కవితా శేఖర్‌This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

నా పేరు ప్రవల్లిక. నాతో పాటే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది పరిణిత. కవల పిల్లలిద్దరికీ ఒకే పందిట్లో భాగస్వాములతో ముడివేయాలన్న ముచ్చట మా తల్లితండ్రులకి ఫిబ్రవరిలో తీరింది. పరిణిత పుట్టింటికి పది మైళ్ళలో కొత్త కాపురం మొదలు పెడితే, నేను చికాగోలో నా కొత్త జీవితం ప్రారంభించాను.

పెళ్ళయ్యాక మా మొదటి పండుగ ఉగాదే. అప్పుడే ఇండియా నుంచి రావడం వల్ల మళ్ళీ పండక్కి ఇంటికి వెళ్ళే ఆస్కారం లేకపోయింది. అసలే అందరికీ దూరంగా దేశం కాని దేశం రావడం వల్ల కొంచెం బెంగగా ఉందేమో.... పరిణితకి చాలా ఉత్తరాలు రాస్తూ ఉండేదాన్ని. అదీ, నేనూ- ఎప్పుడూ విడిగా ఉండలేదు. అది కూడా నా ఉత్తరం అందిన రోజే రిప్లయ్‌ రాసి పోస్ట్‌ చేస్తూ ఉండేది. ఎన్ని ఫోనులూ, చాటింగులూ చేసినా "ఉత్తరం" వస్తే ఆ అనుభూతే వేరు అన్నది ఇద్దరి అభిప్రాయం. మళ్ళీ "కొత్త ఉత్తరం" వచ్చేదాకా పాత ఉత్తరం బోలెడన్ని సార్లు తనివి తీరా చదువుకునేదానిని! పెళ్ళయ్యాక మా మొదటి పండగ "ఉగాది " విశేషాలు చెప్పుకోవడానికి ఇద్దరం సగానికి పైగా పెన్ను రీఫిలు అరగదీసాము. వాటి విశేషాలు క్లుప్తంగా మీకోసం...

డియర్‌ ప్రవల్లికా,

ఎలా ఉన్నవే? నిన్ను ఎప్పుడూ మిస్‌ అవ్వనంతగా మొన్న "ఉగాది " నాడు అందరం మిస్‌ అయ్యాము. నీకు ఇక్కడి విశేషాలు ఎప్పుడెప్పుడు రాయాలా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో పండగెళ్ళిన మూడు రోజులకి కానీ తీరిక దొరకలేదంటే నమ్ము. మొదటి పండగకని అమ్మవాళ్ళు పిలిస్తే మేమిద్దరం పొద్దునే అక్కడికి వెళ్ళాం. ఇల్లంతా మావిడాకులతో, బంతిపూల తోరణాలతో కళ కళ లాడిపోతోంది. మీ అత్తగారు, మావగారు, మరిది, మా అత్తగారువాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, వాళ్ళ పిల్లలు... ఇల్లంతా సందడిగా ఉంది. అమ్మ, నాన్నా ఎక్కడా వియ్యాలవారికి మర్యాదల లోపం ఉండకూడదని తెగ తాపత్రయ పడ్డారు.

అమ్మ తీర్థం ఇచ్చిన తర్వాత "ఉగాది" పచ్చడి పెట్టింది. నేను పెద్ద కప్పు నిండా తిన్నాను. అంతా పచ్చడి అమోఘంగా ఉందన్నారు, చెరుకు ముక్కలు భలేగా ఉన్నాయన్నారు. బెస్ట్‌ ఉగాది పచ్చడి కాంటెస్ట్‌ పెడితే మా అమ్మకే ఫస్ట్‌ ప్రైజ్‌ వస్తుందని అందరికీ చెప్పాను. మోండా మార్కెట్‌ కి ముందు రోజు నాన్నని పంపించి మరీ చెరుకు గడలు తెప్పించిందట.

తర్వాత మా ఇద్దరికీ పీటలు వేసి కూర్చో బెట్టి బట్టలు చదివించి, పదివేల రూపాయలిచ్చి మాక్కావల్సింది కొనుక్కోమన్నారు. తర్వాత అందరికీ బట్టలు పెట్టారు. మేమిద్దరం అందరి కాళ్ళకీ నమస్కారం చేసాము.

