జ్ఞాని .. క్రిష్ణమూర్తి

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereభక్తితత్పరతన నిత్యపూజాధ్యానములతో
బతుకు గరపుచుండెడి తల్లి పెంపకములో
తల్లిచాటు తనయుడై ధన్యుడైనాడు
పరాతత్వధ్యాసలో పలుమార్లు
దివ్యదృష్ఠి సంపన్నతన వెలుగొందిన
యామెకు నీడయై తెలియకనే గ్రోలినాడు,
అద్యాత్మికానుభూతవాయువుల బాల్యమందే.
కానున్న సత్యాన్వేషణాదీక్షకై
మార్గము సుగమము, ప్రేరణ యగుటకేమో
పరమపదించెను తల్లి నాతని కౌమార్యమందే.

పిల్లలందరు కలిసి పదునొకండుగురైన,
అష్టముడు క్రిష్ణమూర్తి, తమ్ముడు నిత్యానందులు
నుండిరి తండ్రి పెంపకమందు కడుకూర్మితోను
విడిచియుండ నోపరొక్కదినమైన యెందుకైన.

ప్రపంచ దివ్యజీవన సమాజోద్ధరణకు నాధిపత్యము వహింప
మైత్రేయువంటి లోకోత్తర దివ్యపురుషుల ప్రేరణలనాదరవుగ
ప్రముఖులు లెడ్బీటర్, అనిబిసెంట్యాదులు
నెంపికజేసిరి పెద్దవానిని పదివత్సరముల వయసుండగ.
వీడవలసి వచ్చె సామాన్య, స్వేచ్చాయుత జీవనమును
తండ్రి నీడయు, తెలుగునాడును కోర్టుతీర్పు మేరకు
బతుకన్ననేమో దెలియని పదునొకొండేళ్ళ ప్రాయములో
తనకధకారంభాలంబనమేదియో నెరుగలేని స్థితిలో
యెందుకనో అనిబిసెంటుతో అంగ్లదేశమునకు

నియమితులై నేర్చిరి చదువులు
సంస్కారము, సంస్కృతులు గూడ
నియమమన్నది యెందుకో దెలియకున్న వినయముగ
నాగరికతను, సర్వమత సిద్ధాతముల గూడ నేర్వగలసినంత
పాశ్చ్యాతులు బోధించి నటుల

పెద్దవాని, క్రిష్ణ, దృష్ఠి నిజమన్ననేమొ దెలియగోరెనె గాని
దెలియకుండె దానికడ్డంబెయ్యదో నెంత యాలోచించిన
ధ్యానము విడువక చేయుచుండె ప్రతిదినమ్ము.
ప్రకృతియన్న ప్రేమానురాగముల మహిమ యేమో
పంచభూతముల ఆశీర్వాదముల ఫలమో, యేమో
అదృశ్య వ్యక్తుల ఆశీస్సుల వలననేమో
పొందెను జ్ఞానానుభూతి కాలక్రమమున
పలుమార్లు తీవ్రోష్ణతన దేహస్ఫూర్తి పోయినానంతరము
యెనలేని నొప్పుల దేహ సుద్ధి నొందిన తదుపరి.
అనుజుని అకాలమరణమొక పెనుతుఫానై
తుడిచివేసెను మోహమున్నిర్విశేషముగ

తోచెను మనుజుల బంధకారణము
కాంచెను నాలోచనల జన్మరహస్యమును
తెలిసెను వాని పూర్వ క్షేత్ర వైభవమును
తపించెను ఆ అనుభవమితరులతో బంచుకొనగ

దివ్యజీవన సమాజపు లోకాధిపత్యమివ్వ
సర్వాధికారివై సంస్థనే రద్దుజేస్తివంతలోనె
మైత్రేయు వరమని యెంచి సహచర్యుల వొప్పించి
చదువుసభ్యతల నేర్పించి పోషించి పెంచి
సాటిలేని నాయకునిగ నియమించిన
అనిబిసెంటు నామె సహచరుల యాశలు
యా సమాజపు నునికి నొక్క వేటున వమ్ము జేసినావు
అనంత కీర్తి ప్రతిష్ఠల నిచ్చు నవకాశము వద్దనినావు
ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అద్యక్ష పదవి విరమించినావు

