జీవిత సత్యాలు

Raghuvarma Basavaraju

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఅలంకారపుటందాలు అమర్చలేదు
చందస్సుల చందాలు చేకూర్చలేదు
ఉల్లమున ఉద్భవించిన భావముల
యధాతధముగ పద్య రూపమున
ప్రకటించ ప్రయత్నించు చిన్నవాడను
తప్పులు మన్నించరే దయతోడను

కోరెదము తమంబున, కోర్కెలు తీరిన వేళల,
ఊరేగెదము సంబరమున అంబరపు వీధుల,
విర్రవీగెదము విజయమ్ముమాదని, మాదేనని
పరికించము ఎన్నడున్ యెటుల సంభవించెనని

ప్రయత్నముల్ విఫలమైన వేళల, విల విల లాడెదము
బేలలమై వలవలా నేడ్చెదము, విధిని తూలనాడెదము
మరల మరల విచారించెద మిటు లేల జరిగె నోయని,
పరితపించెదము మాకు మాత్రమే ఇటుల జరిగెనాయని

శాస్త్రములెన్ని చదివినన్, వాహనముల గగనమున కెగరినన్
స్రుష్టి సూత్రముల ‌ఛేదించినన్,నవ్య మార్గముల నెన్ని కనిపెట్టినన్
సాధ్యమగునె మానవమాత్రునికెన్నడైనను భవిష్యత్తు దెలియ?
సిగ్గు కాదె యట్టి సుజ్ఞాని తలచినది జరుగ లేదని శోకింప?

జరుగునవి వట్టి ఘటనములె కాని, దుర్ఘటనములెట్లగు?
ఆ భేదము, ఖేదము ఈ మాయా మోహిత మనఃకల్పితములె గాక
ప్రయత్నమె గానీ ఫలితమ్ము పై గలదె మనుజున కాధిక్యంబు
భవితవ్యంబు తెలియ సాధ్యమె బ్రహ్మ కైన ఆ పర బ్రహ్మ కైన

భూతకాలము నిల్చు ఘనముగ నిర్జీవ జ్ఞాపకమమయమై
భవిష్యంబు వెల్గు మనమున మోహాన్విత ఊహా చిత్రగేయమై
భూతలమ్మున నిండు జీవనము నడుప వర్తమానమొక్కటె
భేషైన కాలమ్ము, జారవిడువనేల శూన్య స్వప్నముల తేలి

సుఖ దుఃఖములు మరిమరి సోకును మానవ జీవిత పథమ్ముల
సాగర జల తరంగములు సాంద్ర తీరమ్ములను తాకు విథంబున
సాధ్యమె సాగరునికైన ఆటు పోటుల నొక్కదానినె దరి జేర్చ
శుష్క మనుష్యుడే పాటి వట్టి సుఖమ్మునే గోరి దుఃఖమ్ము పరిమార్చ