మా అత్తగారు కొత్త పంచాంగం తీసి ఆ సంవత్సరం దేశాభివృఉద్ధి గురించి చదివారు. తర్వాత అందరి రాశి ఫలాలూ చదివారు. అంతా మా మీద బోలెడన్ని జోకులు పేల్చారు. ఒక రెండు గంటలు యెలా గడిచాయో తెలియలేదు. టి.వి. పెట్టి నాగఫణిశర్మ గారి "ఉగాది" ప్రవచనం విన్నాము. తర్వాత భోజనాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నాకిష్టమైన వంటూ, వాళ్ళ అల్లుడికి ఇష్టమైన వంటూ - అరిటాకు నిండి పొయేటన్ని ఐటెంస్‌ చేసింది కష్టపడి అమ్మ. పాపం తెల్లారుఝామున మూడింటికల్లా లేచిందట!

పూర్ణం బూరెలు, సజ్జప్పాలు, కేసరి హల్వా, పాయసం, గారెలు, ఆవడలు, పులిహోర, బజ్జీలుతో పాటు నాకిష్టమని కందబచ్చలి కూర, ఆయనకిష్టమని పనసపట్టు కూర, అరటిదూట పెరుగు పచ్చడి కూడా వండింది. అంతా భుక్తాయాసంతో లేచి టి.వి. ముందు కూలబడ్డాము. ఏ చానల్‌ పెట్టాలో తేల్చుకోలేనన్ని స్పెషల్‌ ప్రోగ్రాంస్‌. అంతా కాసేపు కవి సమ్మేళనం లైవ్‌ ప్రసారాన్ని ఆస్వాదించాము. ఈలోగా బాబ్జిగాడు కిళ్ళీలు కట్టించుకొచ్చాడు. నాకోసం స్పెషల్‌ "మీఠాపాను" గుర్తుంచుకొని మరీ తెచ్చాడు.

తర్వాత మీ అత్తగారూవాళ్ళూ, మా అత్తగారూవాళ్ళూ అంతా బయలుదేరారు.

మీరు కూడా ఉండి ఉంటే బావుండేదని అంతా అనుకున్నాము. సాయంత్రం ఒక పెద్ద సర్ప్రైజ్‌ ఇచ్చారు మా వారు. వాళ్ళ ఫ్రెండ్‌ కి ముందే చెప్పారట. అతను మూడింటి కల్లా ఫోను చేసి నాలుగు ఎంట్రీ పాసులు మాత్రమే మానేజ్‌ చెయ్యగలిగానని చెప్పి లలితకళా తోరణంలో జరిగే "నంది అవార్డుల ప్రదానోత్సవం"కి బయలుదేరి వచ్చేయమనడంతో, నా ఆనందానికి అవధుల్లేవు! ఆ ప్రోగ్రాం విశేషాలని మళ్ళా ఉత్తరంలో రాస్తాను.

ఇంతకీ మీరు అక్కడ ఉగాది ఎలా చేసుకున్నారు? నాకు అమెరికాలో ఎలా జరుపుకుంటారోనన్న "కుతూహలం" వెంటాడి వేధిస్తోంది.

నీ జవాబు కోసం ఎదురు చూస్తూ

- లవ్వింగ్లీ, పరిణిత.

దాని ఉత్తరం చదివాక, కాసేపు మనసంతా దిగులుతో నిండి పోయింది. అంతా కళ్ళకు కట్టినట్లు రాసింది. ఒక నిమిషం బాటు అంతా మసకమసకగా కనిపించింది. నీళ్ళు తుడుచుకున్నాను. ఇక్కడి ఉగాది గురించి దానికి రాయడం మొదలు పెట్టాను...

డియర్‌ పరిణితా,

నీ ఉత్తరం చదివాక, నేను ఎంత మిస్సయ్యానో అనిపించింది. వచ్చే సంవత్సరం అయినా ఇండియా రావడానికి ప్లాన్‌ చేస్తాము. సరే ఈలోగ, ఇక్కడి మా "ఉగాది " పండగ రుచి చూపిస్తాను.

