పిల్లలు

మోహన్ వల్లభజోశ్యుల

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereకొత్తగకొన్న పలకలా
విత్తుని చేధించివచ్చిన మొలకలా
చిత్తమెంతో కాళీగాయున్న శిశువు
చెత్తచేర్చే యీ వాతావరణానికి వస్తుంది

ప్రారంభమౌతాయి సంబరాలు
గారాబాల మురిపాల సవ్వడులు అలజడులు
ఆరంభమౌతాయి తూనికలు, పోలికలు
ఆర్భాటాలు, హడావిడి శిశువుకర్ధంలేకపోయినా

వాళ్ళనాన్నలా ఆ చూపుచూడు
యెలా వింటోందో దానన్నలా
అలా చూడండే నవ్వు అచ్చం వాళ్ళమ్మదే
వాళ్ళ నాన్నమ్మ జుట్టులా ఉందే..

యేమైన దానక్క రంగు రాలేదే
యేమాటకామాటే చెప్పుకోవాలి
హైమ ముందు యిది తీసికట్టేనే
యేమైనా గుణసుందరైతే చాల్లే

శరీరంలో భాగాల్ని, గుణవిశేషాల్ని
చెరొకరికి అంతాకలిసి యిలా పంచేస్తారు
పెరగబోతున్న ఆ పసికందుకు యేమీ
వెరసి వ్యక్తిగతంగా ఉండకూడదన్నట్టు
సరిగా మనమూసలోకి చేరకపోతె లోటైన్నట్లు
ప్రకృతి కార్యనిర్వహణలో లోపం చేసినట్టు

బుర్రకెక్కించిన ఆ పోలికలపట్టి నమూనాగా
పెరగవలసి వస్తుంది ఆబాల అనవసరంగా
ప్రయత్నిస్తూ యుండాలి పెద్దల మన్ననకై
వారి మెప్పు కోసమై అవస్థలుపడుతూ
కోరుకోని మానసిక క్షోభ భరించుతూను

గర్వం, గొప్పతనం, ఆత్మస్థుతి, పొగడడం
నిరసన, కోపం, గయ్యాళితనం
ఈర్ష్య, అలగడం, జుగుప్స, ఆత్మనింద
పరనింద, ముఖస్థుతి, నటన
ఆక్రమించుకుంటాయి ఇలాంటివన్నీ
చిరుప్రాయం దాటుసరికే, ఈఝంఝాటంలొ

సంభూతమైన దేహము, భావములతో
పోలికలభారంలేని వాతావరణంలో
వినాశకర లక్షణాలు కలుగనీయని
సహజధోరణిలో తానుగా తనని
శారీరకంగా మానసికంగా హాయిగ
పెరగనియ్యమెందుకనో?
పసివాళ్ళ నూతన మనోఫలఖములపై
మన ఆలోచనాముద్రలెందుకు వేస్తామో?

మల్లెలవాసన గులాబీలకి తెప్పించాలని
పాలపిట్ట రంగుతోపాటు కొయిలగొంతు చేర్చాలని
యెలాగైనా ఇంజనేర్నో డాక్టర్నో చెయ్యాలని
ఇలా సృష్ఠికి ప్రతిసృష్ఠి చేయాలని
ఆలోచించే ఈ బుర్రలకి విపరీత వాంఛలెన్నెన్నో?
పోలికల పెనుగులాటలో తానెవరొ, యేమిటికావాలో
తెలీక అనుకరణతోనె సరిపెట్టుకొననేర్చి
పిల్లలు తమ వ్యక్తిత్వానికి తిలోదకాలిచ్చుకోవాలి

మనం కొనియిచ్చే బొమ్మలతో పిల్లలాడుకున్నట్టు
మనకిచ్చిన పిల్లలతో ముచ్చట్లు తీర్చుకోవడం
మన అశలు ఆశయాలు వారిద్వారా నెరవేర్చుకోవడం
సొంతముకాని వారిని ఉపాధులుగా చేసుకోవడమేగా

గిబ్రాన్ గారి వాక్యాలు ఈ సంధర్భంలో గుర్తొస్తున్నాయి

..

పిల్లల దేహాలుంటాయి మనతో, వారి ఆత్మలుకాదు
పిల్లలు మనతో ఇంట్లో ఉంటారు, కాని మన సొంతముకారు
పిల్లలు మనద్వారా వస్తారు, మననుండి కాదు
పిల్లల్ని ప్రేమించాలి, మన ఆలొచనలు రుద్దరాదు

తన వికాశానికి అనుకూలంగా గురిచేసుకొని
మనల్ని విల్లులుగా జేఁసి అనంతవిశ్వంలోకి
బాణాలుగా సంధించుకుంటుంది పిల్లల్ని
అంతులేని భావికాలపంథాల్లోకి ప్రకృతి
భవిష్యద్నిర్మాణవ్యూహనికి సజీవశక్తులే పిల్లలు

.. అన్నింటిలాగ సృష్ఠిలో నవతరించినా
పొందుపరచబడిన రూపగుణ విశేషాలతో
స్వధర్మానుగతంగ వికసించి జేవింపగల్గడం
ఆధునిక కాలంలో పిల్లలకు దుర్లభమేమో!