ఈ దసరా ఏమన్నది?

Vaddepally Krishna

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఈ దసరా ఏమన్నది?
నిన్నూ, నన్నూ, యీ దినమైనా
నిండుగా నవ్వుమన్నది.
ఆ నవ్వులో వాడని పువ్వులను పూయించుమన్నది
ఆ పూవులో వీడని నెత్తావుల నుంచుమన్నది

ఈ దసరా ఏమన్నది?
బంగారం పంచడమటుంచి
ధరించనూలేని యీ
దరిద్రులను
బంగారంపేరిట శమీదళాలనైనా
చేతనైనంతగా
మనిషి మనిషికి పంచుమన్నది
నూతన చైతన్యంతో ప్రగతిని కాంచుమన్నది.
బాహ్యాంగాలనేగాక
అంతరంగాలను కూడ అలుముకొమ్మన్నది
అనంతంగా అనురాగ గంఢాన్ని పులుముకొమ్మన్నది

ఈ దసరా ఏమన్నది?
మరోసారి గతాన్ని తలచుకొమ్మన్నది
మంచిదారిలో బ్రతుకును
మలచుకొమ్మన్నది
అందరూ ఒక్కొక్క అపరదుర్గలా
అన్యాయపు మహిషాసురులను
అంతం చేయాలన్నది
పవిత్ర చరిత రామునిలా
పాండవమధ్యమునిలా
ప్రావీణ్యంతో, పరాక్రమంతో
శరాన్ని సంధించాలన్నది, దుష్ట
శత్రువుల్ని చెండాడాలన్నది.

ఈ దసరా ఏమన్నది?
శ్రమపడకుండానే
చేసుకునే సరదాలకు
పరదాలను వేయమన్నది
కష్టించి మాత్రమే
కడుపునిండా మేయుమన్నది
అంతవరకూ అందరినీ
ఎదురుతెన్నులు కాయుమన్నది
మూగబాధతో మూల్గుతూ ఏతెంచిన

ఈ దసరా ఏమన్నది?
మరోయేడుకైనా
మళ్ళీ తాను వచ్చేసరికి
కుళ్ళునంతా మరచి
మాధుర్యంగా స్వాగతాలు పలుకుమన్నది
గుండె గుండెలో తేనెల్ని పరచి
నిండుగా కన్నులపండువగా కులుకుమన్నది.
మంచిని మనసారా చూడుమన్నది
ఆ చూసింది నలుగురికీ చూపుమన్నది.

ఈ దసరా ఏమన్నది?
అందరికీ యీ విషయం తెలిసేలా
సుందరంగా ఓ కవితను వ్రాయుమన్నది
నీకూ నాకూ నవతను పూయుమన్నది
మనిషి మనిషికి మమతల్ని రాయుమన్నది.