లవ్వు

ఆరి సీతారామయ్య

(Previously Published in eemaaTa, March 2005)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

"లవ్వు," అన్న మాట మీరు వినేవుంటారు. దీన్ని తాతల కాలంలో, “వలపు,” అనే వారు. కానీ ఆమాట ఇప్పుడు వాడుకలో లేదు. తర్వాత కాలంలో, “ప్రేమ,” అన్న మాట వాడుకలోకొచ్చింది. కానీ ఇది చాలా బరువుగా ఉండటం వల్ల ఈ రోజుల్లో ఎక్కువ మంది దీనిజోలికి పోవటం లేదు. ప్రస్తుతం విస్తృతంగా వాడుకలో ఉన్న మాట లవ్వు. ఇంగ్లీషు వాళ్ళు దీన్ని ముద్దుగా, “లవ్‌,” అంటున్నారు. మన మాటల్ను తీసేసుకుని, చివర్లు కత్తిరించి, సొంత మాటలుగా వాడుకోవటం ఇంగ్లీషువాళ్ళకు అలవాటయిపోయింది. అది వేరే విషయం అనుకోండి.

ఇప్పుడు వీడు లవ్వు గురించి ఎందుకు చెప్తున్నాడు? అని మీకు ప్రశ్న వచ్చే వుంటుంది. చెప్తాను. అమెరికాలో మీరెప్పుడైనా తెలుగు ఫంక్షన్‌కి వెళ్తే, చూసే వుంటారు. కార్యక్రమం మొదలవుతూనే ఒక పెద్దాయన వేదిక మీదికొస్తాడు. “నమస్కారం. అందరికీ ఏదో సందర్భంగా శుభాకాంక్షలు. మన తెలుగు భాషనూ, తెలుగు సంస్కృతినీ జాగ్రత్తగా సంరక్షించి మన తరవాత మన పిల్లలకందజేయ్యటం మన బాధ్యత,” అంటాడు. అందరూ చప్పట్లు కొడతారు. అంటే దానర్ధం ఏమిటీ? తెలుగు వారికి భాషా, సంస్కృతీ చాలా ముఖ్యమైనవి అనేగదా?

భాష మనకొక ముఖ్యమైన ఇబ్బందొకటుంది.
మీరు వచ్చారా?
మీరు వచ్చినారా?
మీరు వచ్చిన్రా?
మీరు వచ్చిఉన్నారా?
మీరు వచ్చిఉంటిరా? దగ్గరకొస్తే
మీరొచ్చారా?

వీటిలో ఏదీ మనభాష? చెప్పటం కష్టం. అందువల్ల, ఎందుకొచ్చిన గొడవలే అని అందరూ ముచ్చటగా ఇంగ్లీషో, సంస్కృతమో నేర్పిస్తున్నారు పిల్లలకి. ఇక సంస్కృతి దగ్గరకొస్తే మనకిలాంటి అనుమానాలేం లేవు. ఆ పెద్దమనిషి మైకులో మాట్లాడి పోయింతర్వాత మొదలయ్యే సాంస్కృతిక కార్యక్రమంలో మీరు చూసేదేమిటి? సినిమా పాటలకు అబ్బాయిలూ అమ్మాయిలూ డాన్సులు చెయ్యటం. అవునా కాదా? ఆ పాటల్లో ముఖ్యమైన వస్తువేంటీ? లవ్వు. అనగా, మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం సినిమా లవ్వు.

జాతికి ఇంత ముఖ్యమైన దాన్ని అందరికీ అందుబాటులో వుంచాలిగదా? లేకపోతే జాతి సంస్కృతి నాశనమైపోదూ? అందుకే లవ్వును elite వ్యవహారంగా కాకుండా మాస్‌ లెవెల్లో వుంచుతారు. దీన్ని గురించి అందరికీ అర్ధం అయ్యేలా చెప్పటానికి మాస్‌ రచయితలచేత కథలూ పాటలూ రాయించి వాటిమీద సినిమాలు తీస్తారు.

