంకెవరు చెప్తారు? అసలు మీతో ఓ నాలుగు రోజులు కలిసుండి మధు ఎన్నో విషయాలు నేర్చుకో వాలనే ఈ ట్రిప్పు ప్లాను చేసాము ' అన్నాడు.

వాళ్ళ కబుర్ల్లయ్యి,భోజనాలు ముగించుకుని లైట్లు ఆపేసరికి రోజు మారిపోయింది.

తెల్లారే అంతా లేచి స్నానాలు,కాఫీ,టిఫిన్‌ లు ముగించుకుని వాన్‌ లో కూలబడేసరికి పైన సూర్యారావు గారు మిల మిలా మెరిసిపోతున్నారు. మధ్యానానికల్లా లాసు వెగాసు చేరాలని తాపత్రయం.

వ్యాను ట్రంకు నిండా సామానులు సద్దేసరికి ఒక అరగంట పట్టింది. కూర్చునే సీటు దగ్గిరంతా కూడా సామాన్లు కళ కళ లాడిపోతున్నాయి.

అయిదు రోజుల ప్రయాణానికి ఇన్ని సామానులు ఎందుకండీ అని మధు మాడీని అడిగింది. 'నీకు తెలియదమ్మా ఈ దేశంలో అన్ని ఏర్పాట్లూ చేసుకుని బయల్దేరక పోతే ఇబ్బందుల పాలయ్యేది మనమే అంటూ తన బారిస్టర్‌ పార్వతీశం ప్రయాణాన్ని వెనకేసుకొచ్చింది మాడీ. ఇంతకీ అన్ని సూటుకేసులు,బ్యాగుల నిండా ఏమి సర్దారండీ అని అడిగింది మధు అమాయకంగా.

'ఆ ఎర్ర సూటుకేసు నిండా వింటర్వేర్‌ సర్దాను.వెదర్‌ రిపోర్టు ఎంత చూసినా ఒకొక్కసారి మారిపోవచ్చుకదా. మరీ చల్లగా ఉంటే కష్టమని జాకెట్లు కూడా పెట్టాను. ఇక ఆ బ్లూ సూటుకేసులో కొంచం లైట్‌ వింటర్‌ వేర్‌ పెట్టాను. ఆ బ్లూ బ్యాగ్‌ నిండా టవల్సు,అండర్‌ గార్మెంట్సు,స్పేరు షూసు,స్లిప్పర్సు లాంటివి సర్దాను.ఆ ఎల్లో బ్యాగులో జంతికలు,చెక్కలు,చేగోడేలు, కుకీసు పెట్టాను. అన్నీ పటేలు బ్రదర్సులో తీసుకున్నాను...వాడైతే చాలా ఫ్రెష్షుగా చేస్తాడు. ఇక మన బ్రేకుఫాస్టు ప్రతిరోజూ బైట తినాలంటే బోల్డు బోల్డు వదిలిపోతుంది.పైగా మన వెజిటేరియన్‌ స్కు సరైన ఫుడ్డు దొరకడం కష్టం కూడాను. ఎలాగూ రిఫ్రిజెరేటరు,మైక్రోవేవు ఉన్న హోటలు బుక్‌ చేసాము కాబట్టి కొంత వరకు వండుకోవచ్చు.

బ్రేకుఫాస్టుకని మాగీ పాకెట్లు,రెడీటు ఈట్‌ ఉప్మా పాకెట్లు పెట్టాను. ఆ గ్రే కలర్‌ బ్యాగ్లో రైస్‌ కుక్కరు,కందిపొడి,ఆవకాయ,చింతకాయ,కొరివి ఖారం సర్దాను. ఇక్కడ బైట యోగర్టులు జిగటగా ఉంటాయి. మరి పెరుగు తినకపోతే వేడి చేస్తుంది కదా. అందుకని ఒక చిన్న గిన్నెలో తోడుకని పెరుగు తెచ్చాను. బైట పాలు కొనుక్కొని,మైక్రోవేవులో కాచుకున్నామంటే ఎంచక్కా రూములోనే పెరుగు రెడీ. ఇక పాలు కాచటానికి అవీ ఇవీ వేడి చేసుకోవటానికి ఆ క్రీము కలరు బ్యాగులో కొన్ని డబ్బాలు అవీ పెట్టాను. అందులోనే డిస్పోజబుల్‌ ప్లేట్లు,స్పూన్లు,గ్లాసులు,పేపర్‌ టవల్సు కూడా పెట్టాను. అన్నట్టు ఆ గ్రీన్‌ కలర్‌ బ్యాగులో నెయ్యి,బియ్యం పెట్టానని గుర్తుచేయమ్మా. ఇవన్నీ కడుక్కోవడానికి డిష్వాషర్‌ లిక్విడ్‌,స్క్రబ్బరు కూడా పెట్టాను ' అని సింపుల్గా సెలవిచ్చింది మాడీ.

