లేత మనసులు

Kavita Ganduri

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

"పారిపోయాడా......!"

'అవునే మనతో పాటు మిగతా ఇరవై వేల డిపాజిటర్లను కూడా నిలువునా ముంచేసి పారిపోయాడా దొంగ వెధవ '.

"అనుకున్నంత పనీ అయ్యింది... అసలు, నేను మొదటినుంచీ చెబుతూనే ఉన్నా...ఎక్కువ వడ్డీకి ఆశ పడొద్దండీ, ఏ బ్యాంకులోనో పెడదాము అని.... వింటేనా.... వాడు పెట్టాడు, వీడు పెట్టాడు.. ఆ కంపనీ మేనజరు మా ఫ్రెండు కి ప్రాణ స్నేహితుడు అంటూ పెట్టారు.. ఒకటా, రెండా.... ఏకంగా యాభైవేలు.. ఎవరికి పెట్టినట్టు....???".

' ఆ కంపనీ ఆఫీసు ముందు అంతా గందరగోళంగా ఉంది...వాడికి క్రెడిట్‌ ఇన్సురెన్సు కూడా లేదట కాబట్టి మన డబ్బు తిరిగి వస్తుందన్న ఆశ లేదు....'

'సరేలే.. ఏంచేస్తాం... ఊరికే తల్చుకుని బాధ పడకు.. మనకు ఆ డబ్బు రాసి పెట్టి లేదేమో..'

"వెధవ వేదాంతం చెప్పెకండి...ముందునుంచి చెబుతూనే ఉన్నా..అసలు నా మాటకు ఏనాడైనా విలువిచ్చారా మీరు? పెళ్ళాం చెబితే నేను వినాలా, దీని మాటకు విలువిచ్చేది ఏంటి అన్న ధోరణి మీది.. అసలు మీ మగాళ్ళంతా ఇంతే.. పెళ్ళైన ఇన్నేళ్ళ సంసారంలో నా వల్ల మీకు ఎనాడూ డబ్బు నష్టం జరగలేదు..కానీ మీ తెలివి తక్కుతనం వల్ల అన్ని నష్టాలే....."

'ఇక ఆపుతావా.. అయినా నీ ప్రమేయం, ఇష్టం లేకుండానే అన్నీ జరుగుతున్నాయా? ఒక్కొక్కసారి జీవితంలో ఇలాంటివి తప్పవు...ఇంక నన్ను సాధించకూ

"అంతే లెండి, నా మాటలు మీకు సాధింపులుగానే అనిపిస్తాయి..నా బాధ మీకెందుకు అర్థం అవుతుంది.??"

'ఇదిగో.. ఇక సణక్కు...ఎదో నగో, హారమో పోయిందనుకో

"అవును లెండి ఏనాడూ చేయించింది లేదు కాబట్టి ఇలాంటి మాటలే వస్తాయి... అసలు పెళ్ళయ్యాక.. మీరు ఎప్పుడైనా నగలు చేయించారా....??" ఇప్పటికీ మా పుట్టింటివాళ్ళు పెట్టల్సిందేకాని..... పోయిన పండక్కి కూడా అమ్మే శశి కి గాజులు చేయించింది."

'అబ్బా.. ఇప్పుడవన్నీ అవసరమా? అయినా.. నేను ఎప్పుడైనా మీ పుట్టింటి వాళ్ళని అవీ ఇవీ పెట్టమని అడిగానా? వాళ్ళే కదా వద్దన్నా వినకుండా... వాళ్ళ ముచ్చటంటూ.. పండగని, పుట్టిన రోజనీ.. కానుకలు ఇస్తూ ఉంటారు.. '

"అవును లెండి అడక్కుండా అన్నీ జరిపిస్తున్నందుకు మా వాళ్ళంటే మీకు ఎప్పుడూ లోకువే.. పెళ్ళయి ఇన్నేళైయినా అత్తవారి చేత ఒక్క రవిక గుడ్డయినా పెట్టించుకున్న పాపానపోలెదు. "

'మధ్యలో మా వాళ్ళేంచేశారు? ఎదో వంకన..ఎప్పుడూ వాళ్ళని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదా..?'

"అబ్బ ఎంత పొడుచుకొచ్చిందో ??.. ఉన్న మాటంటే.. అయ్యగారికి ఎంత ఉలికి పాటో?"