మీరీమధ్య సినిమాలు చూస్తున్నారో లేదో. ఒక వేళ చూడకపోతే, మన రచయితలు సృష్టించే లవ్వు సందర్భాల గురించి మీకు కొంచెం చెప్తాను.

లవ్వులో పడాలంటే ముందు కాలేజీలో చేరాలి. అందుకే కాలేజీలకి తెలుగుదేశంలో అంత గిరాకీ. కాలేజీలలో యేముండును? కాలేజీలలో ముఖ్యంగా గోడలుండును. అంటే అల్లాటప్పా గోడలు కాదు. ఇవి రెండు మూడడుగుల ఎత్తుగా, దాదాపు పది గజాల పొడుగ్గా ఉంటాయి. అవి ఎన్ని వుంటే, ఎంత అందంగా వుంటే, కూర్చోవటానికి ఎంత సౌకర్యంగా ఉంటే, ఆ కాలేజీలో సీటు రావటం అంత కష్టం, ఫీజు అంత ఎక్కువా. ఉదయం కాలేజీకి రావటంతోటే ఆ గోడలమీద చేరతారు అబ్బాయిలంతా – అమెరికాలో lunch time అప్పుడు construction workers కూర్చుంటారే, అలాగా. కాలేజీకి వచ్చే అమ్మాయిల మీద వ్యాఖ్యానాలు చేస్తారు. వెలికి వేషాలు వేస్తారు. దీన్ని వెనకబడ్డ దేశాల్లో లైంగిక హింస అంటారు. మనం చాలా ముందుకొచ్చాం కాబట్టి దీన్ని మనం ముద్దుగా కోర్టుషిప్పు అంటాం.

ఈ వెకిలి వేషాల పరిణామం ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది. మొదటి రకంలో అబ్బాయి ఇంట్లో జబ్బుతో ఉన్న అమ్మకు మందిచ్చి, ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని, కాలేజీకి ఆలస్యంగా వస్తాడు. గోడమీద చోటు దొరకదు. అమ్మాయిమీద వెకిలి వ్యాఖ్యానాలు చేస్తున్న అబ్బయిల్ను చితగ్గొడతాడు. అమ్మాయి వీణ్ణి వెంటనే లవ్వు చేస్తుంది. చేస్తుందని నీకెలా తెలుసు? అని అడుగుతారు మీరు. చాలా సులభం. లవ్వులో పడ్డవాళ్ళు కంపల్సరీగా పాట పాడ్డం మొదలెడుతారు, చిందులేస్తారు, వానలో తడుస్తారు. వాళ్ళను గుర్తుపట్టడం చాలా సులభం. సరే, ఇక రెండో రకంలో అబ్బాయి డబ్బున్న వాడి కొడుకు. గోడమీద సుఖంగా కూర్చోనుంటాడు. వాడి చంచాలు చుట్టూ కూర్చోనుంటారు. అమ్మాయి కాలేజీకి రావటంతోనే వీడు ఆమెను గేళి చేస్తాడు. వీడూ, వీడి మిత్రబృందం కలిసి అమ్మాయి వెనకాలే పాటలు పాడుతూ పోతారు. పాటకు తగ్గట్టుగా నడుములు ఎగరేస్తారు. కొన్నాళ్ళు ఇలా కష్టపడ్డ తరువాత అబ్బాయీ అమ్మాయీ లవ్వులో పడతారు. ఇక మూడో రకం లో అమ్మాయిని అంతదూరం లో చూసి అబ్బాయి గోడ దిగి ఎదురుగా వస్తాడు.కళ్ళజోడు పెట్టుకోని ఉండటం వల్ల అబ్బాయికి సరిగ్గా కనపడదు, అమ్మాయిని తగుల్తాడు. అమ్మాయి చేతిలోంచి పుస్తకాలు కిందపడతాయి. అబ్బాయికి పుస్తకాలు చదివటం ఇంకారాదు కాబట్టి అవి చేతులోంచి పడే ప్రసక్తే లేదు. కిందపడ్డ పుస్తకాలను తియ్యటానికి ఇద్దరూ వంగుతారు. అప్పుడు వాళ్ళ తలలు తగులుతాయి. వెంటనే ఇద్దరూ పాటలు పాడటం, డాన్సులెయ్యటం మొదలుపెడతారు. అంటే, లవ్వులో పడ్డారన్నమాట.