అప్పటికే సగం మతిపోయిన మధు...మరి ఆ ఐసు బాక్సులో ఏవుందండి అని అడిగితే...గొప్పగా ఇలా చెప్పింది మాడీ.'అదా ...మరీ పూట పూటా పచ్చళ్ళు,పొళ్ళు ఏం తింటాం అని రెండు రోజులకు సరిపడా దొండకాయ కూర,మావిడికాయ పప్పు చేసి జిప్లాక్‌ కవర్సులో సర్దాను. రెండు బాటిల్సులో సాంబారు,చారు కూడా పెట్టాను. నిండా ఐసు వేసాను కాబట్టి మనం చేరేదాకా ఫ్రెష్షుగా ఉంటాయి. వెళ్ళగానే ఫ్రిజ్జులో పెట్టాలని గుర్తుచేయమ్మ అందీ మాడీ.

కాసేపు నోట మాట పడిపోయింది మధుకి. నెమ్మదిగా తేరుకుని...మరి ఇక్కడ పీజ్జా హట్టు,సబ్వే లాంటి చోట్ల వెజిటెరీన్‌ ఫుడ్డు దొరుకుతుంది కదా అంది. 'ఆ ఏం దొరుకుతుంది మెక్డీసులో ఫ్రెంచి ఫ్రైసులో బీఫు ఆయిలు ఉంటుందిట. లోకల్‌ రెస్టారెంట్సులో వెజ్‌ కు, నాన్‌ వెజ్కు అంతా ఒకటే గరిటలు,గిన్నెలు వాడతారట. సబ్వేలో బన్నుల మధ్య ఆకులు,అలములు వేసిస్తారు. ఒక పూట తినచ్చు కానీ రెండో రోజు మొహం మొత్తుతుంది. ఇక పీజ్జా హట్టులో మన నలుగురికి పూటకి 30 డాలర్ల దాకా అవుతుంది.అదీ రెండో రోజు బోరు కొడుతుందనుకో. పైగా చీజులో బోలెడన్ని కాలరీలు కూడాను.

అన్నట్టు కాలరీలంటే గుర్తొచ్చింది ఆ వైటు కలర్‌ బ్యాగులో ఆరెంజి జూసు, డైయటు కోకు,పెప్సి వగైరాలు పెట్టాను.

ఇంతలో ట్రంకులో నుంచి ఎదో కారుతోందని ఎవరో హార్ను కొడితే మనోహర్‌ కారు పక్కగా ఆపాడు. ట్రంకు తెరచి చూస్తే తెచ్చిన పది వాటర్‌ కాన్‌ లలో ఒకటి లీకవుతోంది. అన్నీ తడిసిపోతాయని దాన్ని పారేసి, కొంత సామాను ముందు వ్యాను లోపల పెట్టవలసి వచ్చింది.

అసలు ఇన్ని నీళ్ళెందుకు అని మధు ఆడిగితే భలే దానివే నలుగురు మనుషులకి,నాలుగురోజులకి నీళ్ళఖర్లా? ఇంట్లోంచయితే ఫిల్టర్‌ వాటర్‌ పట్టికెళ్ళచ్చు అదే బయట కొనాలంటే బోలెడు డబ్బులవుతాయి కదా అందుకే ఈ ఏర్పాటు.

ఇక ఆ పర్పుల్‌ కలర్‌ బ్యాగులో ఏముందోనని అడిగే సాహసం చేయలేదు మధు. సామాను సర్దిన మాడీకి విసుగొచ్చిందో లేదో కానీ మధుకి మాత్రం నీరసం వచ్చి కునుకులోకి జారుకుంది .

కళ్ళు తెరిచేసరికి వ్యాను లాస్‌ వేగాస్‌ లో ఆగింది. ఎదురుగుండా హాలిడే ఇన్ను కనబడుతోంది. సామానంతా రూములోకి(థర్డు ఫ్లోరు) చేర్చేసరికి తల ప్రాణం పాదాల వరకూ జర్నీ చేసింది. వాళ్ళ ఖర్మకాలి ఆ రోజు ఎలివేటరు కూడా పని చేయలేదు. అసలే కాళ్ళు పైకి పెట్టుకుని ఎనిమిది గంటలు కూర్చోవడం వల్ల కాళ్ళు పట్టేసినట్ట్లున్నాయి.

