నేరము - శిక్ష

Jonnavithula Ramakanth

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereట్రింగ్-ట్రింగ్--ట్రింగ్---

ఫోన్ ఎత్తుతూ "హెలో" అని ప్రశ్నార్ధకంగా అడిగాడు మార్తాండం.

"... నేనేనండి..." అన్నది చిద్రూపి.

"నువ్వా? ఆఫీసుకి ఫోన్ చెయ్యద్దని చెప్పాను కదా?"

"చెప్పారనుకోండి...."

"...మరి?... సరే చెప్పు ఏం మునిగిపోయిందో"

"బాబు ఇంకా ఇంటికి రాలేదండి"

"...వస్తాడ్లే. నాలుగున్నరేగా అయింది."

"ఔననుకోండి. రోజూ నాలుక్కాకముందే వచ్చేవాడు. నాకు గాభరాగా ఉంది."

"అబ్బ.... ప్రతి దానికీ అట్లా కంగారు పడబోకు వస్తాడ్లే."

"నాకేదో భయంగా ఉందండీ. మీరొకసారి స్కూలుకి వెళ్ళిచూసిరండి."

"నేనా! నాకెట్లా తీరకౌతుంది పని బోలెడంతుంది."

"మరెట్లాగండీ... ఈ ఉళ్ళో తూర్పు పడమరలు కూడ నాకు తెలీవు. మీరెప్పుడైనా బయట ప్రపంచాన్ని చూపిస్తేగా?"

"మొదలు పెట్టావూ నీ సాధింపు..."

"ముందర బాబు సంగతి ఆలోచించండి."

"సరే సరే... మూర్తిని పంపిస్తాలే చూశిరమ్మని."

"వెంటనే పంపించండి.... ఏ సంగతీ నాకు చెప్పమనండి."

"అట్లాగే."

మార్తాండం ఒక చిన్న బ్యాంక్‍కి మేనేజర్. పెళ్ళై ఐదేళ్ళైంది. వాళ్ళది ఒక పెద్ద గ్రామం. హైస్కూల్, బస్ సదుపాయములున్నై. వాళ్ల బాబాయి ఊళ్ళో ఉండి డిగ్రీ పూర్తి చేశాడు. బాబాయి పరపతి ద్వారానే ఈ ఉద్యోగం కూడా దొరికింది. చిద్రూపి తండ్రి ఆయనకు బాగా చెలిమి. ఈ పెళ్ళి జరగటానికి అదే ముఖ్య కారణమైనా యధావిధిగా కట్నకానుకలు లాంఛనాలకు లోటు రానివ్వలేదు. పెళైన ఏడాది లోగానే బాబు పుట్టాడు. నాలుగేళ్ళకే బడికి పంపంటం తల్లికి ఏ మాత్రం ఇష్టం లేదు. మగ పిల్లాడు చదువు రాకపోతే ఎట్లాగంటూ, ఆమె మాటలు పెడచెవిని పెట్టి తండ్రి ఎల్.కే.జీలో చేర్పించాడు.

పురుషాధిక్యతాతత్వం జీర్ణించుకొన్న వ్యక్తి మార్తాండం. పురుషుల సౌఖ్యం కోసమే స్త్రీలు సృష్టించబడ్డారని అతని నమ్మకం. వారికొక వ్యక్తిత్వమున్నదని గుర్తించడు. పైగా వఠ్ఠి అనుమాన పిశాచి. బ్యాంక్ వాళ్ళు నిర్దేశించిన వసతి గృహం కూడా అతని తత్వానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండింది. ఆ ప్రదేశంలో ఇళ్ళు అప్పుడప్పుడే కట్టడం మొదలు పెట్టారు. ఈ ఇంటి చుట్టుపక్కల ఇళ్ళు లేవు. వీధికి ఆవలివైపున ఇప్పుడిప్పుడే రెండు మూడు ఇళ్ళు ప్రారంభించారు. ఐనా తన ఇంటి తలుపులు, కిటికీలు ఎల్లప్పుడు మూసే‌ఉండాలి. ఈ నాలుగైదేండ్లలో పుట్టింటికి పంపడానికి మూడు నాలుగు సార్లు, మిత్రుడి గృహప్రవేశానికి ఒకసారి, డాక్టర్ దగ్గరకు కొన్నిసార్లు, ఇట్లా మితంగా మాత్రమే చిద్రూపికి గడప దాటే అదృష్టం. పైగా పసివాని సాకు. ఇంటి తలుపులు మూసేవుంచాలి, లేకపోతే దొంగలు బలవంతంగా ప్రవేశిస్తారని చెప్పి చెప్పి నమ్మించాడు. ఒకరోజు వీధివైపు కిటికీలో అద్దం ఉంచి తలదువ్వుకొంటుండగా మార్తాండం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆనాడు పెద్ద రభస జరిగింది. తన ఆదేశానికి భిన్నంగా చిన్న పొరపాటు జరిగినా గొడవ జరిగితీరాల్సిందే. చిన్న గ్రామంలో నివసించివచ్చినది కనుక బెదిరిపోయి, భర్త నిర్ణయించిన పరిధిలోనే జీవిస్తూండింది. ఇన్నాళ్ళూ బాబుతోనైనా కాలక్షేపంగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేక ఆమెకు ప్రొద్దుపోవటం దుర్భరంగా ఉంది. తానూహించుకున్న జీవితాన్ని వాస్తవంతో పోల్చుకొంటూ దిగ్భ్రాంతి చెందుతూండేది.

