జంధ్యాల గారి లేటెస్టు సినిమానా...?

Kavita Sekhar

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

భగవంతుని సృష్టిలో ఎన్నో వింతలు,విశేషాలు, విడ్డూరాలు.......

అటువంటి వింతల్లో పెద్ద వింత 'మనిషి '. మనుషుల జాబితా లెక్క కట్ట వచ్చు నేమో కానీ మనస్తత్వాల జాబితా ఎవ్వరికీ అంతుచిక్కనిది. ఫలానా మనిషి ఫలానా సమయంలో ఫలానా విధంగా ప్రవర్తిస్తాడన్న సంగతి ఆ ఫలానా మనిషికే తెలియకపోవచ్చు. అందుకేనేమో మనస్తత్వ శాస్త్రానికి ఏ ఖచితమైన థియరీ, రూల్సు లేవు.

ఇక విషయానికి వస్తే మన నిత్య జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాం. ఒక్కొక్క మనిషి ఒక్కో 'టైపు '.జంధ్యాల గారి సినిమాల్లో ఎన్నెన్నో ఫన్నీ వెరైటీ క్యారెక్టర్లని చూస్తుంటాం. నిత్య జీవితంలో అటువంటి వెరైటీ క్యారక్టర్లు ఉంటారా అంటే.....తప్పక ఉంటారు. నాకున్న కొద్దిపాటి అనుభవంలో నాకు తారస పడిన కొందరు 'ధన్య జీవులు '.'అభిలాష్‌' చక్కని పేరు..మావారి చిన్ననాటి స్నేహితుడు. ఎంతో కాలం తరువాత వాళ్ళు మా ఇంటికి వస్తున్నారంటే మావారి కాళ్ళు భూమ్మీద నిలవటం లేదు. ఎదురు చూసిన ఘడియ రానే వచ్చింది.

గెస్ట్లు వస్తున్నారంటే మనం చేసే ప్రయత్నాలలో భోజన ఏర్పాట్లు ముఖ్యమైనవి...క్రిందటి రోజునే రకరకాల కూరలు,పండ్లతో మా ఫ్రిజ్జంతా నింపేసాము. వాళ్ళుండే నాలుగు రోజుల్లో ఏ పూట ఏ బ్రేకుఫాస్టు, స్నాకు వెరైటీలు చెయ్యాలో మనసులోనే లిస్టు రెడీ చేసుకున్నాను. అబ్బో! ఈవిడకి ఎన్ని వెరైటీసు చేయడం వచ్చో...ఏ వెరైటీ చేసినా అది అద్భుతంగా కుదురింది భేష్‌! అనే కాంప్లిమెంటు కోసం ప్రతి ఇల్లాలూ తాపత్రయపడుతుంది. అసలు అదేనేమో ఆడదాని 'వీక్నెస్సు '. ఇంటి ఇల్లాలికి గ్రేటెస్ట్‌ మోటివేషన్‌ 'సహభాష్‌' అన్న చిన్న పదం.

సరే ఇక సీన్‌ లోకి వస్తే, పలకరింపులూ కులాసా కబుర్లు అయ్యి అభిలాష్‌ వాళ్ళు ఫ్రెష్‌ అయ్యి రాగానే నేను నా 'కల్నరీ స్కిల్ల్సు ' ప్రదర్శించటానికి కిచెన్‌ లోకి పరుగులెత్తాను. పెశరట్టు ఉప్మా చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి.ఇంతలో అభిలాష్‌ వాళ్ళావిడ ఆరాధన వచ్చి 'ఏవండీ మరి మా వారు పెసరట్టు ఉప్మా తినరండి ' అంది. అయ్యో పోనీలే ఆరాధన ఈ పూటకి బ్రెడ్డు జాముతో సరిపెట్టుకుంటే రేపటికి ఇడ్లినో ,పొంగలో,అటుకుల ఉప్మానో రెడీ చేస్తానన్నాను. లేకపొతే రెండు నిమిషాల్లో మాగీ సిద్ధం చేస్తాను అన్నాను. అప్పుడు అసలు భాగోతం బయట పడింది....

