శ్రీనివాస శతకం

దుర్గాప్రసాదు వారణాసి

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here[ఉపోద్ఘాతము: “శ్రీనివాస” మకుటముతో తెలుగు భాషలో శతక రచనకు సీసము, ఆటవెలది, మరియు తేటగీతి చందస్సు సరిపోతుంది. ఆ పద్యముల ప్రయోగించి ఈ శతకరచనకు సాహసించితిని.]


ఆ.వె.:
శ్రీనివాస! నిన్ను చేతమందుననిల్పి
సృష్టి వంక నాదు దృష్టి జూపి
ఎల్ల లోక సరళి నెరుగ గోరెడి నాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

సీ.:
రవి గాంచనిదియెల్ల కవి గాంచునని దెల్ప రచియింతు నేనీ ప్రవచనములను
మస్తిష్క మందిరంబందులో స్పురియించు మానవ ధర్మంబు మనవి సేతు
కమలాక్షుడిచ్చిన కనులార గాంచిన పుడమి పోకడ నెల్ల నుడివె దిచట
పార్థసారథి నేర్పు పాఠంబు లవియెల్ల పాఠక పంక్తితో పంచు కొనెద

ఆ.వె.:
అనుచు శతక మిపుడు ఆంధ్రమ్ములో వ్రాయ
సాహసమ్ము జూపు సత్కవినన
నిండు కవిత కలము నుండి ధారగ జార
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

భర్తృహరిని గాను కార్తికేయుడ గాను
నీతి శాస్త్ర మిలను నేర్ప నెంచ
తోచెడూహలన్ని తూచి తెల్పుట నాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

“విశ్వధాభిరామ వినుర వేమ!” యనెడు
మకుట మందు శతక మవని నుండ
"నీతి నేర్ప నెంచ నేనెవ్వడను స్వామి?"
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

తెలుగు నందున్‌ సుమతీ శతకంబది
తెలుగు వారి కెల్ల తెలివొసంగ
నీతి శతకమిపుడు నేవ్రాయనేలంచు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

ఆవు కున్న యట్టి ఆదర్శ జీవాత్మ
అన్యులకును లేదు అవని జూడ
నిన్ను జేరె డాత్మ నిస్వార్ధ మనియంచు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

తల్లి తండ్రు లొసగ తనువు నీ ధాత్రిలోన్‌
గురువు జూపు బ్రతుకు తెరువు మాకు
ధరణి తల్లి తండ్రి గురువు నీవని మాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

పార్థసారథీ! అపారకృపానిధీ!
గురువు లెల్లరకును గురువు వీవు
పార్థుడనని యెంచి పాఠంబు నేర్పంగ
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

తే.గీ.:
తృష్ణ లన్నియు దీర్చు శ్రీకృష్ణమూర్తి!
పార్ఠసారథివై మాకు పాఠములను
బోధ జేసెడి గురుపుంగవుండవనుచు
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

(సశేషం)