'ఇదిగో.. ఇక నువ్వు నోరు ముయ్యకపొతే.. నేను ఊరుకోను '

"ఆ...ఎంచేస్తారు? మీ తెలివితక్కువ పనులను కప్పి పుచ్చుకోవడానికి నా మీద అరవడం తప్ప మీరు ఏవి చెయ్యగలరు?"

'నాన్నా... ప్లేజ్‌ నాన్నా.... అమ్మ ని కొట్టకండి...ప్లేజ్‌ నాన్నా.... నీ కాళ్ళు పట్టుకుంటాను... '

శశి.. శశి... అని గట్టిగా తట్టినట్టు అనిపించడంతో..ఉలిక్కిపడి లేచింది శశిరేఖ.

సిద్ధార్థ్‌: ఎరా శశి... మళ్ళీ పీడ కల వచ్చిందా?? నేనున్నాను కదా.... నీకేంభయం లేదు డియర్‌. మళ్ళీ అమ్మా నాన్నా డిషుం డిషుం కలా... ????

శశి: అవును సిద్ధు.. మనకి పెళ్ళయి ఇంత కాలం అయినా ఇంకా నాకు ఈ పీడ కలలు ఏమిటి.. ఈ మధ్యన చాలా

తరచుగా ఇలాంటి కలలు వచ్చి అస్సలు సరిగ్గా నిద్దర ఉండట్లేదు.. నాకు నిద్ర పోవాలంటేనే.. భయంగా ఉంటోంది.

సిద్ధార్థ్‌: వర్రీ అవ్వకు శశి.. నీకు నేనున్నాను కదా.. ఈ ఉళ్ళో డాక్టర్‌ సులోచన అని పెద్ద పేరున్న సైకాలజిస్టు ఉన్నారు. ఆవిడ దగ్గిర అపాయింటుమెంటు తీసుకుంటాను. ఇక హయిగా పడుకో..

సిద్ధార్థ్‌: గుడ్‌ మార్నింగ్‌ డాక్టర్‌. ఐ యాం సిద్ధార్థ్‌. షీ ఈస్‌ మై వైఫ్‌ శశిరేఖ.

సులోచన: వెరీ గుడ్‌ మార్నింగ్‌ అండి. ఊ... చెప్పండి మీ కేసు .

సిద్ధార్థ్‌: మాకు పెళ్ళైయి మూడు సంవత్సరాలయింది డాక్టర్‌. శశికి ఇప్పుడు 26 సంవత్సరాలు. వర్రీ అవ్వాల్సినంత పెద్ద సమస్యలు ఏమీ లేవు. మేమిద్దరం చాలా హాపీగా ఉన్నాము. శశికి అప్పుడప్పుడు పీడ కలలు వస్తూ ఉంటాయి. అర్ధ రాత్రి లేచి ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఒకొక్కసారి గట్టిగా అరుస్తుంది.. మరి కొన్ని సార్లు ఏడుస్తూ ఉంటుంది.. ఈ మధ్యన ఇది చాలా తరచుగా జరుగుతోంది.. అందుకనే మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాము.

డాక్టర్‌: ఏమ్మా శశి.. నీకు ఎటువంటి పీడ కలలు వస్తూ ఉంటాయి??

శశి: తొంభై సాతం కలలు మా అమ్మ నాన్నా పోట్లాడుకుంటునట్టు వస్తాయి అండి.. ఒక్కొక్కసారి మా అమ్మ నాన్ననో, లేక నాన్న అమ్మనో పొడిచి చంపేసినట్టు అనిపిస్తుంది అండి.. నాన్న అమ్మని కొడుతునట్టు..నేను గట్టిగా ఏడుస్తున్నట్టు... ఇలా చాలా భయంకరమైన కలలు వస్తూ ఉంటాయండి.. నాకు వొళ్ళంతా చెమటలు పట్టేసి జ్వరం వచ్చిన ఫీలింగ్‌ వస్తూ ఉంటుంది.. అది కల అని నేను గ్రహించ లేక పోతున్నాను..

డాక్టర్‌: మీ అమ్మా నాన్నా ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారా???

