గురుదక్షిణ

Durgaprasad Varanasi

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఉపోద్ఘాతము: ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు అమరజీవి. వారు రచియించిన “ప్రబోధం” అనే సీసపద్యత్రయ కావ్యం (“అమరావతీ పట్టణమున,” “తన గీతి నరవ జాతిని,” మరియు “కృష్ణాతరంగపంక్తిన్”) నేను ముక్కుపచ్చలారని మూడేళ్ళ వయసులో చదవ గలిగాను. అప్పటినుంచి, ఏకలవ్యుడు ద్రోఆఆచార్యుని ప్రతిమను ముందరనుంచుకొని ధనుర్విద్య నభ్యసింసించినటుల, సీసపద్య రచన సేయ ప్రయత్నించినాను. కవిసార్వభౌముడు శ్రీనాధ మహాకవి తరువాత సీసపద్యరచనలో రాయప్రోలు వారు వారికే వారు సాటి అనిపించుకొన్నారు. వారు అప్రతిమానమైన యశస్సును గణించిరనుటలో ఎంతమాత్రము అతిసయోక్తి లేదని నా భావన. వారు రచించిన అమరగీతం, “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా” తెలియని ఆంధ్రులున్నారా? న యీ చిన్న సీస పద్యం గురుదేవులైన రాయప్రోలు వారికి నా గురుదక్షిణ. ఆఖరి పంక్తిలో “తెలుగు వాడ!” అనే పదప్రయోగము చేసాను. దానిలో ద్వందార్ధమున్నదని గమినించ వేడెదను. “వాడ” అనే పదము, మన వాడుకలో, అటు తెలుగు మనిషిని సంభొదించటమే కాకుండా, తెలుగు నాడులో వాడ వాడలు (విజయవాడ, గుడివాడ, తదితర వాడలు) అనే ప్రయోగము కూడాను.||సీ|| “ఏ దేశమేగినా ఎందుకాలిడినా"
నీజాతి విఖ్యాతి నిలుపుమయ్య
"ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురయినా"
ఎత్తుగా నీఛాతి నెత్తుమయ్య

ఏ పాట పాడినా ఏ మాటలాడినా
పరవశమ్మున తెల్గు పలుకుమయ్య
ఏ కార్యమందైన ఏ కావ్యమందైన
తెలుగువీవను సూక్తి తెలుపుమయ్య

||తే. గీ.|| జన్మ జన్మాల పుణ్యమౌ జన్మమొంది
జగతి వెలుగొంద నోచిన జాతి మనది
గత యశోవిభవమ్ము సుకృతమనంగ
తెలుగు దివ్వెలు వెలిగించు తెలుగు వాడ!