ఈసారి "ఉగాది " వీక్‌ డే న రావడం వల్ల ఫ్రెండ్స్‌ అంతా రాబోయే వీకెండ్‌ న సెలబ్రేట్‌ చేద్దామని డిసైడ్‌ చేసారు. మేము న్యూలీ వెడ్డెడ్‌ కపుల్‌ కనుక - నేనూ, సుజిత్‌ అందరినీ మా ఇంటికి ఇన్వయిట్‌ చేసాము. ఒక వారం ముందే లేడీస్‌ అంతా ఫోన్లో మాట్లాడుకుని "pot-luck"(తలా ఒక ఐటం చేసుకుని రావడం)కి మెనూ ఫైనలైజ్‌ చేసాము. ఉగాది పచ్చడి మాత్రం అందరూ తీసుకురావలని అనుకున్నాము - షడ్రుచులతో పాటుగా రకరకాల రుచులు కూడా టేస్ట్‌ చెయ్యలన్న ఐడియాతో! మెనూ మీద బోలెడన్ని డిస్కషన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌ నడిచాయి. పిల్లలంతా ఈ ఐటెంస్‌ తినలేరేమోనని పిజ్జా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బ్రెడ్‌ స్టిక్స్‌, డోనట్స్‌ (మన బాదుషాలలాగా వుంటాయనుకో) ఆర్డర్‌ చేసాము.

మా ఇంటి బేస్మెంట్లో అంతా పొద్దున్న తొమ్మిది గంటలకి మీట్‌ అవ్వాలని ప్లాన్‌ చేసుకున్నాము. అందరూ వచ్చేసరికి పదిన్నర అయ్యింది. భారతీయులం ఎక్కడ ఉన్నా, మన టైం మెంటయిన్‌ చెయ్యాలి కదా! మొత్తం ఒక పది ఫామిలీస్‌ కలిసాము. పిల్లలతో కలిపి ఇరవై ఐదు మెంబర్స్‌ దాకా అయ్యాము. ఎప్పటిలా వెస్టెర్న్‌ వేర్‌ లో కాకుండా అంతా ఇండియన్‌ అటైర్‌ లో కలర్‌ ఫుల్‌ గా తయ్యారయ్యాము.

మాలో అందరిలోకి పెద్దయిన రఘురాం గారు "శుక్లాంబరధరం" చదివారు. తర్వాత పిల్లలు ఇంగ్లీషులో రాసుకొచ్చిన తెలుగు శ్లోకాలను కష్టపడి చదవడానికి ట్రయ్‌ చేసారు.

నేను ధైర్యం చేసి నాకొచ్చిన పాట పాడేసాను "వచ్చిందీ వచ్చిందీ, వన్నెల ఉగాది వచ్చిందీ, కొత్త అందాలు సంతరించుకుని పెళ్ళి కూతురై వచ్చింది..." అంటూ! నా పాటకు బోలెడన్ని కాంప్లిమెంట్స్‌ వచ్చాయి!

అప్పుడు మొదలైంది "ఉగాది పచ్చడి" కోలాహలం...

ముందుగా సరళ గారు తనుచేసిన ఉగాది పచ్చడి రుచి చూపించారు. సుగర్‌, తామరిండ్‌ పల్ప్‌, మేథీ పౌడర్‌, ఫ్రోజెన్‌ మాంగో పీసెస్‌ వగైరా వేసారట. తర్వాత భావన గారు జాగెరి, మాంగో పీసెస్‌, లెమన్‌ జ్యూస్‌, కాకరకాయ్‌ పల్ప్‌ వేసి చేసిన పచ్చడి పెట్టారు. ఇలా రక రకాల ఉగాది పచ్చళ్ళను చేసుకొచ్చారంతా. ఇక్కడ వేప పువ్వు అన్ని చోట్లా దొరకదు కాబట్టి, రుచులు తెప్పించడానికి అంతా తమ తమ క్రియేటివిటీని చాటుకున్నారు. వీళ్ళందిరిదీ ఒక ఎత్తయితే, ఒకావిడ సలహా ఇచ్చారు... చేదు, వగరు రుచుల కోసం కొంచం వినెగర్‌ అండ్‌ సోయా సౌస్‌ ట్రయ్‌ చెయ్యవచ్చునని. మరొకావిడ గ్రేప్‌ ఫ్రూట్‌ కూడా వెయ్యచ్చని జత కలిపింది.

నాకు ఎలా రియాక్ట్‌ అవ్వాలో అర్థం కాలేదు...

భోజనాల తంతు మొదలయింది. తల్లులందరూ తమ తమ పిల్లలకి ముందు పెట్టేసారు. పిల్లలందిరినీ ఎంగేజ్‌ చెయ్యడానికి ఒక రూం లో స్పెషల్‌ కిడ్స్‌ మువీకి ఏర్పాట్లు చేసి, మేమంతా చేతిలో ప్లేట్స్‌ పుచ్చుకుని సెర్వ్‌ చేసుకోవడానికి లైన్‌ ఫార్మ్‌ అయ్యాము. చాలా వెరైటీస్‌ కనిపిస్తున్నాయి.