అభిలాష బ్రేకుఫాస్టుల్లో దోసలు తప్ప ఏమీ తినడుట. భోజనంలో దొండకాయ,బెండకాయ, వంకాయ వేపుడు తప్ప మిగతా కూరలకి నో చెప్పేస్తాడుట. టమాటా పప్పు,సాంబారు,పెరుగు తింటాడు. ఎటువంటి రోటి పచ్చళ్ళు,ఊరగాయలు తినడు. పలావ్‌ లు,పులిహోరలుకు దూరం దూరం. చపాతీలు,పరాటాలు అసలే వద్దు. స్వీట్‌ లలో 'గులాబ్‌ జాము ' హాట్‌ లలో 'గారెలు ' మాత్రం అదృష్టానికి నోచుకున్నాయి. కాబట్టి.... ఏ పండక్కి వాళ్ళింటికి వెళ్ళినా ఏమి పెడతారో మనకి తెలుసు!

మరి అభిలాష్‌ కు ముప్ఫై సంవత్సరాలుగా దోశెలు,గారెలు,గులాబ్జాంలు,దొండకాయ,బెండకాయ,వంకాయ వేపుడు,సాంబారు,టమాట పప్పు,పెరుగు తిని తిని బోరు కొట్టట్లేదా అని నా పెద్ద కళ్ళను,చిన్న నోరును పెద్దవిగా చేసి అడిగాను. దానికి అభిలాష్‌ ఎంతో తాపీగా బోర్‌ ఏముంది...నాకు ఊహ తెల్సిన దగ్గరనుంచి ఇవే తింటున్నాను...ఇకపై కూడా ఇవే తింటాను అన్నాడు. అతడు జర్మనీ,అమెరికా వంటి దేశాల్లో కొంతకాలమున్నాడు. మరి అటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు కానీ కాంప్రమైజు మాత్రం అవ్వలేదు. పెళ్ళిళ్ళకు,ఫం క్షన్‌ లకు వెళ్ళినప్పుడు ముందుగా ఇంట్లోనే తనక్కావలసింది తినేసి వెల్తాడుట. ఎవరింటికైనా వెళితే ఆ 'మంచి ' ఇంటివాళ్ళు అభిలాష్‌ అభీష్టాల కనుగుణంగానే వండి పెడతారుట! ఆరాధన పెళ్ళి కాకముందు అన్నీ తినేదట కానీ ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయంటుంది.

మొత్తానికి అభిలాష్‌,ఆరాధన సార్ధకనామధేయులే! అభిలాష్‌ కు పాలు తాగే పిల్లాడే ఉన్నాడు. వాడికి అన్నప్రాసనయ్యాక మరి తండ్రికిమించిన తనయుడు అవుతాడో లేదో వేచి చూడాలి.మాకు తెలిసిన వాళ్ళబ్బాయి పేరు.....'అనిర్వేష్‌' .....బావుంది...కొత్త పేరు అనుకున్నాను హైదరాబాదు నుంచి గుంటూరుకు తను కార్లో ఒక్కడే వెళుతున్నాడంటే, కార్లో చోటుంది అంటేను నేను మావారు కూడా బయలుదేరాము.......

అనిర్వేష్‌ డ్రైవింగు సీటుని అలంకరిస్తే ఆ ప్రక్క సీట్లో మావారు,వెనుక సీట్లో నేను సెటిలయ్యాము. నాలుగయిదు గంటల ప్రయాణం అని దారిలో పాటలు వినచ్చు కదా అని నాదగ్గిర ఉన్న సీడీలు పెట్టుకున్నాను . బయలుదేరిన కొద్దిసేపటికి నేనే చొరవ తీసుకుని ఒక సీడిని పెట్టమని అందించాను. ఆ సీడీ లో 149 పాటలున్నాయి. హాయిగా ఒక 3,4 గంటలు కళ్ళు మూసుకుని వెనుక సీటులో రిలాక్సు అవ్వచ్చు అనుకున్నాను. "రాగం తానం పల్లవీ.... ఆహా చాలా రోజుల్లయ్యింది శంకరాభరణం పాటలు విని అని అన్నాడు అనిర్వేష్‌. పోనీలే నా టేస్టు అతనికి నచ్చిందనుకుని సంతోషించాను. డ్రైవరు ఉల్లాసంగా ఉంటే ప్రయాణీకులు క్షేమం కదా!