వాళ్ళది సామాన్య కుటుంబం. ఒక అక్క, ఒక తమ్ముడు. అక్కను బడికి పంపనేలేదు. ఆమె వివాహము 13 ఏళ్ళకే చేసి 15వ ఏట కాపురానికి పంపించేశారు. ఆమె తనకంటే ఆరేళ్ళు పెద్దది. తరువాత ఇద్దరు పిల్లలు పసితనంలోనే పోయింతరువాత తాను జన్మించింది. యేడాది తిరగకముందే మగశిశువు కలిగాడు. జన్మ తరించినట్లు తల్లిదండ్రులు సంబరపడిపోయారు. వరప్రసాద్ అని నామకరణం చేశారు. బాబు అంటే తల్లిదండ్రులకు తగని గారాబం. తనకు జరగని ముచ్చట్లన్నీ తమ్ముడికి యధావిధిగ చేశారు. తమ శక్తికి మించని అన్ని కోరికలు నెరవేర్చారు. తమ్ముడ్ని ఒంటరిగా పంపటం ఇష్టం లేక తనను కూడా బడికి తోడుగా పంపించారు. తమ్ముని చదువు భారం మూడువంతులు తానే మోసేది. ఆ రోజుల్లో ఒక తరగతి నుంచి పై తరగతికి ఏ ఆటంకం లేకుండానే పంపుతూండేవాళ్ళు. ఎస్.ఎస్.ఎల్,సి. వద్ద మాత్రమే సార్వత్రిక పరీక్షలూ. వాటిలో పాస్ కావల్సిన అవసరమూ. చిద్రూపి పాస్ ఐంది. వరప్రసాద్ కాలేదు. చిద్రూపి పాస్ అయినందుకు ఎవ్వరూ సంతోషించలేదు. పైగా మగపిల్లాడు తప్పి ఆడపిల్ల పాస్ కావటం ఎవరికీ మింగుడు పడలేదు. ఎస్.ఎస్.ఎల్,సి. అధికారులను అంతా దుమ్మెత్తిపోశారు. చిద్రూపి పై చదువులు చదువుతానని ఎంతగా మొరపెట్టుకొన్నా వినిపించుకొన్నవారే లేకపోయినారు. "ఆడ పిల్లవు. నువ్వు ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా? చదివిన చదువు చాల్లే" అని విదిలించుకొన్నారు. "ఈ చదువు చెప్పించినందుకే దీనికి సంబంధాలు దొరక్క నానా అగచాట్లు పడాల్సొస్తున్నది" అని అనుకోటం ఎన్నోసార్లు చిద్రూపి విన్నది. ఇక నోరు మెదపలేకపోయింది. తలవని తలపుగా ఈ సంబంధం కుదిరి సవ్యంగా పెళ్ళైంది. వాళ్ళ భారం తీరిపోయింది. తనకూ కొత్త జీవితం మొదలౌతున్నదిగదానని సంతోషించింది. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడుతున్నదని పాపం గుర్తించలేకపోయింది. పురుషాధిక్యతతో ఇన్నాళ్ళు వేగుతూనే వచ్చినా ఈ జైలు శిక్ష తట్టుకోలేకుండా ఉంది.

