తాపత్రయం

Kavita Sekhar

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

అనకాపల్లి,ఇండియా. మార్చి పదవ తేదీ.సమయం: తెల్లవారు ఝాము ఐదు గంటలు.

నన్నందరూ సరస్వతి అని పలకరిస్తారు.జీవితంలో అనుకోని సంఘటనలు,సందర్భాలు ఎదురవ్వడం సర్వ సాధారణం. కానీ నిన్న రాత్రి నాకు వచ్చిన కల మాత్రం నిజమఔతుందని నా అంతరాత్మ ఘోషిస్తోంది. అసలు సంగతికి వస్తే తెల్లవారుఝామున వచ్చిన కలలో నా ఇష్ట దైవం ప్రత్యక్షమయ్యి నేను ఇంకొక నెల రోజులలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళి పోతానని వరం/శాపం ఇచ్చాడు.

మొదట కలే కదా అని త్రోసిపుచ్చాను. కానీ ఒకవేళ అదేగనుక నిజమైతే ఇప్పుడు నేనేం చెయాలి అన్న అలోచనలో పడ్డాను. నాకిప్పుడు తక్కువ వయసేమీ కాదు...డబ్భై రెండు సంవత్సరాలు. జీవితంలో అన్ని రుచులూ చూసిన దాన్ని.భాద్యతలు తీరిపోయాయి.ఆయన కూడా పరమపదించారు. ఇక నేను బ్రతికి ఉద్ధరించాల్సిన వాళ్ళూ లేరు...నేను చెయాల్సిన కార్యక్రమాలూ లేవు. ఆ కలే కనుక నిజమైతే...ఎందుకైనా మంచిది నా పనులన్నీ పూర్తి చెసుకుని ఉంటే మంచిదనిపించింది. కానీ, నేను పోతానని పిల్లలకి,మనవలు,మనవరాళ్ళకి చెప్పి ఇప్పటి నుంచే అందరినీ బాధ పెట్ట దల్చుకోలేదు. ఎలాగూ ఉగాది పండుగ రానే వస్తోంది కనుక అందరినీ ఈసారి ఇక్కడికే పిలుస్తే సరిపోతుందనిపించింది. అయినా ఈ ఇంటి మీద,ఊరు మీద మమకారంతో ఈ పల్లెటూళ్ళో ఒంటరిగా పడున్నాను కానీ...పెద్దాడు,చిన్నాడు ఎప్పుడూ రమ్మని గొడవ చేస్తూనే ఉంటారు.

ఉగాదికి ఇంకా మూడు వారాలుంది.ఈ లోగా నాకున్న కోరికలు తీర్చుకోవాలనిపించింది. సుందరాకాండ, విష్ణుసహస్రనామం, లలితాసహస్రనామం పారాయణలు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఈ రోజునుంచే మొదలు పెడదామని నిశ్చయించుకున్నాను. ఆస్థి పంపకాలు ఆయనున్నప్పుడే జరిగిపోయాయి. ఈ ఇల్లు,కొంచం బ్యాంకు బాలెన్సు,నా నగలు తప్ప ఎంఈ మిగల్లేదు. నా పిల్లలెవ్వరూ ఈ పల్లెటూళ్ళో స్థిరపడరు కనుక నా తదనంతరం ఈ ఇంటిని అమ్మి వచ్చే పైకం పంచుకుంటారని నా అలోచన. బ్యాంకు బాలెన్సు నా కర్మకు మొదలైన వాటికి సరిపోతుందేమో. అవసరమైతే పెద్దాడు,చిన్నాడు తలో చెయ్యి వేస్తారు. నగలు,పట్టు చీరలు నా కూతుళ్ళకు చెందాలని నా కుతూహలం. కాకపోతే కోడళ్ళు పెదవి విరుస్తారేమోనని నా సందేహం. ఇంటిలో వాటాతో సరిపెట్టుకోమని చెబితే సరి. ఇక నా పాత చీరలు,ఇంటి సామానులు మంగమ్మను (మా పని మనిషి...కాదుమా ఇంటి మనిషి..నన్ను ముప్ఫై ఏళ్ళుగా అంటి పెట్టుకుని కంటికి రెప్పలా కాపడే దేవత) తీసుకోమని చెప్తాను. అదే గనుక లేకపోతే నేనీరోజున ఇలా ఉండేదాన్నా? నా పూర్వజన్మ సుకృఉతం వల్లన ఇలాంటి మనిషి దొరికింది.