పల్లవి అయ్యిందో లేదో అనిర్వేష్‌ మా వారితో ఇక ఈ పాట వద్దండి స్కిప్‌ చేసి తర్వాత పాట పెట్టండి అన్నాడు. మావారు అలానే చేసారు. 'రాగాలా పల్లకిలో కోయిలమ్మ....' అని మొదలవ్వగానే ఇది నా ఫేవరేట్‌ పాటల్లో ఒకటండి...నాకు శుభలేఖ సినిమా కూడా చాలా ఇష్టం అన్నాడు అనిర్వేష్‌. చరణం మొదలయ్యే లోపలే తర్వాత పాట మార్చాడు అనిర్వేష్‌. ఏమిటి ఇతను ఏ పాటా పూర్తిగా విననివ్వడా అనుకున్నాను. ఇలా గంట ప్రయాణించే లోపల అనిర్వేష్‌ మూడు mp3 సీడీలు (ఒక్కోదానిలో కనీసం 120 పాటలు ఉంటాయి) మార్చేసాడు. అతని కారు...పైగా అతడి డ్రైవింగు...మాకు వేరు దారి లేదు కదా! నోరు మూసుకుని కూర్చోవడం తప్ప...పైగా అదే మొదటి సారి కూడా అతనిని కలవటం.

ఒక గంటన్నర ప్రయాణించాక అతను హఠాత్తుగా కారు వెనక్కు తిప్పుతుంటే మావారు నేను విస్తుబోయి కారణం అడిగాము. అనిర్వేష్‌ ఎంతో తాపీగా....'సరదాగా ఫ్రెండుని కలవడానికి గుంటూరు బయలు దేరానండి కానీ అలోచించగా అంత దూరం ఎందుకు ఇప్పుడు రేపు ఆదివారం నాడు ఇక్కడి ఫ్రెండ్సుతో గండిపేట వెళితే బావుంటుంది అనిపించింది. సారీ అండి కావాలంటే మిమ్మల్ని బస్టాండులో దింపుతాను అని అన్నాడు. మావారికి నాకు అప్పుడర్ధమయ్యింది మా చుట్టాలావిడ అన్న మాటలు..."మా అనిర్వేషుకు ఏ అమ్మాయీ నచ్చటం లేదు...నలభై ఏళ్ళు దగ్గిర పడుతున్నాయని దిగులుగా ఉంది". అనిర్వేషుది వెరైటీ పేరు మాత్రమే కాదు వెరైటీ మనస్తత్వం అని తెలుసుకోవడానికి మాకు రెండు గంటలే పట్టింది!'షాక్‌ ట్రీట్మెంట్‌' అంటే ఏవిటో తెలుసా మీకు?

ఓసారి నేను ,మాచెల్లెలు, మా అమ్మగారు పనిమీద నాగపూరు వెళ్ళాల్సి వచ్చింది. కొత్త ఊరు బాష కూడా అంతంత మాత్రమే వచ్చు. మా బాబాయి తనకి తెలిసిన స్నేహితుడు ఉన్నాడు..మీరు వాళ్ళింట్లో హాయిగా ఉండచ్చు అని హామీ ఇవ్వడంతో మేము 'అతిషర ' వాళ్ళింట్లో ఉందామని నిశ్చయించుకున్నాము.

చాలా గంటలు రైల్లో ప్రయాణం చేసామేమో బాగా అలసటగా అనిపించింది. స్టేషనులో అతిషర ఆంటీ తెలుగు పలకరింపుతో ఒళ్ళు పులకరించింది. ఆవిడ తన వ్యానులో మా ముగ్గుర్ని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళింది. స్నానాలు చేసిరండి భోజనాలు వడ్డిస్తాను అంది. రైలు కూడు తిని నోరు చప్పబడిపోయి ఆంధ్రా భోజనానికని అంతా ఆవురావురని ఉన్నాము. డైనింగు టేబుల్‌ మీద కూర్చున్నాక మా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నాలుగు స్పూనుల పప్పు,ఆరు స్పూన్‌ ల కూర,గిన్నెనిండా వేడి నీళ్ళ చారు,తుర్రు నీళ్ళ మజ్జిగ ఉన్నాయి. పోనీ అన్నం చూస్తే అది అయిదుగురు మనుషులకు వండినట్లుగా లేదు...పైగా అతిషర అంది ఇంకో గంటలో మావారు భోజనానికి వస్తారు ఈ లోగా మనం భోజనాలు ముగించేద్దామని. ఏది వేసుకోవాలన్నా మొహమాటం...మొత్తానికి మేము ముగ్గురం 'బేబీ మీల్సు ' కానిచ్చాము.వాళ్ళాయనకని మిగిల్చిన దానిలో ఆయన వచ్చి భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళిపోయారు. ఒక గరిట అన్నం మిగిలిందట అతిషర ఆయన్ని పంపించాక మా అమ్మగారితో 'ఎంత కరెక్టుగా వండుదామన్నా ఎంతో కొంత మిగులుతుందండి.. మీరు కొత్తవాళ్ళు కదా తెలియలేదు ఈసారి అన్నం మిగలకుండా కరెక్టుగా పోస్తా లెండి ' అని ఆంటే అంటుంటే మా అమ్మ బిక్క మొహం చూసి నేనూ మా చెల్లెలు నవ్వులతో కడుపు నింపుకున్నాము.