స్నేహితుని ప్రోద్బలం కారణంగా మూర్తికి తన బ్యాంక్ లోనే ఉద్యోగం ఇప్పించాడు మార్తాండం. ఆ చొరవతోనే చిన్న చితక పనులు మూర్తికి అప్పగిస్తూండేవాడు. కృతజ్ఞతతో మూర్తి కూడ సహాయపడుతుండేవాడు. పైగా ఒంటరివాడు. అంత ఇబ్బందిగ ఉండేదికాదు. మార్తాండం చెప్పగానే మూర్తి బాబు బడి దగ్గరకు వెళ్ళాడు. రిక్షావాడు ఆ పూట హఠాత్తుగా రావటం మానేసాడు. తోటి పిల్లలతో బాబు ఆడుకొంటున్నాడు. తెలిసిన మనిషి కావటంతో బాబు మూర్తి వెంట ఇంటికి వెళ్ళాడు. బాబును చూడగానే చిద్రూపి ప్రాణాలు కుదుటబడ్డై."ఏదీ కానివేళ ఇప్పుడు మోగుతున్నాదేమబ్బా ఈ డోర్ బెల్ .... మరచిపోయిందేదో తీసుకు రమ్మని మూర్తిని పంపించారేమో!" అనుకొంటూ చిద్రూపి తలుపు తెరిచింది. ఎదురుగా నిలబడ్డ జలజను చూచి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది.

జలజ తన ఏకైక స్నేహితురాలు. చిన్నప్పట్నుంచి కలసి చదువుకొన్నారు. ఎస్.ఎస్.ఎల్,సి. ఐన వెంటనే ఆమె పెళ్ళి జరిగింది. తరువాత కాపురానికి వెళ్ళిపొయింది. అప్పట్నుంచి మళ్ళి కలువనేలేదు. ఉప్పొంగిన ఆనందంతో వాటేసుకుని "ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు కలుసుకొన్నామే! ఎట్లా ఉన్నావు? ఎక్కడుంటున్నావ్. ఈ ఊరెప్పుడొచ్చావ్. పిల్లలెంతమంది ....." గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించింది.

"....ఆగవే ఆగు. లోపలికేమన్నా రానిస్తావా లేక వాకిట్లోనే నుంచోబెడతావా?"

"నిన్ను కూడ ప్రత్యేకంగా రమ్మనాలిటే అంటూ లోపలికీడ్చుకెళ్ళింది. స్నేహితులిద్దరూ చాలసేపు ఆనందంగ కబుర్లు చెప్పుకొన్నారు.

జలజ మరొక రకమైన దురదృష్టవంతురాలు. బీద సంసారంలో పుట్టింది. బీద సంసారంలోకే కాపరానికెళ్ళింది. తన భర్త ఆలస్యంగా పుట్టిన ఏకైక కుమారుడు. ఉన్న కాస్త పొలాన్ని సాగు చేసికొంటూ కాలంగడిపేవాళ్ళు. ఒకరోజు పొలంలో పని చేస్తూండగ హఠాత్తుగా పాము కాటేసింది. ఆ పల్లెటూర్లో సకాలానికి వైద్య సహాయం అందక ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. జలజ రెక్కలు తెగిన పక్షైంది. పుట్టింటి పరిస్థితీ అంతంత మాత్రమే. పైగా ఇద్దరు చెల్లెళ్ళకింకా పెళ్ళిల్లు చెయ్యాలి. అత్తింటి పరిస్థితి కూడా అట్లాగే ఉండింది. మామగారి ఆరోగ్యం బాగుడేంది కాదు. వ్యవసాయపు పనులు వదలి చాల కాలమైంది. చేసే శక్తి కూడ ఇప్పుడు లేదు. ఐనా కోడలిని పుట్టింటికి వెళ్ళమనే సలహా ఇచ్చారు. జలజ అభిమానవంతురాలు. తండ్రికి భారం కాదలచుకోలేదు. అత్తమామల్ని నిస్సహాయస్థితిలో వదిలెయ్యటానికి మనసొప్పలేదు. నిలతొక్కుకొని, తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నించింది. తన అదృష్టం, ఎయిడ్స్ నివారణ స్కీమ్ లో ఉద్యోగం దొరికింది. పొలం కౌలు కిచ్చి ఉద్యోగంలో చేరింది. వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడుగ అట్లాగే సంసారాలు వెళ్ళతీస్తున్నది. చిద్రూపి ఈ ఊళ్ళో ఉన్నదని తెలసి అడ్రస్ కనుక్కొని స్నేహితురాల్ని చూడడానికొచ్చింది.

