బడి

Prasada Murthy

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereబడంటే బంతిపూల వనంలా ఉండాలి
బడంటే చుక్కపిల్లల్ని అక్కునదాచుకున్న నింగితల్లిలా ఉండాలి
విరగ కాచిన జామ పళ్ళమీద చిలకలు వాలిన చెట్టులా ఉండాలి

బడంటే పుస్తకాలు - పెన్నులూ - పెన్సిళ్ళూ పరీక్షలే కాదు
బడంటే స్నేహం - బడంటే ప్రేమ - బడంటే నమ్మకం.

బడి అంటే అమ్మ ఒడిలా ఉండాలి
బుడి బుడి పాదాల తడియారని నాన్న వక్షస్థలంలా ఉండాలి
బడంటే భయంకాదు .. బడంటే బతుకు
బడంటే చదవడం చదివించడమే కాదు
బడంటే వెలగడం - వెలిగించడం
బతకడం బతికించడం

మునిమాపువేళ తూనీగలు తోటలోకి చొరబడినట్టు
రెక్కల నిండా పుప్పొడి అంటించుకున్న తుమ్మెదలు
చెరువు గట్టు మీద ఆటాడుకుంటున్నట్టు
నవ్వుల రవ్వలు విరజిమ్ముతూ
పిల్లలు బడిలోకి అడుగుపెట్టాలి

బడంటే ఆట - బడంటే పాట
బడంటే సామాజిక సామూహిక స్వప్నం

బడంటే రంగులు పూసుకున్న పసిడి పిట్టలు
తోటలో వసంతమాడుకుంటున్నట్టుండాలి
చదువుతూ నవ్వాలి నవ్వుతూ చదవాలి
బడంటే బాలపరిమళాలు నలుదిశలా వెదజల్లే
వేయిరేకుల వెలుగుపువ్వు

బడంటే కలకు - బడంటే అలలు
బడంటే ఎదగడం - బడంటే ఎగరడం
బడంటే మనిషి - బడంటే మంచి