స్వానుభవ పాఠాలు

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereపూటపూటకు కడుపు ఖాళీయగును
రోజురోజుకు పెఱుగు వాంఛలన్నియును
కడుపునింపిన మాత్రమె యుండ లేడు మనిషి
వాంఛలుడిగినగాని పొంద లేడు ముక్తి

సొమ్ము సోకులున్నవని సంబఱమదేల
సుఖశాంతుల మొందెదమ నిబ్బఱము గాను
సతిసంతానములున్నారని సంతసించ గలమా
సమయము, మనసులు మనకు గాకున్న

చదువు సంధ్యలున్నాయని తెగ నీల్గఱాదు
సంస్కారమె లేకున్న దల్చఱెవ్వరు మనసునందు
శిఖరమెక్కితినని గర్వపడ నదేల
దుఁఖ్ఖమాగదు కద క్రింద నున్న కంత కానలేకున్న

పఱులమెప్పుకై పనులు జేయఱాదు
కోఱి నణచరాదు మనోభావముల భీతినొంది
వెఱ్ఱివారలను జేయు నహంకారమే మనకున్న
నిర్వికారులఁజేయు మన మనసుల మనమెఱిగి యున్న

గిరుల పిండిజేయగల సామర్ధ్యమున్నంత
నీరు పల్లము జేఱకుండ నాపగలమా?
దేహాంగముల మార్చెడు తంత్ర, యుక్తిగతులు మనకున్నా
ఇహమన్న మోహముడిగిన జీవాత్మనుంచ గలమా?

పైమెఱుగుల్లేని దేవుళ్ళకూ లేదు యాదరణ భువిలోన
వైభవమ్మున దేలు స్వాముల కించపఱచ నెంచుటదేల
కాముకులమై వాఱిఁజేరి, తదుపఱి దూషింప సబబు కాదు
అమృతముండగ వచ్చు మట్టి, బంగాఱు, యితఱ పాత్రలందు
యేమార్పున పాత్రనే గుఱ్తించిన పొందలేము నమృతమును

శాంతిమంతుల నెప్పుడు సాధించ రాదు
సాధువుల, స్వాముల నడవడి తర్కింప రాదు
బంధుజనులయందు పగ సుఫలమీయ లేదు
కుతిమతుల నెన్నడు కార్యార్ధమునకైన కోఱి చేర రాదు

తల్లుల మమకారమునకు హద్దుల నర్ధింప తగునా
పిల్లల నిస్సహాయతకు వారిని నిందింప సబబౌనా
తండ్రుల హాహాకారముల కర్ధముండక పోవునా
కొడుకుల సహనాన్కి సఱిహద్దులుండ కుండునా

బాధ్యతల నెఱుగవలనన్న యనుభవమవసరము లేదు
స్వార్ధచింత తగ్గినంత పఱార్ధ మర్ధమైపోవు
అనుభూతుల నెఱుగ గల్గిన అవ్యక్తరూప మవగత మైపోవు
దాని నంగీకఱింప గల్గిన మనసు భారముడిగి పోవు

నేను నావారను భావముతో జేయు నుపకారము
కానేర దెన్నటికి నా ధర్మముతో సమానము
అనురాగమన్నది రాదు రక్తబంధువుల మైన
అనుబంధ మేర్పడు యెవరితోనైన అనురాగమే యున్న

అనురాగమన్నది రాదు అనుకఱణ వలన
అనుబంధ మేర్పడదు జీవితమన ధృక్పధములు విభిన్నమైన
అనుమానమునకు మించిన మనస్తాపము లేదు
అనుభవమునకు మించిన గుఱువు లేడు

నీ వాఱికి నువ్వు చేసినదంతయు
నీ తపన తాపత్రయముల దీర్చుకొందుకే
యెవరైన వాటిని గుఱ్తించి నట్లైన
నది వారిని వారు మన్నించు కొందుకే