తరువాత వాళ్ళు చాలసార్లు కలసి మాట్లాడుకొన్నారు. దాపరికం లేకుండా ఒకరి సంసార విషయాలు మరొకరికి చెప్పుకొనేవాళ్ళు. రెండేళ్ళు ప్రయత్నం చేసి జలజ ఈ ఊరు రాగలింది. తను పని చేసే సంస్థలో వృద్ధి పొందాలన్నా, మరెక్కడైనా మంచి ఉద్యోగం సంపాదించాలన్నా తను చదివిన చదువు చాలదని గ్రహించింది. ఈ ఊళ్ళో సాయం కళాశాలలున్నై అని తెలిసి ఉద్యోగం చేస్తూనే అక్కడ చదువుకోవాలన్న పట్టుదలతో వచ్చింది. మాటల సందర్భంలో ఒకసారి చిద్రూపితో అన్నది. "బస్తీలోనే ఉంటూ పై చదువులు చదవలేదేమే." "నేనా ..... ఒంటరిగా వీధీలో కెళ్ళే అవకాశమే లేని నాకు చదువులు కూడాను. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కగలదా?" "కరవటం మానేసినా, బుస కొట్టడం కూడ మానేస్తే, తాడుగానే ఉపయోగించుకొంటారు సుమా! జాగ్రత్త."

ఈ సంభాషణ జరిగినప్పట్నుంచీ చిద్రూపికి చదువుకోవాలన్న ఆశ రేకెత్తింది. చాలీచాలని జీతంతో రెండు సంసారాలు సంభాళిస్తున్న జలజే సాహసించి చదువుకోదలచినప్పుడు తనెందుకు చదవకూడదు? తన ఉద్దేశ్యం ఒకరోజు మార్తాండంతొ చెప్పింది. అతనికి పట్టరాని కోపము, కోపమును మించిన ఆశ్చర్యము కలిగినై. ఏ పనీ తాను చేస్తానని కాని, ఏదీ కావాలని కాని అప్పటివరకు తాను చెప్పలేదు. "చదువూ వద్దు గిదువు వద్దు... వచ్చింది చాల్లే." ".... ఎవరికి?" మార్తాండం ఉలికిబడ్డాడు. "స్వరం మారిందే?" "పై చదువులు చదవాలని నా చిరకాల వాంఛ. మా ఇంటి దగ్గర అవకాశం లేకపోయింది." "దానివల్ల ఏ లోటూ లేదు. హాయిగ ఇంటి పట్టునుండి సంసారాన్ని సరిదిద్దుకోగల్గితే చాలు." "వంటికి తగ్గపని లేకుండా గోళ్ళు గిల్లుకొంటూ ఇంట్లో ఉండటం హాయి ఎట్లా ఔతుందండి?" "మరి." "నాకు చదువుకోవాలని పట్టుదలగా ఉంది." "మరి పిల్లవాడు, ఇల్లూ?" "వాటి సంగతి చూసుకొంటూంటే మీకభ్యంతరం లేదన్న మాటేగా?" మార్తాండం నాలుక కొరుక్కొన్నాడు. "చదువూ వద్దు. ఏమీ వద్దు. ఇట్లాగే సాగిపోనీ."