అందలమెక్కింప యెందరో కాచుకునున్న
ధనరాసుల నందుకొని ధన్యుల జేయమని
అనుచరులుగ నుండు నవకాశమిమ్మని
ఇందరముండగ అండవిహీనుడవై నుండ యేలని
యెందరో నుడివిన, వారి యాదరణ నిరాకరించినావు

అండదండలు, ఐశ్వర్య కీర్తులు కాంక్షించువారు
అజ్ఞాతలై, అవిధేయులై యుండలేరని
జ్ఞానమార్గమున స్వేఛ్ఛగ జరించలేరని
అనియోనేమొ, పేదవై వేదికను విడిచినావు
నీది కాగల సౌభాగ్యమును వద్దనినావు
అత్తరి నీ మానసిక స్థితి యెట్టుండెనో
నీజ్ఞానానుభవము యేమై యుండునో?

ఆ ధైర్యం తెగింపు సత్యవర్తన
ఆ నిస్వార్ధం నిరహంకార ప్రవుత్తి
ధనకీర్తిపదవులన్న నిరాకర్షణ
ఆ బాహ్యాంతరశుచిధ్యాస
వైభవలక్ష్మియన్న విరాగమూ
అన్నీ కలగలిసి రూపొందిన
ఆ నీ మనోగతిని యూహింపలేను
ఆ స్థితికిజేర్చిన అనుభవములేవొ దెలియలేను
ఈశ్వరానుగ్రహముచే నూహింపగలను.

బహిర్ప్రమాణములు అనుకరణోచితము, ఆచరణీయములైనను
సర్వప్రమాణములనధిగమించి అలోచనలకందని సదౄపమును
స్వప్రమాణానుగతముగ నెరుగవలెనని వక్కాణించినావు

జ్ఞాన స్వరూపానుభూతి మార్గనిర్ణీతము గాని క్షేత్రమని
దారులన్నవి యాలోచనలవల్లనే రూపముల నొందునని
ఆలోచనాస్రవంతులు లేశమాత్రము లేని మానసమే సుక్షేత్రమని
నట్టి సుక్షేత్రములో నెరుకతో ములిగియున్న మౌనియగునని
నత్తరి సర్వాంతర్యామియౌ జ్ఞానక్షేత్రము చేరువవునని
నిర్మొహమాటముగ నిక్కచ్చిగా జెప్పిన వ్యక్తి శ్రీ క్రిష్ణమూర్తి.

సంస్థలు వ్యవస్థలు మానవోద్దరణకని ప్రారంభమగును
నిర్వాహకులు, సభ్యులు త్వరలోనె వీటినుద్ధరింపమాత్రమే నున్నవారగుదురు
బాహ్యప్రమాణములు, గురుతుల్యులు అద్యాత్మికావరణాప్రవేశమునీయునేమొ
ఆ ఆవరణాంతరమును శోధించి సుద్ధపరమపదమునొంద సొంతముగ జేయవలసినదే.

ప్రమాణరహిత సాధనాక్రమము
సామాన్యులకాచరణీయము కాకపోయినా
ఉదాహరణలు యుపమానములులేని
సంభాషణారూపగతమౌ వారి సత్సంగ సభలు
సాధారణ ధారణాసంపన్నులనాకర్షింపకున్నా
ప్రపంచమున పలు మత, శాశ్త్రీయ విజ్ఞాన రంగములలో
ప్రఖ్యాతిగాంచిన మేధాసంపన్నుల ప్రమాణములకతీతుడై
ప్రభవించి జ్ఞానయోగియై స్వప్రకాశమాన్యుడై
విరాజిల్లిన ధన్యజీవి శ్రీ జిడ్డు క్రిష్ణమూర్తి.