ఒక్కసారి కాశీ వెళ్ళి గంగలో మునిగి రావాలని కోరికగా ఉంది కానీ నన్నిప్పుడు ఎవరు తీసుకుపోతారు? కొడుకులని అడిగితే కాదనరేమో కానీ ఉద్యోగాలు,పిల్లల గొడవలలో వాళ్ళు మునిగి ఉంటే నేనిప్పుడు ఇలాంటి కోరికలు కోరడం సబబు కాదేమో. కుదిరినంత వరకూ ఈనెల్నాళ్ళు భగవసన్నిధిలో గడపాలని నాకు చేతనైనంత దాన ధర్మాలు చెయ్యాలని అనిపించింది. ఉగాదికి పిల్లలెలాగూ వస్తారు కాబట్టి నా ఆఖరి రోజులు మనసారా అయినవాళ్ళ మధ్యన గడిపి కన్నుమూద్దామని నా మనస్సు ఉబలాట పడుతోంది.

అట్లాంటా,అమెరికా,మార్చి పదవ తేదీ.సమయం: తెల్లవారు ఝాము ఐదు గంటలు

సారా నా నామధేయం. తెల్లవారుఝామున ఒక చిత్రమైన కల వచ్చింది. కలలో జీసస్‌ కనిపించి ఇంకో ముప్పై రోజులలో ఈ ప్రపంచాంతో నాకు సంబంధం ఉండదని చెప్పేసరికి ఉలిక్కి పడి లేచాను. టైము చూస్తే అయిదు గంటలయింది. ఒళ్ళంతా చెమటలు పట్టినట్లయింది.

మనసంతా కలవరం చెందింది. ఆ కల నిజానిజాలు పక్కన పెడితే నేను చేయాల్సిన పనులు ప్లాను చేసుకోవాలనిపించింది. అసలు ఇప్పుడు నాకేమి వయస్సు మించిపోయిందని...డబ్భై రెండు సంవత్సరాలు పెద్ద వయసేమీ కాదు. కనీసం ఇంకో పదేళ్ళయినా ఉంటానన్న ధీమాతో ఉన్నాను. నాకు డయాబటీసు,బి.పి. తప్ప పెద్ద చెప్పుకోవల్సిన రోగాలేమీ లేవు. ఇంతమాత్రానికే నేను నెలరోజుల్లో పోతానా? సరే నా అనాలసిస్సు పక్కన పెట్టి ఈ నెలరోజుల్లో చెయాల్సిన ' things to do' లిస్టు తయారుచేద్దామని నోటు పాడు,పెన్నుతో రెడీ అయ్యాను.

 1. ముందుగా నా ఫైనాన్సెస్సు వర్కవుట్‌ చేసుకోవాలి కదా. ఆన్‌ లైను బ్యాంకు బాలెన్సు చెక్‌ చేస్తే 12,646 డాలర్లు కనపడింది.
 2. నా ఫ్యూనెరల్కు పదేళ్ళ క్రితమే స్థలం కొన్నాను కాబట్టి ఆ ఖర్చు తగ్గింది. కానీ నా కాఫిన్‌ కు,దాని మీద పూల డెకరేషన్‌ కు,సిమ్మెట్రీ వాళ్ళ చార్జీలు అన్నీ కలిపితే ఎంత లేదన్నా 1500 నుంచి 2000 డాలర్ల దాకా అవ్వచ్చు.
 3. రెండు,మూడు ఫ్యూనెరల్‌ సర్వీసెస్‌ వాళ్ళకి కాల్‌ చేసి కొటేషన్‌ లు అడగాలి.అలాగే కాఫిన్‌ బాక్సు,పూల డెకరేషన్‌ కు ఆర్డర్‌ ఇవ్వాలి.
 4. మెయిలర్సు రెడీగా ఉంచితే అవి ఫిల్‌ చేసి దగ్గిర వాళ్ళందరికీ పోస్టు చేస్తారు ఎవరో ఒకళ్ళు.
 5. నాకు, విలియంస్‌ కు కలిగిన పిల్లలు-జూడీ,లీసా వస్తారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే విలియంస్‌,నేను విడిపోయాక వాళ్ళకి నాకు అంత సరిగ్గా రిలేషన్‌ సు లేవు.