రెండు మూడు సార్లు ఇట్లాగే తర్జన భర్జన జరిగింది. వద్దిన్న కొద్దీ ఆమెకు పట్టుదల పెరగసాగింది. ఎట్లాగైనా ఇంటర్ లో చేరాలని నిర్ణయించుకున్నది. పుట్టింటి వాళ్ళిచ్చిన గొలుసు మూర్తి ద్వారా అమ్మించి ఇంటర్ లో చేరటానికి కావల్సిన డబ్బు కట్టించింది. మార్తాండం ఇంట్లో ఉన్నప్పుడే అడ్మిషన్ లెటర్ వచ్చింది. దాన్ని చూసేటప్పటికి అతనికి గంగవెఱ్ఱులెత్తింది. తనమాట పాటించలేదని అక్కసు పట్టలేక ఆమెను నానామాటలు అన్నాడు. "మీకిష్టం లేని పని చేస్తూన్నాని తెలుసు. మీరేం చేస్తారో కూడ తెలుసు. అన్నిటికీ సిద్ధమయ్యే ఈ పని చేసాను. కసితీరా తిట్టండి. కాని నేను డిగ్రీ పూర్తి చేసేదాక చదివి తీర్తాను" అని ఖచ్చితంగా చెప్పింది. మార్తాండం నివ్వెరపొయ్యాడు. క్షణంలో తేరుకొని "ఇవ్వన్నీ ఎన్నాళ్ళు సాగుతాయో నేనూ చూస్తాను. ఒక్కరోజు ....." "...ఆగండి. మీరేమనబోతున్నారో నాకు తెలుసు. అటువంటి అఘాయిత్యపు పని ఏదైనా తలపెడితే నేనూ సాహసించాల్సుంటుంది. మనింటి విషయాలన్నీ మూర్తికి తెలుసు. నేను మీ బ్యాంక్‍కి వచ్చి గుట్టు రట్టు చేస్తే ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించుకోండి."

అంతటితో తీరిపోలేదు. చిద్రూపి కాలేజీలో చేరనే చేరింది. చాలకాలం వరకు మార్తాండం ఆమెను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నాడు.ఫాస్ట్‍ఫార్వర్డ్. ఐదేళ్ళు గడిచాయి. ఇప్పుడు వాళ్ళింటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ మార్తాండానికి పూర్వం మార్తాండానికి పొలికే లేదు. ఇప్పుడతడు కోరలు తీసేసిన పామల్లె, చెప్పుక్రింద తేలల్లే, అసలింట్లో ఉన్నాడోలేడో అన్నట్లుంటున్నాడు. బ్యాంక్ కి వెళ్ళటం, రావటం తప్ప, జీవితంతో అతనికి మరే సంబంధమూ లేనట్లు ప్రవర్తిస్తున్నాడు.

పిల్లవాడు మిడిల్ స్కూల్లోకి వచ్చాడు. వాడి బాగోగులు, చదువు సంధ్యల విషయం కూడ చిద్రూపి చూసుకొంటున్నది. ఆమె అనుకొన్న ప్రకారం డీగ్రీ పూర్తి చేసింది. ఇటీవల బ్యాంక్ ఆఫీసర్స్ పరీక్ష కూడ పాసైంది.

పోస్ట్ లో అప్పుడే అపార్టమెంట్ లెటర్ వచ్చింది. ప్రభుత్వ బ్యాంక్ లో ఆఫీసర్‍గా ఉద్యోగమిచ్చారు. ప్రవేశిస్తూనే జీతం, ఇప్పుడు తన భర్తకు వస్తున్న దానికన్నా రెండు వందలు ఎక్కువ. ఉత్తరం చూస్తూనే మార్తాండం అట్లాగే నిలబడిపోయాడు. కళ్ళలో నీళ్ళు నిండినై. మాట్లాడకుండా ఉత్తరం తీసికెళ్ళి భార్య చేతికిచ్చాడు.

ఆకాశానికీ భూమికీ ఉన్నంత భేదం మార్తాండం మనఃప్రవృత్తిలో సంక్రమించటానికి కారణం చిద్రూపే. అమానుషంగా నిరంతరం తనను అట్లా హింసించటానికి భర్తకు ఏం హక్కున్నది అని ఎన్నోసార్లు వాపోయింది. ఎట్లాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చాలా సార్లనుకొంది. కాని ఎట్లా? ఎదురుతిరిగి శారీరికంగా పోట్లాడటం సభ్యతకాదు. తన శక్తీ చాలదు......

ఒక అవకాశం గోచరించింది. రిస్క్ తో కూడినదైనా జాగ్రత్తగా నిర్వహిస్తే సాధ్యపడవచ్చనిపించింది.