చక్కెర పొంగలి (నెట్లో చదివి కందిపప్పుతో చేసారట!), రస్‌ మలాయి, బ్రెడ్‌ జామూన్‌, కర్రీ పఫ్స్‌, పకోడి, పూరీ, చనా, లెమన్‌ రైస్‌, వెజెటబుల్‌ రైస్‌, రైతా, దద్ధోజనం, ప్లయిన్‌ రైస్‌, మసాలా రసం, చిప్స్‌... ఇలా ఎన్నో డిషెస్‌ ఉన్నాయక్కడ!

ఆడవాళ్ళ మధ్యన భోజనాలప్పుడొక పెద్ద మహాసభ నడిచింది - "చీరలు నగలు" గురించి. ఇండియాలో ఓపెన్‌ అయిన కొత్త షోరూంస్‌ నుంచి డెవొన్‌ స్ట్రీట్‌ (చికాగోలో ఇండియన్‌ మార్కెట్‌ పేరు)లో దొరికే రూబీసెట్‌ వరకూ అన్ని టాపిక్స్‌ ఆ మహసభలో చోటు చేసుకున్నాయి.

అంతా ట్రాష్‌ కాన్లో పేపర్‌ ప్లేట్స్‌ పారేయడంతో భోజనాల ఎపిసోడ్‌ ముగిసింది. లెఫ్ట్‌ ఓవర్స్‌ ఎవరికి కావల్సింది వాళ్ళు జిప్‌ లాక్స్‌ లో ప్యాక్‌ చేసుకున్నారు. అన్నట్టు నీకు లెఫ్ట్‌ ఓవర్స్‌ అంటే ఎమిటో తెలియదు కదూ! ఇక్కడ పనివాళ్ళు ఉండరు కాబట్టి, మిగిలిపోయినవన్నీ అందరూ పంచుకుంటారు. బాచెలర్స్‌ ఉంటే వాళ్ళకి ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ ఇస్తారు. మిగిలినవి పారేయకుండా ఫ్రిజ్‌ లో పడేస్తారు. వారం క్రితం చేసి నిలవపెట్టిన పప్పు, కూరా, పులుసు కూడా తినే వాళ్ళుంటారు. కొంతమందికి నిజంగా ఉద్యోగాలూ, పిల్లల వల్లా రోజూ వంట చేసే తీరిక దొరకదు. మరికొంత మంది "అమెరికా" వచ్చి కూడా, ఎప్పుడూ కిచెన్లో టైం వేస్ట్‌ చేయడం "బిలో డిగ్నిటీ"గా ఫీల్‌ అయ్యి - అప్పుడప్పుడు మాత్రం వంట చేస్తూ ఉంటారు. రోజంతా ఫ్రెండ్సుతో చాటింగు, నెట్‌ బ్రౌజింగ్‌, సినిమాలూ, టి.వి. చూస్తూ చాలా బిజీ అయిపోతారు. ఇదంతా మన మామ్మ కి చెప్పకు... సద్ది కూడు తింటున్నామని తెగ బాధపడిపోతుంది. సుజిత్‌ నన్ను "నువ్వింకా డెవెలప్‌ అవలేదోయ్‌! కల్చురల్లీ బ్యాక్వార్డ్‌" అని చమత్కరిస్తూ ఉంటారు.

ఒక గంట సేపు ఫొటో సెషన్‌ నడిచింది. ప్రోగ్రాం అంతా చాలా మంది వీడియో షూటింగు చేసారు. నీకు కాపీ చేసి పంపుతాను. తర్వాత చాలా గేంస్‌ ఆడుకున్నాము. పిల్లలకి గిఫ్టులు ఇచ్చాము. అంతా వెళ్ళేసరికి సాయంత్రం ఆరు దాటింది. నేనూ, సుజిత్‌ ఇల్లంతా సర్ది, వాక్యూం చేసేసరికి సాయంత్రం ఎనిమిది అయ్యింది. లెఫ్టోవర్స్‌ తిని, మిగిలనవి ఫ్రిజ్లో సర్దుకుని గుడ్‌ నైట్‌ చెప్పుకున్నాము.

ఇన్ని రక రకాల "ఉగాది" పచ్చళ్ళు తిన్న మాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మరి... వచ్చే ఉగాదికి చెప్తా!

ఇక ఉంటానే మరి,

విత్‌ లాట్స్‌ ఆఫ్‌ లవ్‌, ప్రవల్లిక