పండూ

భూపతి విహారి దోనిపర్తి

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఏ ముహూర్తాన "పోకిరి" సినిమా వచ్చిందో గానీ. మా ఇంట్లో మాత్రం ఓ పోకిరోడు తయారయ్యాడు. ఇక్కడ (డెన్వర్) పొకిరి సినిమా వేస్తున్నారని తెలియగానే నేను మాయావిడా, మా అయిదేళ్ళ బుడ్డోడూ అందరూ వెళ్ళాం. మా బుడ్డోడి వల్ల ఎంత సినిమా మిస్సవుతామో అని అనుమానిస్తు వెళ్ళాము థియేటర్ లోకి. ఎందుకంటే బుడ్డోళ్ళకి కుదురుగా ఒక చోట కూర్చొవడం అలవాటు లేదు. ఇక సినిమా మొదలయినప్పటి నుండి స్క్రీనంతా తన్నులూ.. గన్నులే. ఇకే బుడ్డోడికి పండగే పండగ.

మేము ఒక సీను కూడ మిస్సు కాలేదు.ఇంటికొచ్చి వేడి వేడి గా ఏదన్నా తిందామని సద్ది ఫుడ్డు ఫ్రిజ్ లోనుంచి తీస్తూ "రుషీల్, నువ్వేం తింటావ్ నాన్నా!" అని అడిగితే "call me as పండూ don't call me rushil". అని బుడ్డోడి నుండి సమధానం.

ఈ పండెవరబ్బ అని అలోచిస్తే అప్పుడర్థ మయింది పోకిరి లో మహేష్ బాబు పేరు పండు అని. ఇక ఆ సినిమా మహత్యమే మో గానీ వాణ్ణి పిలిచి "పండూ ఇది చేసి పెట్టావా" అంటే ఠక్కున చేసి పెట్టేస్తున్నాడు. P>

వాడి అసలు పేరు తొ పిలిస్తే " నన్ను పన్ డూ అని పిలవాలి ఓ.కే?" అని ఫోజు నడుం మీద చేతులు పెట్టుకుని. అప్పట్నించీ వాడి పేరు పండూ.ఇప్పటికి ఆ సినిమా దర్శనం థియేటర్ లో మూడు సార్లు...ఇంట్లో లెక్కలేనన్ని సార్లు. వెరసి మాకు బోళెడు బుజ్జగింపులు...బోళెడు బూచాడి కతలు మిగులు. పండూ అని పిలవగానే ఠక్కున ప్రత్యక్ష్యం..ఠపీమని పని అయిపోవడం. తరవాత తొండ ముదిరి ఊసరవెల్లి అయింది. ఇదిగో ఇలాగ.

"పండూ! అమ్మ పేరేంటి?"

"అమ్మ పండు" (కిల..కిల..కిలా...బ్యాక్ గ్రవుండ్ లో)

"మరి నాన్న పేరేంటి?"

"నాన్న పండు" (కిల..కిల..కిలా...బ్యాక్ గ్రవుండ్ లో)

"మరి నీకు తొందర్లో తమ్ముడో చెల్లెల్లో పుడుతున్నారు కదా ఏం పేరు పెడదాం?"

"బేబి పండు".

(దబ్బు మని ....ఇద్దరు కింద పడ్డ శబ్దం)