రూములోకి వెళ్ళాక మాడి తన సంసారాన్నంతా రూము నిండా సర్దేసింది. మర్రోజు రూము సర్వీసు వాడు క్లేనింగు కని వస్తే వాడికి హార్టటాకు రావడం ఖాయం అనుకుంది మధు. మనోహర్‌ బైటికి వెళ్ళి మిల్కుక్యాను పట్టుకొచ్చాడు పాపం. పాలు కాచి తోడేసి భోజనాలు ముగించి రాత్రి ఏడింటికి పడుకున్న మధుకి ప్రొద్దున ఏడింటికి మనోజ్‌ గుడ్మార్నింగ్‌ చెప్పేవరకు ఒళ్ళు తెలీదు.

మళ్ళీ మైక్రోవేవులో బ్రేకుఫాస్టు చేసుకుని, ఇన్‌ స్టెంటు కాఫీ పెట్టుకుని, తిని,తాగి రైసు కుక్కర్లో అన్నం వండుకుని రూమునుండి బయటపడేసరికి పదకొండు. రాత్రి తోడేసిన పాలు పాలగానే ఉన్నాయి...తోడుకోలేదు. తెచ్చుకున్న తోడు కూడా అయిపోయింది.ఇక గత్యంతరం లేక బయట యోగర్టు కొందామని మాడి నిశ్చయించింది. గ్రాండుకాన్యను చేరుకునేసరికి సూర్యా రావు గారు టాటా చెప్పడానికి రెడీగా ఉన్నారు. అక్కడ సైటుసీయింగు ముగించుకుని సన్‌ సెట్టు చూసి వ్యానెక్కేసరికి ఆరుగంటలయ్యింది. మాడీ ఎక్కడైనా స్టోరు దగ్గిర ఆగి యోగర్టు తీసుకుందామన్నది. కనబడ్డ షాపు దగ్గిరల్లా ఆగారు కానీ వారికి ప్లెయిను యోగర్టు దొరకలేదు. అన్ని చోట్లా ఫ్లేవర్డు యోగర్టు మాత్రమే దొరుకుతోంది. మధుకిమహా విసుగు వచ్చేస్తోంది. అప్పటికి ఎనిమిది గంటలయ్యింది. ఇంకా యోగర్టు కోసం తిరుగుతూనే ఉన్నారు. ఇక రూము కెళ్ళి పోదామండి ఒక్క పూట పెరుగు లేక పోతే ఏమవుతుంది అంది మధు. తనకి మజ్జిగ తాగందే నిద్దర పట్టదని అందుకని ఇంకో రెండు షాపులు చూద్దమంది మాడి. అలా ఆ భభ్రజమానం ట్రూపు వారు రాత్రి తొమ్మిది గంటల దాకా ...అంటే మూడు గంటలు పెరుగు కోసం తిరిగి తిరిగి చివరికి దొరకక ఎట్టకేలకు పదింటికి రూముకు చేరుకున్నారు. కానీ భగవంతుడికి మధు ప్రార్ధనలు చేరాయేమో ముందు రోజు తోడేసిన పాలు తోడుకున్నాయి!

ఒక వారం తర్వాత మధు,మనోజ్లు వాళ్ళింటికి చేరుకున్నారు.ట్రిప్పు నుండి తిరిగొచ్చాక మనోజ్లో క్రమంగా మార్పు వచ్చింది. మాడి వేషబాషలోనే ఫాస్టుగా ఉంది కానీ ఆమె బిహేవియర్‌,థింకింగ్‌ లో ఎటువంటి డెవెలప్మెంటు లేదు అని గ్రహించాడు మనోజ్‌. మధుని తన స్నేహితుల పెళ్ళాలతో కంపేర్‌ చేయడం ఆ క్షణాన్నే మానేసాడు. కొద్ది కాలంలోనే మధు కూడా అమెరికా పద్ధతులు,నలుగురితో మెలగడం నేర్చుకుని మనోజ్‌ మెప్పు పొందింది.

మధు బంగారం.మాడీ బంగారం పూత. బంగారానికి మెరుగు అవసరం కానీ పూతకాదు అని తెలుసుకున్నాడు మనోజ్‌.

అలా మధు,మనోజ్ల కాపురం మూడు పీజ్జాలు ఆరు పూతరేకులుగా హాయిగా సాగిపోయింది.......!