Creative works from Telusuna Members

ఏది మంచి సాహిత్యం?

రఘువర్మ బసవరాజు

మిత్రులార,

ఏది మంచి సాహిత్యం, అన్న విషయం మీద మిత్రుల చర్చ ఆసక్తి కరంగా ఉంది. నా భావాలను దాచుకో దలచ లేదు.

మంచి సాహిత్యానికి, పొందికైన చక్కని "పద ప్రయోగం" సుందర రూపాన్నిస్తే, "భావం" జీవం పోస్తుంది. "చందోలంకారాలు" ఆభరణాలై ఆ కోమల సాహితీ కన్య శోభను మరింత ఇనుమడింప చేస్తాయి. ఆభరణాలు లేక పోయినా చక్కటి సహజమైన అందం తో కోమలాంగి ఎలా మనలను ఆకట్టు కోగలదో అలాగే చక్కటి భావం, విన ఇంపైన పద ప్రయోగం తో కవి అందరూ మెచ్చే కవిత్వాన్ని అందించ గలడు. కానీ "భావం" లోపించి, కేవలం పద ప్రయోగాలు, ఛందోలంకారాలు మిగిలితే, అది "జీవం" లేని సుందర శవం లా వ్యర్థం,నిరర్థకం.

అంత సులభంగా మంచి సాహిత్యాన్ని గుర్తించ గలిగితే మరి సమస్య ఏమిటి? మంచి సాహిత్యం అందరికీ ఒకే రీతి లో ఆనందానుభూతుల్ని కలిగించాలి గా! ఏకాభి ప్రాయం ఎందుకు లేదు?

"పద ప్రయోగం" మరియు "చందోలంకారాలు" సులభంగా అందరూ గుర్తు పట్ట గలిగేవి. భాష పరిధిలో పుట్టి అలరించేవి. అందరూ సమంగా అర్థం చేసుకొని అనుభవించ గలిగేవి. కానీ భావమలా కాదు. భావం వ్యక్తి ఆలోచన లోనుంచి, కవితావేశ ఫలితంగా పుట్టేది! ఆ కవితా భావానికి కలిగే స్పందన కూడ అంతే. వ్యక్తి గతమైనది. మనిషి ఆలోచన మీద, సంస్కారం మీద, గతానుభవాల మీద,ఇష్టా ఇష్టాల మీద, కాల రీతుల మీద ఆధార పడుతుంది.

పసి పాపడిని స్పందింప చేసి చల్ల గా నిద్ర లో దించే తీయని జోల పాట, ఆ పాపాయి హృదయానికి హత్తుకొనే మహత్తర సాహిత్యం!

పామరులైన జానపదులను స్వచ్చమైన స్థానిక భాష లో వారి యాస తో అలరించే పల్లె పదాలు వెల లేని, కమ్మటి సాహిత్యపు చద్ది మూటలు! వారికవి వెల లేని సాహిత్యపు గనులు.

"మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే మదనములకు.." అంటూ జల పాతం వలె పరుగు లిడుతూ కవితా ప్రియుల హృదయాలను తడిపి తన్మయత్వం లో ముంచి తేల్చే పోతన సాహిత్యం ఎంతో మంది కి అమూల్యం, అద్భుతం! భక్తి భావాలతో నిండి తరించే వారికి మరీ కమనీయం, పరమ పావనం!

".. గొంతు కురి బిగించి, గుండె లో నుండి సూదులు గ్రుచ్చి.. కూర్చి.." అంటూ, కోమలమైన సుమాలకు కూడా జీవమున్నదని ప్రతి సామాన్యుడి గుండెలకు హత్తుకునేలా కరుణశ్రీ అందించిన పుష్ప విలాపం ఎందరికో సుందర సుమధుర సాహిత్యం! అద్వితీయం!!

ఇలా భావ సృష్టి, ఆ భావాలకు మనిషి స్పందన - పూర్తిగా వ్యక్తి గతమైనవి, ఆలోచన మీద ఆధార పడేవి. సగటు గా ఒక సమాజం మొత్తం కాలాన్ని బట్టి, ఒక ప్రత్యేక సాహిత్యపు వొరవడి ని ఆదరించి అగ్ర తాంబూలమివ్వ వచ్చు. కాలం మారక తప్పదు. దానితో మనుషుల విలువలు, ఆలోచనలు మారడం అనివార్యం! ఒక కాలం లోనే విభిన్న ఆలోచనలు, భావాలు వుండడం కూడ అనివార్యమే.

ఏ కొల బద్ద తో విభిన్న భావాలను, విభిన్న భావ స్పందనలను, ఆలోచనలను కొలచి హెచ్చు తగ్గులను నిర్ణయించ గలం?

రఘువర్మ బసవరాజు


#maa telugu talliki mallepU daMDaa#

Back to list