మిస్సింగ్‌........కనపడుటలేదు!

Kavita Ganduri

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

పొద్దుటినుంచి టెన్షన్‌ తో కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా మైళ్ళు మైళ్ళు తిరుగుతున్నది నేనే..శెల్యూషని. అసలు ఈ విషయం తెలియగానే ఒళ్ళంతా చమటలు పట్టేసింది.గ్రీనుకార్డు విషయంలో కూడా ఇంత టెన్షన్‌ పడుండనేమో..ఒక పక్క భయం,మరో పక్క కోపం,నామీద నాకే జాలి ఇలా అన్ని ఫీలింగ్సు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.వెతకని చోటంటూ లేదు,కెలకని ప్రదేసమేదీ లేదు..ఇల్లంతా చిందర వందరగా ఉంది. ఏం చేయాలూ పాలు పోవటం లేదు.భగవంతుడా ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా వద్దు అని ఎన్ని సార్లు అనిపించిందో.కొబ్బరికాయలు,పిట్స్‌ బర్గు టెంపులు దర్శనంలాంటి అన్ని మొక్కులూ అయ్యాయి.

ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లం నాది.అసలు అది పోయిందని ఎవరికన్నా చెప్పడం ఎంత సిగ్గుచేటు? ముందు అది పోయిందానికంటే ఇంట్లోని ఫామిలీ మెంబర్సు ఎలా రియాక్టు అవుతారో అని తల్చుకుంటే ఇంకా టెన్షను పెరిగిపోతోంది.

అమ్మకి చెబిటే నన్నే చావ తిట్లు తిడుతుంది...ఏది ఎక్కడ పెట్టవో అంత ఒళ్ళుపై తెలియకుండా ఉన్నవా అని దండకం చదువుతుందేమో...? విషాల్‌ నన్ను ఆలెవెల్లో తిట్టక పోయినా నేను ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌ గా ఉన్నానా అని అనుకుంటాడు.అసలు మా అత్తగారిని తలుచుకుంటేనే నాకు బి.పి. పెరిగిపోతోంది.ఇప్పటి వరకు 'కన్నాంబ ' లాగా ఉండే ఆవిడ 'సూర్యకాంతం ' లాగా అయిపోతుందేమోనని నా భయం.

సరే, ఇంక ఇంట్లో కనపడలేదు అని నిర్ధారించుకున్నాక ఇక ఈ సమస్యకు విరుగుడేమిటని ఆలోచించసాగాను. మేముండేది చిన్న ఊరు. ఇక్కడ 'అది ' అమ్మే ఇండియన్‌ స్టొర్సు లేవు. చికాగో వెళ్ళవల్సిందే. కానీ అది రెడీమేడుగా దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ఆర్డరు ఇవ్వాలేమో. కానీ అంత టైము లేదే. రేపొద్దుటికల్లా 'కన్నాంబగారు ' దిగుతారు. ఆవిడకి ఇలాంటి పట్టింపులు చాలా ఎక్కువ. కాళ్ళకి మట్టెలు లేకపోYఇనా ఫరవాలేదు కానీ మెళ్ళో 'మంగళసూత్రం ' మిస్సింగు అని గమనిస్తే నాపని అవుటు. మంగళసూత్రాలు కనబడటంలేదు అత్తయ్యా అని ఎలాగ చెప్పడం?

రిపేరు కిచ్చానని ఏకుంటి సాకో చెప్పి ఒకటి రెండు రోజులు గడిపేయచ్చుకాని ఆవిడ మాతోటి నాలుగు నెలలు ఉండటానికి వస్తున్నారు. ఇలాంటి కహానీలు చెప్పి ఆవిడని మభ్యపెట్టలేను. కనీసం టైముకి నల్లపూసలు కూడా లేవు. రిపేరుకని ఎవరో ఇండియా వెళ్తుంటే అమ్మ దగ్గిరకి పంపించాను. మా అత్తగారితో పన్పించడానికి అమ్మకి కుదరలేదు. మళ్ళా ఇండుయానుండి ఎవరు వస్తారా అని వెతుక్కోవాలి. దిక్కు తోచని పరిస్థితిలో అమ్మకి ఫోను చేసాను.