మధ్యాన్నం ముగ్గురం చిన్న కునుకు తీసాం. లేచేసరికి ఘుమఘుమలు. నేనేమో చోలే అని కాదు కూర్మా అని మా చెల్లెలు కాసేపు వాదించుకున్నాము. అమ్మేమో మెల్లిగా మాట్లాడండర్రా ఆవిడ వింటే బావుండదు. అసలు రేపు ఇంటరవ్యూ పెట్టుకుని దానికి ప్రిపార్‌ అవ్వకుండా ఎంతసేపూ తిండి గోలేనా అని మమ్మల్నిద్దరినీ కేక లేసింది. నేను, మా చెల్లెలు మాత్రం ఆహా ప్రొద్దున మాడితే మాడాం రాత్రికి మాత్రం మనకు విందు భోజనం అని మురిసి పోయాం. ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. అతిషర ఆంటీ, 'అంకులు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మళ్ళీ ప్రొద్దునే లేచి ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అందుకని మీ ముగ్గురూ భోజనం చేసేయ్యండి ఆయన వచ్చేవరకు నేను వెయిట్‌ చేస్తాను’ అంటే సరేనన్నాము.ఆవిడ లోపలికి వెళ్ళి పూరీలు తెచ్చింది. నేను, చెల్లి చోలే తెస్తుందా లేక కూర్మా తెస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాము.అసలే ఐస్‌ క్రీము బెట్టు కదా మరి! ఇంతలో ఆంటీగారు గిన్నె తెచ్చి టెబుల్‌ మీద పెట్టారు.

మూత తెరచి చూసిన మా ఇద్దరి మొహాలు అప్పుడే సున్నం వేసిన తెల్ల గోడలా పాలి పోయాయి. అందులో పాలకూర పప్పు ఉంది. అదేదో జంధ్యాలగారి సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేళ్ళాడ దీసి దానినే చూస్తూ చికెన్‌ బిరియానీ తింటున్నట్టుగా ఫీల్లయ్యి ఉత్తన్నం తిన్నట్లు మేమిద్దరం చోలే, కూర్మాను ఊహించుకుంటూ పాలకూర పప్పు తిన్నాం. ఆంటీ మేం భోంచేసాక గదిలో పడుకోమని చెప్పి తలుపు దగ్గరగా వేసి లైట్లు ఆపు చేసింది.

మా చెల్లికి, నాకు కంటి మీద కునుకు రావటం లేదు. పాలకూర పప్పు అంత మసాలా వాసన ఎలా వచ్చిందా అని. అంకులు వచ్చేవరకు ఇద్దరం కాపు కాసాం. ఆంటీ ,అంకులు భోజనానికి కూర్చున్నారు అని తలుపు చాటునుంచి చూసి నిర్ధారించుకున్నాక మా చెల్లెలు మంచి నీళ్ళు తాగాలన్న నెపంతో తలుపు తీసి డైనింగు రూము లోకి వెళ్ళింది. చెల్లి రూములోకి వచ్చాక షాక్‌ లో ఉంది. ఏమయ్యిందని రెండు సార్లు అడిగితే, నెమ్మదిగా చెప్పసాగింది. అక్కా, 'డైనింగు టేబుల్‌ మీద ఆంటీ అంకులు పూరీలు,పనీర్‌ కుర్మా,చోలే కూర,హల్వా,గడ్డ పెరుగు భోంచేస్తున్నారు ' అని చెప్పింది".

మర్నాడు ఇంటర్వ్యూ అయ్యాక మేమ్ముగ్గురం హాయిగా హోటల్లో "కడుపు నిండా" ఫుల్మీల్సు విత్‌ కర్డ్‌ తినేసి రైలెక్కాము.ఇచ్చి పుచ్చుకోవడం ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య చాలా సహజం. అమెరికాలో మా పక్కింటింట్లో వినూత్న వాళ్ళు దిగితున్నారంటే....మన దేశం వాళ్ళు పైగా మన తెలుగు వాళ్ళు అని ఎంతో మురిసిపోయాము. వినూత్న వాళ్ళాయన సాఫ్టువేరు ఇంజినీరు. ఆయన ముందుగా వచ్చి కొంత సెటిల్‌ అయ్యాక వినూత్నని పిలిపిస్తానని చెబుతుండేవారు.