కాలేజీలో చేరలేని వారు లవ్వులో పడటం అసాధ్యం. ఒకటో రెండో ఎక్సెప్షన్స్‌ ఉన్నాయని విన్నాననుకొండీ. ఎక్కడో పార్టీలో అబ్బాయీ అమ్మాయీ ఒకర్నొకరు చూసుకోని, వెంటనే ఇద్దరూ ఒకేసారిగా కంటిరెప్పలు సెకండుకి పన్నెండు సార్లు టపటపలాడిస్తే లవ్వులో పడతారని ఒక మాస్‌ రచయిత చెప్పినట్లు విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు. ట్రై చేసి చూడండి.

ఓస్‌! లవ్వులో పడటం ఇంత సులభం అన్నమాట, అనుకుంటున్నారు కదూ? కాదు. మన మాస్‌ రచయితలు అంత గొప్పవారు కాబట్టి ఇది ఇంత సులభం అన్నట్టు కనిపించేలా చేస్తారు. కాని, ఆ గోడలమీద కూర్చోటం, వెకిలి చేష్టలు చెయ్యటం, నడుములెగరేస్తూ డాన్సు చెయ్యటం అంత సులభంగా చేతయ్యే పనిగాదు. దానికి ఎన్నో సంవత్సరాల ట్రెయినింగు కావాలి. ఒక్కోసారి తల్లిదండ్రులే పిల్లలకు ఈ ట్రెయినింగు ఇస్తుంటారు. డబ్బున్నవారు పిల్లల్ని కోచింగుకు పంపిస్తారు. ఈ విద్యల్లో పిల్లల నేర్పు ఎలావుందో టెస్టుజేసుకోవటానికి అమెరికాలో ప్రతివూళ్ళోనూ, "తెలుగు సాంస్కృతిక పోటీలు," అని పెడుతుంటారు. మీరెప్పుడన్నా ఈ పోటీలు చూసారో లేదో? సరే, చెప్తాను. పోటీలో పిల్లలు జంటలు జంటలుగా పాల్గొంటారు. మాంచి ఉక్కిరిబిక్కిరిగా లవ్వులో ఉన్నవారు పాడుకునే సినిమా పాటలకు వీళ్ళు డాన్సులు చేస్తారు. ఐదు-పదేళ్ళ వయసు పిల్లలు వొంపు సొంపుల గురించి పాడుతూ, లేని వొంపుల్ను ప్రదర్శించటానికి అవస్తపడుతూ, నడుములెగరేస్తూవుంటే చూట్టానికి కన్నుల పండుగగా ఉంటుందనుకోండీ! పిల్లల తల్లిదండ్రులు తమ సంతానరత్నాల సొగసులు చూసుకుంటూ మురిసిపోతూ విడియోలు తీసుకుంటుంటారు. తల్లిదండ్రులు తమ సంతానాల లవ్వు ట్రెయినింగులో ఇంత శ్రద్ధ తీసుకోవటం మన తెలుగు జాతికే గర్వకారణం. అందువల్లే మనవారంటే ఇతర భారతీయులకు అంత ఈర్షా, అసూయా.

సరే. ఇంత కష్టపడి లవ్వు గురించి నేర్చుకోనీ, కాలేజీలో చేరీ, లవ్వులో పడతారు. మరి తర్వాతేంటీ? అని అడుగుతారు మీరు. చెప్తాను. లవ్వుకు పర్యవసానం పెళ్ళి. దాంతో లవ్వు చాప్టర్‌ ముగుస్తుంది. తర్వాతొచ్చేవి సెక్సు, కిడ్సు. వీటిని ఇంగ్లీషు వాళ్ళు ముద్దుగా "సెక్స్‌," "కిడ్స్‌," అంటారనుకోండీ. ఆది వేరే విషయం.