తిరుమలేశీయం

Durgaprasad Varanasi

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereశ్రీనివాస!సప్త శిఖరశైలనివాస!
నినుమనముననుంచి నిటులరచన
బూను నన్ను కరుణ బ్రోవంగరావయ్య
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

తెలుగు దేశమందు తిరుమల పురమందు
వెలసినట్టి వేల్పు వేంకటేశ!
ఎంత మమత బూని ఇలవేల్పువైతివో!
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

పోతనాది కవుల పోషనొందిన భాష
రాయలాది నృపుల రాజ్య భాష
మాతెనుంగుభాష మాతబ్రహ్మణివాణి!
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

కలియుగంబునందు కర్మవశంబున
జనన మొందినట్టి మనుజుడేను
ధర్మ మైన పధిని తరలింప జేయుమా
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

మాత గౌతమీ పవిత్ర కృష్ణానదీ
ధారలందు పండు ధాన్య రాశి
ఆంధ్ర దేశ మనగ నన్నపూర్ణేనురా!
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

కన్నతల్లి కన్న మిన్న వేల్పిలలేదు
మాతృభాష వంటి మాట లేదు
నేను పుట్టి నట్టి నేలయే నేలరా
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

మాటలందుగాని పాటలందున గాని
తెలుగు బల్కినంత తేనె లొలుకు.
తెలుగు బలుకు వాడు దేవాంశుడేనురా
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

తప్పు లెన్న కుండ తండ్రివై బోధించు
జగతి పధము నెల్ల జక్ర పాణి!
నరుని గురుడ వైన నారాయణుడవీవు
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

బ్రతుకు నొసగు వాడు బ్రహ్మదేవుడెగాని
బ్రతుకు తెరువు జూపు పతివి నీవు
తలచినంత చాలు తండ్రివై బ్రోచేవు
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

ధర్మతనయుడైన దశరథాత్మజుడైన
ఇడుమలనుభవించె పుడమి నతడు
జగతి జన్మ మనగ వగపుల మూటరా
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

బ్రతుకు బుద్బుదంబు ప్రాయంబు క్షణికంబు
భ్రమల నన్ని త్రుంచి బ్రతుక గోర్తు
జేరదీసి నేర్పు జీవనోపాధియున్
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

మూర్ఖుడైనవాడు మూర్ఖత్వమునువీడి
మెలగ నేర్చి నంత వెలుగు జూచి
కూపవాసియైన కప్పకాబోడురా
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

కమలబాంధవుండు కమలమ్ములనుబ్రోచు
తీరునందు నన్ను జేర రమ్ము
శుభమొసంగు రశ్మి సోకింప్గారమ్ము
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!

న్యాయమున్న చోట సాయముండెడి చోట
వెలసియుందు వయ్య వేంకటేశ!
శాంతి సత్యములను సర్వధా నిలుపరా
తెరువు తెలుపు వేల్పు! తిరుమలేశ!