వాన

B.V.R Prasad Murthy

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



ఉదయం పూట వాన
ఎవరో తలుపుతట్టినట్టు
చూస్తే
తడిసి తడిసి వణికి పోతున్న పిట్టల గుంపు

నిజంగా ఈ వాన గమ్మత్తుగా ఉంది
మంత్ర గత్తెగా ఉంది మార్మికంగా ఉంది
వాన నీటిలో ఆడుకుంటున్నడో పిల్లాడు
వాడి కళ్ళల్లో కోటి కలల కత్తిపడవలు
వర్షంలో తడిసి చివికిపోయిన కాగితప్పడవలా నేను

నన్ను చూస్తే వాడికెంత వేళాకోళంగా వుందంటే
తొడుక్కున్న చొక్కావిప్పి గిర్రున గిరాటు వేసి
నన్ను వెక్కిర్స్తూ చూశాడు

కురుస్తున్న వర్షానికి దూరంగా నిలబడి
జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్నాను

ఉదయం పూట వాన
నింగికీ నేలకీ మధ్య పరచిన
పట్టుదారాల పడుగులా ఉంది

అప్పుడు, చెడ్డీల వయసప్పుడు
పొలందగ్గర చెరువు గట్టుమీద
ఎవరూ లేరు కదా అని
వర్షంలో బోసి ఒంటితో గెంతులేసిన జ్ఞాపకం
కితకితలు పెడుతోంది

ఈ ఉదయం పూట వాన
నింగి పువ్వు నుండి నేలరాలుతున్న
చంకీల పుప్పొడిలా వుంది

పైన కుండపోతగా వాన
కింద నిలువెల్లా ఉబ్బిన చెరువు
చుట్టూ తామరపూలు
మధ్యలో ఈతకొడుతూ నేను
గట్టుమీద తడిసిన పుస్తకాల సంచీతో చెల్లి

అబ్బబ్బా ఈ ఉదయం పూట వాన
జ్ఞాపకాల రీళ్ళు గిరగిరా తిప్పుతోంది

ఎవరో ఒక మిత్రుడైనా రాకపోతాడా అని
రత్రంతా ఎదురు చూసి పడుకున్నాను
అందుకే పొద్దున్నే ఈ వాన
లక్షచేతులతో నన్ను చుటేసింది

వాన వాన వాన - నాలో నీలో అందరిలోనా
కురుస్తుంది కురుస్తుంది
బాబూ! బాబూ! అమ్మ పిలుస్తుంది

పీడకలేదో వచ్చినట్టు నటించి
నాన్నను తోసేసి అమ్మపక్కలో పడుకున్నాను
అమ్మ తియ్యగా జోకొడుతున్నట్టుంది వాన

ఎంత చిత్రంగా కురుస్తోందో!
నాలో ఏం తవ్వుకు పోదామనోగాని
సూటిగా కళ్ళల్లోంచి గుండెల్లోకి మెత్తగా దిగబడుతోంది

ఊరిని ముంచేసిందో సారి గాలివాన
అప్పుడలా గూడెం గుడిసెలు
వాన నీటిలో పడవల్లా తేలిపారిపోతుంటే
గుండెలేని ఊరు గేట్లు మూసేసింది
చెమ్మగిల్లిన కళ్ళతో నేను చాచిన చేయి
ఇంకా అలా బిర్రబిగుసుకోనే ఉంది

వానమ్మా వాన - మాయదారివాన - మహమ్మారివాన
కన్నీటివాన - కనకాంబరాల వాన
నవ్వులవాన - ఏడ్పులవాన - జాతర వాన - జ్ఞాపకాలవాన

ఆకాశంలో చుక్కలన్నీఎవరో పొడి పొడి చేసి జల్లెడ పడితే
తళుకు తళుకున నేలకు రాలిపోతున్నట్టు వాన

పైలోకంలో వున్న కవులంతా
కుండపోతగా పద్యాలు నేలకు క్రుమ్మరిస్తున్నట్టుంది వాన

అమ్మ బడికి పొమ్మని
నాన్న పొలం రమ్మని
నా చదువుకోసం అత్తింటికీ పుట్టింటికీ మధ్య
అమ్మ తీసిన పరుగుల జడిలా వుంది వాన

వీధి మొగలో గోళీకాయలాడుతుంటే
నానమ్మ కర్రతో ప్రత్యక్షం
చటుక్కున చెట్టెక్కి చెట్టుమీంచి చెరువులోకి దూకి
తామరాకుల కింద నుంచి నక్కి నక్కి చూస్తే
గట్టుమీద నానమ్మే కాదు
చెరువు చెరువంతా ఫక్కుమని కెలకవేసింది

ప్రపంచంలోని పిల్లలంతా
ఆకాశాన్ని గాలిపటంచేసి
నవ్వులదారాలు పట్టుకుని ఆడుకుంటున్నట్టుంది వాన
ఆకాశరాజు భూదేవికి పెడుతున్న
చల్లని జల్లుల కితకితల్లా వుంది వాన

అన్నం తింటున్నప్పుడు పొలమారితే
ఎక్కడో దూరాన ఉన్న అమ్మ
కొడుకా అని పలవరిస్తూ నెత్తిమీద సుతారంగా చేత్తో తడుతున్నట్టుంది వాన

ఆ కుర్రాడూ అలా ఆడుకుంటూనే ఉన్నాడు
ఆడుకుంటూ అల్లరి కళ్ళతో
నన్ను ఆటపట్టిస్తూనే ఉన్నాడు

సన్న సన్నగా వాన - చల్ల చల్లగా వాన
జల్లులు జల్లులుగా వాన - తుంపర తుంపరగా వాన
ఈ ఉదయంపూట వాన
నా హృదయాన్ని స్మృతులు మునివేళ్ళతో
మీటుతూనే ఉంది