శశి: ఎప్పుడూ కాదండి.. బహుసా అందరి అమ్మా నన్నల లాగానే అప్పుడప్పుడు పోట్లాడుకుంటారేమో. కానీ.. నాకు చిన్న తనంలో చాలా భయంగా, బాధగా ఉండేది.. ఆ రోజు రాత్రి అంతా బెంగగా ఉండేది. మళ్ళీ పొద్దున్న లేచేసరికి అమ్మ నాన్న మాములుగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకు సంతోషంగా ఉండేది.. అప్పట్లో కోపం కూడా వచ్చేది.. నేను ఇంతగా రాత్రంతా వర్రీ అయితే, వీళ్ళు ఇంత మామూలుగా మళ్ళీ ఎలా మాట్లాడుకోగలుతున్నారు అని అనిపించేది. ఇప్పుడు తల్చుకుంటే.... నేను పడిన టెన్షన్‌ అంతా సిల్లీగా అనిపిస్తుంది.

సిద్ధార్థ్‌: డాక్టర్‌, అసలు తను ఈ విషయాన్ని ఇంత సీరియస్‌ గా ఎందుకు తీసుకుంటోందో నాకు అర్ధం కావట్లేదు.. చాలా ఇళ్ళళ్ళో ఇది కామన్‌ కదా. మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్నా ఆర్గ్యూ చేసుకునే వారు. కొంత సేపయ్యక మళ్ళీ సర్దుకునేవరు. నేను శశి కి ఎన్నో సార్లు చెప్పిచూసాను.. పెళ్ళయిన మొదటి రాత్రి తను కోరుకున్నది ఎమిటంటే "మనమిద్దరము అందరి భార్యాభర్తల్లాగా పోట్లాడుకోకూడదు అని". నాకు అశ్చర్యంగా అనిపించినా అప్పుడు సరేనని అన్నాను.

డాక్టర్‌: మీరు చెప్పింది కరక్టే మిస్టర్‌ సిద్ధార్థ్‌. ప్రతి ఇంట్లో ఇది రోజూ జరిగే తంతే.. కానీ దీని ప్రభావం ఒక్కొక్కసారి చాలా దారుణంగా, తీవ్రంగా ఉంటుంది. మీకు నేను డేల్‌ చేసిన కొన్ని కేసులు చెపుతాను.

పోయిన సంవత్సరం ఒక తల్లి, తండ్రి తమ కూతురిని వెంట పెట్టుకుని వచ్చారు. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ససేమిరా ఒప్పుకోవటం లేదని. కారణం చెప్పట్లేదు అని ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఎంతో అందోళన వ్యక్తం చేసారు.. నేను కూడా ఎన్ని విధాలుగా అడిగినా ఆ అమ్మాయి పెదవి విప్పలేదు. చివరికి అన్నాను 'చుడమ్మా, నేను నీకు ఒంటరిగా కౌన్సిలింగ్‌ చేస్తాను.తల్లిటండ్రులని బైట వెయిట్‌ చేయమని చెప్పను. ఆ అమ్మాయి అప్పుడు చెప్పిన విషయం ఇది. వాళ్ళ అమ్మా నన్నా, పిన్ని బాబాయి, అత్తయ్య మావయ్య, పొట్లాడుకోవడం చూసిన తరువాత తనకిఈవివహ వ్యవస్థ మీద విరక్తి వచ్చిందట.. తనకు పరిచయమున్న భార్య భర్తలందరూ పోట్లాడుకుంటూ ఉంటారు అంది. కేవలం పిల్లల్ల కోసం సొసైటీ కట్టుబాట్లు కోసం ఈ వివాహ వ్యవస్థ ఏర్పడింది, అంతకు మించి పెళ్ళి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని నాతో వాదించింది. ఆ అమ్మాయికి కౌన్సిలింగ్‌ చేసి పెళ్ళికి ఒప్పించదానికి నాకు అరు నెలలు పట్టింది.

అసలు చెడు మార్గాన పడిన పిల్లల జీవితాలను పర్శీలిస్తే డబ్భై ఐదు సాతం మంది పిల్లలు మాదక ద్రవ్యాలు లేక మరో వ్యసనానికి బానిస అవ్వడానికి కారణం ఇంట్లోని వాతావరణం సరిగ్గా లేక పోవడమేనని తేలింది. చాలా మంది పేరెంట్సు పిల్లల ఎదురుగుండా పోట్లాడుకోవడం చాలా చిన్న విషయంగా భావిస్తారు. కానీ, ఆ లేత మనసలు మీద పడే ప్రభావాన్ని విస్మరిస్తారు. చాలా మంది పిల్లలు ఇటువంటి వాతావరణానికి అలవటు పడిపోయి ఇది తమ జీవితంలో ఒక భాగమని సరిపెట్టుకుంటారు. కానీ శశి లాంటి కొంత మంది సునితమైన మనస్సు గల వారు దానిని జీర్ణించు కోలేరు. ఇలాంటి విషయలు వాళ్ళ సబ్‌-కాన్‌ షియస్‌ మైండ్‌ లోకి ప్రవేశించడం వల్లన, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్‌ డిస్టర్బ్‌ అయి ఇలా కలల రూపం లో వారిని వెధిస్తూ ఉంటాయి..