  పీటరుకు నాకు కలిగిన సంతానం -రాబ్‌,జేమీ. పీటర్‌ పోయాక కూడా నన్ను అప్పుడప్పుడు ఫోను చేసి పలకరిస్తున్నది కూడా రాబ్‌,జేమీలే. పోయిన సంవత్సరం జేమీ కొడుకు గ్రాడ్యుయేషన్‌ పార్టీకి నేను వెళ్ళి వాడికి సర్‌ ప్రైజు గిఫ్టు ఇస్తే వాడు ఎంతో మురిసిపోయాడు. నా ముగ్గురు మనవలు,ఇద్దరి మనవరాళ్ళ పేర్ల మీద సి డీలు కూడా కొన్నాను. వాళ్ళంతా నా ఫ్యూనెరల్‌ కి తప్పక వస్తారని ఆసిస్తున్నాను. కాకపోతే కనీసం పది రోజుల ముందైనా వాళ్ళకు చెబితే ఫ్లైటు టికెట్లవి మంచి డీల్‌ లో కొనుక్కుంటారు. పైగా సెలవు కూడా ప్లాను చేసుకుంటారు. కాని ఉన్నట్టుండి ఇప్పుడు రమ్మంటే అకేషన్‌ ఏమిటని అంటారు. ఎదో ఒక సాకు చెప్పి పిలిపించాలి. అందరినీ ఒక సారి చూసానన్న తృఉప్తి మిగులుతుంది.