ఎయిడ్స్ ఎవరికైనా రావచ్చనీ వ్యాధివచ్చే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే, పూర్తి చికిత్స సాధ్యమౌతుందని, పత్రికల్లో, రేడియోలో, టీవీలో తెగ ప్రచారం చేస్తూన్నారు. సంస్థల్లో పని చేసేవారికి గోప్యంగా, ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, ఫలితాలను రహస్యంగా ఉంచి, వ్యక్తిగతంగా తమకు మాత్రమే తెలియచేస్తారని జోరుగా ప్రచారం చేశారు. వ్యక్తిగతరక్తం భద్రపరచిన సీసాలకు గుర్తుగా పేర్లు కాక అంకెలు మాత్రమే ఉపయోగిస్తారు. సంస్థ అధికారి వద్ద మాత్రమే పేర్లకు, అంకెలకు సమన్వయము తెలుపు సాక్ష్యం ఉంచబడుతుంది. ఫలితాలు కవర్లల్లో ఉంచి సీల్ చేసి అంకెల గుర్తులతోనే సంస్థ అధికారికి అందజేస్తారు. ఏ అంకెకు సంబంధించిన వ్యక్తికి ఆ సీల్ చేసిన కవరును వారి సంస్థ అధికారే అందిస్తాడు. పరీక్షా ఫలితాల సమాచారం ఎయిడ్స్ సంస్థలో కూడ ఉంచకుండా నిర్మూలిస్తారు.

కొన్ని సంస్థలు వచ్చి పరీక్షలు చేయించుకొన్నై. కాని రెస్పాన్స్ మందంగానే ఉండింది. సంస్థలకు నచ్చచెప్పి అధికారులను ఒప్పించి, వైద్యపరీక్షలకు తరలింపచేసే విభాగంలొనే మూర్తి, జలజలు పూనుకొని ఆ బ్యాంక్ ఉద్యోగస్తుల్ని ఒప్పించి వైద్య పరీక్షలు తేగల్గారు.

చిద్రూపి పధకం ప్రకారం, జలజ సహాయంతో, గుర్తు తెలిసిన ఒక వైద్య పరీక్షా ఫలితంలో ఒక చిన్న మార్పు చేశారు. ఆ రహస్యం తెలిసింది ఈ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే.

ఫలితాన్ని చూసి మార్తాండం నిర్ఘాంతపొయ్యాడు. మతిపోయినంత పనైంది. తన పరిస్థితి ఎవరికంటనన్నా పడితే అనుమానం రాకమానదు. దొంగకు తేలు కుట్టినట్లు తన భావాల్ని తనలోనే బిగపట్టుకొని ఇల్లు చేరాడు. కాని ఆందోళనను పూర్తిగా దాచుకోలేకపోయాడు. "అట్లా ఉన్నారేమిటండీ" అని పరామర్శించింది భార్య. "ఏంలేదు. మామూలుగానే ఉన్నానుగా." అని బుకాయించాడు. "కాదు. ఏదో జరిగింది. ఏమైందో చెప్పండి." "ఏమీలేదన్నానుగా" అన్నాడు కొంచెం కోపముగాను, విసుగ్గాను. "...చెప్పండి. పరవాలేదు." "ఏం లేదంటూంటే ఏం చెప్పమంటావ్." అని గాండ్రించాడు. "...నాకు తెలుసు ఏం జరిగిందో." "ఏం తెలుసు?" "విషయమంతా జలజ నాకు చెప్పేసింది." అతని పాదాన్ క్రింది భూమి కృంగిపోయినట్లయింది. నిలువునా కుర్చీలోకి కూలబడ్డాడు. నోట మాట రాలేదు. కళ్ళు బైర్లు కమ్మినై. ఒక నిమిషమట్లాగే గడచిపోయింది. "ఇప్పుడేం చెయ్యాలని నిర్ణయించు కొన్నారు?" నిరుత్తరుడై అట్లాగే స్థంభించిపోయ్యాడు.