ఆ మధ్యన పదేళ్ళ కుర్రడు నా దగ్గిరకి వచ్చి.. "నాకు స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్ళలని లేదు. ఇంటికి వెళ్తే.. మా మూమ్మీ డాడీ ఫైటింగ్‌ చేసుకుంటూ ఉంటారు. నాకు మా ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది" అన్నాడు.

ఇటువంటి కేసులు కోకొల్లలు. ఎంతో మంది పెద్ద వాళ్ళు, పిల్లలు తమ మాట వినట్లేదని, చెయ్యి జారిపోతున్నారు అని, అందోళన చెందుతూ ఉంటారు.తమ పిల్లలు చెడు మార్గాన పడుతున్నారని వాపోయే తల్లితండ్రులకు అందులో తమ భగం ఎంతో ఉందని తెలియదు. తెలిసినా తమ తప్పును ఒప్పుకోలేరు. పిల్లలకు అవగాహన వచ్చినా ఈ విషయాన్ని పెద్ద వాళ్ళతో చర్చించే సాహసం చేయరు. ఒక వేళ చేసినా, ఎంత మంది పెద్ద వాళ్ళు దానిని సరయిన కోణంలో చూస్తారు? కానీ పిల్లల ఎదుర్గుండా పెద్ద వాళ్ళు పోట్లాడుకుంటే..తాము చులకనైపోతామని వాళ్ళు గ్రహించు కోరు. ఇంట్లో సరైన ఆహ్లదకరమైన వాతవరణం లేన్నప్పుడు పిల్లలు మాత్రం పెద్ద వల్ల మాటలకు ఎలా విలువిస్తారు??

తమ కోపావేశాలను పిల్లల ఎదురుగా అణచుకోవాలని వారు గ్రహించుకున్న రోజున ఎన్నో సమస్యలకు పరిష్కరం దొరుకుతుంది. చాలా కేసుల్లో కౌన్సిలింగ్‌ చెడు మార్గాన పడిన పిల్లల కంటే వారి తల్లి తండ్రులకు చెయ్యాల్సి వస్తుంది..

ఇక శశి విషయానికి వస్తే, మీరు మీ లైఫ్‌ స్టైల్‌ లో కొన్ని మార్పులు చేసుకోవాలి..

శశి, మీరు రోజంతా ఇంట్లో ఎదో ఒక వ్యాపకం పెట్టుకుని బిజీగా ఉండండి.. అప్పుడప్పుడు వెకేషన్‌ కి ఏదైనా చక్కటి అహ్లదకరమైన చోటుకి వెళ్ళి రండి. శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం చెయ్యలేక పోతే కనీసం వాకింగ్‌ అయినా చేయండి. మంచి పౌష్టికాహారం తీసుకుని, రెగ్యులర్‌ గా వ్యాయామం చేస్తే శరీరంతో పాటు మనసుకు కూడా ఎంతో మంచిది. రాత్రి పడుకోబోయే ముందు చక్కటి సంగీతం వినండి లేక మీకిష్టమైన పుస్తకం చదివి పడుకోండి. వయలెంటు సినిమాలు, టి. వి. ప్రోగ్రాంలు వీలయినంత వరకు అవాయిడ్‌ చేయ్యండి. ముఖ్యంగా రాత్రి పూట. అలాగే నిద్ర పోయే ముందు, వేడి నీళ్ళ తో స్నానం చేసి, ఒక గ్లాసు పాలు తాగి పడుకోండి.. ఇది కేవలం ఒక మానసిక సమస్య మాత్రమే. శశి సబ్‌-కాన్షియస్‌ మైండ్లోంచి పాత చేదు జ్ఞాపకాల్ని, అలోచనల్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి. నేను చెప్పినవన్నీ పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఒక రెండు నెలలు తరువాత కనిపించండి. విష్‌ యూ గుడ్‌ లక్‌.

సిద్ధార్థ్‌, శశి: థ్యాంక్యూ డాక్టర్‌.