ఒకరోజు వినూత్న వాళ్ళాయన మా వారితో " మా ఆవిడ వచ్చే శనివారం రోజు ఇండియా నుంచి ఇక్కడికి వస్తోందండి మీకేమైనా కావాలంటే చెప్పండి అని అన్నారట. మా వారు అబ్బే ఏమీ అక్కరలేదండి ..ఇప్పుడు అన్నీ ఇక్కడే బాగా దొరుకుతున్నాయి అంటే ఆయన మీరు మొహమాట పడుతున్నారు ఇరుగు పొరుగు వాళ్ళం అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఈ రోజు మీరగుడుతారు రేపు మేమడుగుతాము అని ఎంతో బలవంత పెట్టేసరికి మా వారు ఇక దారి లేక ఒక అమృతాంజనం సీసా తీసుకు రమ్మనండి అని అన్నారట.

వినూత్న ఫ్లైటులో అలసిపోయి వస్తోందని ఆ పూట ఇద్దరినీ మా ఇంటికి భోజనానికి పిలిచాము. వాళ్ళకు కారు లేదని ఎక్కడికి వెళ్ళాల్లన్నా మా కార్లులోనే తీసుకుని వెళ్ళేవాళ్ళము. వినూత్న ఇంట్లో కాఫీ పొడి లేదని,క్యారెట్లు లేవని,ఏ పప్పో, పిండో లేదని రోజూ అరువుకు వస్తూనే ఉండేది. వీకెండు వచ్చిందంటే చాలు మొగుడు పెళ్ళాము సాయంత్రం వచ్చేసి కబుర్లు మొదలెట్టి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేవరకు కదిలే వారు కాదు. వాళ్ళ సంగతెలా ఉన్నా మాకు ఆకలేసి వంట మొదలు పెట్టాలి కదా....మొదట్లో మీరూ మాతో కలిసి ఇక్కడే భోంచేసేయండి అని అనే వాళ్ళం. కాని రాను రాను మాకు విసుగు పుట్టి ఆఫర్‌ చేయడం మానేసినా మొగుడో పెళ్ళామో ఎవరో ఒకరు 'ఆ.... ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ ఏమి వండుతాం వీళ్ళతో పాటే ఇక్కడే పచ్చడో పెరుగో తినేద్దాం' అని వాళ్ళే సెల్ఫుఇన్విటేషన్‌ ఇచ్చుకునే వాళ్ళు. భోజనాలయ్యాక మళ్ళీ కబుర్లు మొదలెట్టి మేము ఆవలిస్తున్నా లెక్క చేయక తీరిగ్గా రోజు మారాక బయలుదేరి వెళ్ళేవారు. మళ్ళీ ఏనాడూ మాకు వాళ్ళింట్లో టీ నీళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలేదు సుమా!

ఇక నాకు మావారికి చిరాకు చైనా వాలు చేరింది. ఒక శనివారం నాడు వినూత్న వాళ్ళాయన మా ఇంటికి వచ్చి రెండు గంటల దూరంలో ఉన్న గుడికి మా కారులో తీసుకు వెళ్ళమని అడిగారు. మా వారు సారీ అండి నాకు కుదరదు అంటే పోనీ పై వారం తీసుకు వెళతారా అని అడిగారు. మావారు ఆ చూద్దాం లేండి ఇప్పుడే చెప్పలేను అంటే వెంటనే వినూత్న వాళ్ళాయన ఆవేశంగా " అదేంటండీ అలా నిష్టూరంగా అంటారు...ఇరుగు పొరుగు వాళ్ళమన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. ఉదా.... మేము మీకోసం ఇండియా నుంచి అమృతాంజనం తెచ్చాము కదా.....అందుకని మీకు మమ్మల్ని గుడికి తీసుకెళ్ళటం కుదరక పోతే కనీసం రెంటలు కారుకు సగం డబ్బులైనా ఇవ్వండి” అని అన్నాడు. అప్పుడు నాకు మావారికి ఇలా జ్ఞానోదయం అయ్యింది.

"అమృతాంజనం ఇంత ఖరీదైనదని అనుకోలేదు. పైగా అది తలనొప్పి పోగొడుతుందనే తెలుసుకానీ ఇంత తలభారం తెస్తుందని ఊహించలేదు సుమా"!