క్రమంగా ఇద్దరూ కొన్ని ఒప్పందాలు చేసికొన్నారు. ఎవరి కంటనైనా పడితే ప్రమాదమని ముందుగా ఆ రిపోర్ట్‍ను తగులపెట్టేశారు. తన డిగ్రీ పూర్తిఅయ్యేదాకా చదువుకు ఏ ఆటంకము రానివ్వనని, సహకరిస్తానని, బయట ప్రపంచానికి భార్యాభర్తలైనా ఇంట్లో మాత్రం ఎవరి పరిధిలో వాళ్ళుండాలని, ఆదేశించిన ప్రకారం హెచ్.ఐ.వి.కి వైద్యం చేయించుకోవాలని, తనకు సహాయపడినందుకు, జలజ, మూర్తిల మీద ఎటువంటి పగ సాధింపు చర్యలు తీసికొనని మార్తాండం చేత ఒప్పందం చేయించుకొంది. ఇద్దరూ నియమాల్ని పాటిస్తూ వస్తున్నారు.

అప్పాయింట్‍మెంట్ లెటర్ చూసుకొని సంతోషిస్తూ, చిద్రూపి అన్నది. "చూశారా! నా చదువు వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో!". "ఎవరికి?" ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది. ".. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది మీరే... నా గుండెల్లో దాచుకొన్న రహస్యం ఒకటి మీకివ్వాళ చెప్పదలచుకున్నాను... కాపురానికొచ్చిం దగ్గర నుంచి ఐదేళ్ళపాటు అకారణంగా చీటికి మాటికి నా మీద కోప్పడేవారు. ఎన్నోసార్లు కారణం లేకుండానే కొట్టేవారు. తిట్టేవారు. అట్ల చెయ్యడం సమంజసమేనని మీకిప్పటికీ అనిపిస్తుందా?" "వాటి సంగతి ఇప్పుడు దేనికి?" "కావాలి. పురుషాహంకారం ఇంకా అడ్డొస్తున్నే ఉందా?" ఆయన గుండె గొంతులోన కొట్లాడింది. మాటమాత్రం పెకిలి బయటకు రాలేదు. "మీ నోటి వెంట చెప్పించాలన్న సరదా నాకు లేదు. పిల్లి ఐనా సరే, తలుపులేసి గదిలో పెట్టికొట్టబోతే పులిగా మారుతుంది.... జాగ్రత్తగా వినండి. మీరు హెచ్.ఐ.వి. పాజిటివ్ అన్న వార్త నిజంకాదు. మీకా జబ్బు లేనేలేదు. జలజ దగ్గర్నుంచి మందులని తెచ్చిచ్చిన మాత్రలన్నీ కేవలం విటమిన్ పిల్స్. అకారణంగా మీరు నన్ను ఐదేళ్ళు క్షోభపెట్టారు. శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో హింసించారు. పట్టరాని పగతో, కసితో, ఆవేశంతో నేనే ఈ ప్లాన్ సృష్టించాను. జలజ సహాయంతో మీరు నమ్మేట్లు చేశాను. మిమ్మల్ని శిక్షించాలనుకొన్నాను. నేను అనుభవించిన క్షోభలో కొంతభాగమైన మిమ్మల్ని కూడ అనుభవింపచెయ్యాలని ఉద్రేకంతో అంత సాహసం చేశాను. కృష్ణదేవరాయలు సింహాసనం ఎక్కేముందు, శిక్షయొక్క బాధ ఎట్టిదో రాజుకు తెలియజేయాలని అప్పాజీ ఆయన్ను చాటుకు తీసికెళ్ళి చెంపదెబ్బ కొట్టినట్లు కధ చెప్తారు. నేను చేసిందీ అట్లాంటి పనే. పాపం చేస్తున్నానేమోనని అప్పుడప్పుడనిపించేది. ప్రతీకారం పాపమెట్లా ఔతుంది. ఐనా నేను కూడా కొంత శిక్ష వేసుకొన్నాను. ఈ ఐదేళ్ళు మనం చేస్తున్నది సహజీవినమే కాని సంసారం కాదు. నా కష్టసుఖాలు నేనొక్కతేనే ఎదుర్కొని పాటుబడ్డాను. కలసి ఉన్నా ఒంటరి బ్రతుకే బ్రతికాను. ఇప్పుడు మీరు సర్వస్వతంత్రులు. మన విషయంలో ఏ నిర్ణయం తీసికొన్నా అది నాకు సమ్మతమే. మీ పుణ్యమా అంటూ ఈ ఉద్యోగం కూడా ఒకటి వచ్చింది. బ్రతుకుతెరువుకు మార్గం సుగమమైంది.... మీ నిర్ణయం ఏమిటో చెప్పండి.