 6. ఇక క్రెడిట్‌ కార్డు,టెలిఫోను,కేబుల్‌ బిల్లు అన్నీ ఏప్రిల్‌ తొమ్మిదవ తారీఖున కట్టేయాలి.
 7. ఏజంటుకు కాల్‌ చేసి రేపే ఇల్లు అమ్మకానికి పెట్టాలి. లేకపోతే ఓపెన్‌ హవుసు గురించి అలోచించాలి అప్పుడు డబ్బు త్వరగా చేతికి వస్తుంది.
 8. కారు కూడా అమ్మమని డీలరుకు చెప్పాలి.కాకపోతే డీలు కుదిరినా డెలివరీ మాత్రం ఏప్రిల్‌ తొమ్మిదవ తారీఖున ఇస్తానని చెప్పాలి.
 9. ఇక ఇంటిలోని నా బట్టలు,సామానంతా ఏప్రిల్‌ మొదటి వారంలో గరాజ్‌ సేలులో పెట్టాలి. కొన్ని పాత సామాగ్రి ఆంటిక్‌ హవుస్‌ లో అమ్మేయాలి. మరీ పాత బట్టలు,సామానులు సాల్వేషన్‌ హోంకు డొనేట్‌ చేస్తాను.
 10. ఈ ముప్ఫై రోజులు నేను దర్జాగా నా డబ్బంతా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇల్లు, కారు అమ్మిన డబ్బంతా నేను పోయే లోపల చేతికి వస్తుందో లేదో తెలియదు. రాక పోతే పిల్లలకే వెళ్తుంది. అలా వెళ్తే నా ఫ్యూనెరల్కు ఖర్చు వాళ్ళే పెట్టడానికి అభ్యంతరం పెట్టక పోవచ్చు. బిల్లులన్నీ కట్టేసినా నా బ్యాంకు బాలెన్సు పదివేల దాకా మిగులుతుంది. ఒక రెండు వేలు ఖర్చులకని,షాపింగుకని పక్కన పెట్టినా ఇంకా ఎనిమిది వేలు మిగులుతాయి. కాబట్టి నేను ఎదైనా మంచి చోటుకి వెకేషన్‌ కు ప్లాను చేసుకోవచ్చు. పోయిన నెల టాం (మా సందులోనే ఉంటాడు) నాతో డేట్‌ చేయడానికి ఎంతో ఆసక్తి చూపించాడు. అతన్ని కదిపి చూస్తాను.ఇద్దరం హాయిగా ఒక వారం రోజుల పాటు ఏ అలాస్కాకో క్రూస్‌ లో లగ్జరీ సూట్లో వెళ్ళి ఎంజాయ్‌ చేసి రావచ్చు. నేనే ఖర్చు పెడతానంటే అతనికేమీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
 11. ఇక ఏప్రిల్‌ మొదటి వారంలో చర్చుకు వెళ్ళి జీసస్‌ కు నా ప్రేయర్సు సమర్పించుకోవాలి.
 12. అన్నట్టు ఒకవేళ నేను అనుకున్న టైముకి పోకపోతే, డబ్బంతా ఇలా ఖర్చు చేసేస్తే మళ్ళీ నేను బతకడం ఎలా అన్న ఆలోచన వచ్చింది కానీ మళ్ళి నాకే అనిపించిది....ఇల్లు,కారు అమ్మిన డబ్బుతో ఇంకో చిన్న ఇల్లు,కారు కొనుక్కోవచ్చునని....
మనిషి పుట్టిన దగ్గిరనుంచి ఈ దేహాన్ని విడిచి వెళ్ళే వరకు దేనికో ఒక దాని కోసం 'తాపత్రయం ' చెందుతూనే ఉంటాడు.

అనకాపల్లిలో ఉన్న సరస్వతి,అట్లాంటాలోని సారా ఇద్దరూ ఒకే వయస్సుకు చెందిన వారైనా,ఒకే జాతి (స్త్రీ జాతి) కి చెందిన వారైనా వారి ఆలోచనా ధోరణిలో తేడా ఉంది. అది వేరు దేశాలలో పుట్టడం వల్లనో,లేక పరిస్థితుల ప్రభావం వల్లనో,భిన్న మనస్తత్త్వాల వల్లనో కావచ్చు. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు అక్కచెళ్ళెళ్ళ అలోచనా విధానం లోనే ఎంతో తేడా ఉన్నప్పుడు సరస్వతి,సారా వేరు వేరుగా అలోచించడంలో విశేషమేమీ లేదు. ఒకరు కరెక్టు,ఇంకొకరు కాదు అని ఈ కధ యొక్క ఉద్దేశ్యం కాదు అని గమనించగలరు. చావబోతున్నాని తెలిసినా కూడా మనిషి 'తాపత్రయం ' తెలుపడమే కధ ముఖ్య ఉద్దేశ్యం.

అసలు సంగతి చెప్పనేలేదు కదూ. సరస్వతి ఆశపడినట్లు ఆవిడినని వేసవి కాలం శెలవులని కాశీకి మనవడు వెంటబెట్టుకుని తీసుకెళ్ళాడు. పండుగకి అంతా వచ్చి ఆ పెద్దావిడని సంతోషపెట్టి ఆవిడ పోయాక ఘనంగా అంత్యక్రియలు జరిపించారు. .

ఇక సారా తన బాయ్‌ ఫ్రెండుతో కలిసి అలాస్కా కి క్రూసులో వెళ్ళి హాయిగా ఎంజాయ్‌ చేసి వచ్చింది. కానీ భగవంతుడు ఆమె ఇంకా కనీసం సంవత్సరమైనా టాంతో కలిసి బతకాలన్న కోరికను తీర్చలేదు. ఆమె ఫ్యూనెరల్కు మనవడు మాత్రమే రాగలిగాడు.