అమ్మ: ఆ శెల్యూ ...ఎలా ఉన్నారమ్మా? అయినా ఇంత లేటుగా ఫోను చేసావే... మీరంతా కులాసేనేగా?
శెల్యు: సారీ అమ్మ... కానీ తప్పలేదు..మేము కులాసాగానే ఉన్నాము..కోపం తెచ్చుకోకుండా ముందు నేను చెప్పేది కూల్‌ గా విను.
అమ్మ: సరేకాని...అసలేంజరిగిందమ్మా?
శెల్యు: నా 'మంగళసూత్రాలు ' కనపడటంలేదమ్మ...
అమ్మ: ఏవిటీ...?
(ఒక నిమిషం మాట లేదు)
అమ్మ: అసలు మంగళసూత్రాలు తీయాల్సిన అవసరమేమొచ్చింది?
శెల్యు: నీ దగ్గిర దాచాల్సిన అవసరం ఏముందమ్మా? పెళ్ళైయిన కొత్తల్లో రెగ్యులర్‌ గానే వేసుకునేదానిని. రాత్రి పడుకునేటప్పుడు చికాగ్గా ఉంటుందని బెడ్రూములో కొక్కానికి వేలాడదీసేదాన్ని. పొద్దునే మళ్ళీ తగిలించేదాన్ని. ఎప్పుడైయినా పార్టీసుకి,ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు డ్రెస్సుకి మ్యాచింగా లేదని తీసేదానిని. కానీ ఇక్కడికి వచ్చాక అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. జీన్‌ సు,స్కర్ట్‌ లమీదకి 'అది ' అంత సూట్‌ అవ్వదుకదమ్మా.
అమ్మ: బావుందమ్మా...మంగళసూత్రాలు ఫ్యాషన్‌ కి వేసుకుంటారన్నమాట.రేపు మన బంగారపు కొట్టుకి వెళ్ళి జీన్సు , స్కర్టల మీదకి సరిపడే మోడల్సు ఎవయినా ఉన్నయేమో కనుక్కుని ఆర్డరివ్వనా?
శెల్యూ: అమ్మా...జోకులు తర్వాత... ఇక్కడ అసలు మా ఫ్రెండ్సుసర్కిల్లో ఎవ్వరూ మంగళసూత్రాలు రెగ్యులర్‌ గా వేసుకోరు తెల్సా...ఇంకా నేను ఎంతో నయం...రోజో బొట్టైయినా పెట్టుకుంటాను.
అమ్మ: అబ్బో....అదంతా సరే...అసలు ఆఖరి సారి నువ్వు గొలుసుని ఎక్కడ చూసావు?
శెల్యు: నెలరోజుల క్రితం పాలిష్‌ పెడదామని పసుపు,డిటర్జెంటు నీళ్ళలో నాన పెట్టాను. ఆ తర్వాత గుర్తుకు రావటం లేదు. ఇక్కడ ఇంట్లో పోయే చాన్సే లేదు.బైట వాళ్ళెవరూ ఇంట్లోకి రారు.ఇండియాలోలాగా పనివాళ్ళ భయం లేదు. విషాల్‌ అసలు నా వస్తువులు జోలికే రారు. అసలు ఇంటి విషయాలు తను పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో వెతకని చోటంటూ లేదు.ఇంకొకటి చేయించి నువ్వు పంపుతావు. కానీ నా టెన్షనంతా రేపు మా అత్తగారు దిగుతున్నారని. వేరే ఫ్రెండ్సు దగ్గిర తీసుకుని మళ్ళీ ఇచ్చేసే వస్తువు కూడా కాదు ఇది. పైగా శ్రావణ మాసం ఇంకో రెండు రోజుల్లో మొదలవ్వబోతోంది. ఆవిడ నోములని,పేరంటాలని హడావిడి చేస్తారు.మెడలో మంగళసూత్రం లేకపోతే ఆవిడ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని తల్చుకుంటేనే నాకు చమటలు పడుతున్నాయమ్మా. ఏం చేయాలో దిక్కు తోచక నీకు కాల్‌ చేసాను.
అమ్మ: ఇదిగో శెల్యు..ఊరికే టెన్షన్‌ పడకు. టెన్షన్‌ తో సగం బుర్ర పనిచేయదు. నేను ఏదో ఒకటి ఆలోచించి పొద్దునే ఫోను చేసి చెప్తానులే. ఆవిడ రేపటి సాయంత్రం ఫ్లైటుకి కదా వచ్చేది. నువ్వు ఈలోగా ప్రశాంతంగా ఇల్లంతా సర్దుకో. ఊరికే వర్రీ అవ్వకు. సాయంత్రం విషాల్‌ ఆఫీసునించి వచ్చాక ఇద్దరూ కలిసి వెతకండి. ఒక్కొక్కసారి మనకు అక్కడే ఉన్న వస్తువులు కూడా కనపడవు. ఇంట్లోనే ఉందంటున్నావు.కాబట్టి ఎక్కడికీ పోదులేమ్మా శెల్యు. రేపొద్దునే నిదానంగా కూర్చుని ఆలోచించు. ఎక్కడ పెట్టావో నీకే గుర్తుకు రావచ్చు. అనవసరంగా లేని పోనివన్నీ ఊహించుకుని బుర్ర పాడిచేసుకోకు. దొరక్క పోతే చూద్దాం. అయినా మీ అత్తగారేమీ రాక్షసి కాదు. నిదానంగా ఆవిడకి సర్ది చెబుదాం. శెల్యు: అందుకనే నీకు ఫోను చేసానమ్మా. కొంచం టెన్షన్‌ తగ్గుతోంది. సరేలే నువ్వు చెప్పినట్లే చేస్తాను. మీకు చాలా లేటయింది. ఇక పడుకో. నీకు మళ్ళా రేపు పొద్దున్నే కాల్‌ చెస్తాను.సాయంత్రం టిఫిన్‌ పెట్టి టీ ఇచ్చాక విషాల్తో మెల్లిగా విషయం చెప్పాను. నేను పడ్డ టెన్షనంతా వివరించాను.
విషాల్‌: ఓసి పిచ్చిదానా! నాకు ఆఫీసుకి ఫోను చేయచ్చు కదా...
శెల్యు: భలే వారండి..మిమ్మల్ని కూడా ఎందుకు ఆఫీసులో టెన్షన్‌ పెట్టడం ఇంటికి వచ్చాక చెబుదామని ఊరుకున్నాను.
ఆ తర్వాత విషాల్‌ చెప్పిన విషయం విన్నాక కోపం, ఆవేశం,నవ్వు అనీ కలిపి నా కంట్లోనుంచి ధారలుగా ప్రవహించాయి.
సాయంత్రం అమ్మకు ఫోను చేసాను.
శెల్యు: అమ్మా నీకొక గుడ్‌ న్యూస్‌. నా 'మంగళ సూత్రాలు 'దొరికాయి.
అమ్మ: నేను చెప్పానా...ఇంతకీ ఎక్కడ పెట్టావు?
శెల్యు: నెల రోజుల క్రితం పాలిష్‌ పెడదామని నీళ్ళల్లో వేసానని చెప్పాను కదా...ఆ తర్వాత దాని సంగతే మర్చిపోయాను.రెండు రోజులు అలాగే ఉండిపోయాయి. ఒక రోజు విషాల్‌ చూసి ఏమిటి ఈ మురికినీళ్ళు అని చూస్తే అందులో మంగళ సూత్రాలు కనిపించాయట. దీనికెంత
నిర్లక్ష్యం...చూద్దాం అసలు ఎన్ని రోజులకి అడుగుతుందో టెస్ట్టు చేద్దామని నన్ను ఆట పట్టించడానికి తీసి ఒక కవర్లో పెట్టి కారు డాషుబోర్డులో పెట్టారట!
అమ్మ:బావుందమ్మా మీ మొగుడూ పెళ్ళాల సరసాలు. పిచ్చిపిల్ల ఎంత టెన్షన్‌ పడ్డావో..పోనీలే రాత్రికి ప్రశాంతంగా పడుకో. ఇవాళ గుడికి వెళ్ళి నేను నా ప్రదక్షిణాల మొక్కు తీర్చుకుంటాను.