Creative works from Telusuna Members

పరమహంస

మోహన్ వల్లభజోశ్యుల


పరమహంస
మోహన్ వల్లభజోశ్యుల
---

ఎటువంటి మానసిక దౌర్బల్యస్థితినందున్న
నీ పేరు స్ఫురణకొచ్చినంత మాత్రాన
ఓ ప్రశాంత భావము నన్నావహించు
నీ గుణవిశేషముల బోలు వ్యక్తులికరారేమో?

సతిగజేరి శారదాదేవి మాతవలె గనిబెట్ట
నీ జన్మాంతర సుకృతము గాక మరేమి కాగలదు?
నీ మార్గమేదైన, ననుసరించిన ధర్మచారిణి
యామాత త్యాగశీలోన్నతినూహింపలేను
ఆమెకు నా వినయపూర్వక నమస్కృతులు.
...

బతుక బత్తెములార్జింప నేర్పెడు చదువుల
పేదవైయుండియు నేర్వయిచ్చగించలేదు
బతుకు మార్గమేమిలేక బతుకుటెట్లని చింతలేదు
భాతృని భారము దీర్చనైన శ్రీమంతుల సేవింప నెంచలేదు
కాళికాలయమున పూజారివేనని యనుకొన్న
ఆలయ పాలకుల నాజ్ఞల పాటించలేదు

నియమాలు నీకుగావన్నట్లు యిచ్చవచ్చిన రీతినర్చించినావు
ఆలయము నీ నిలయమన్నటుల రాత్రిఁబవళ్ళచట నుండినావు
ముల్లోకములు భీతినొందు కాళిని మాతగ దలచి నిర్భీతిఁ గొలిచినావు
భారమామెదనేమో, జీవితమన భయమన్నది మరచినావు
అమ్మకొలువు కన్న యింకేమిటవసరమని లౌకిక బంధాలు లోదెంచినావు
నిర్మలభక్తి పరతత్వోన్నతులతో నిర్దేశకులఁ నిశ్చేష్టుల జేసినావు


ఒకపరి అన్నపానాదుల మరచి రోజుల తరబడి
వొంటి ధ్యాసలేక ధ్యానమునందుండు
మరిసారి తినుటయే పని యనునటుల
కడవలఁ దీపి బక్ష్యముల భుజించు

యోగనిష్ఠన తనువు తరువుమాదిరి కదలకనుండు నొక దినము
భక్తిపారవశ్యమున భజనలొనరించు మరొక దినము
గంటలతరబడి నాట్యముజేయుచు చైతన్యువోలె
కాళిమాత సేవ, పూజల జేయుచు గడుపు నొక్క రోజు
పూజగీజలెందుకనునటుల దీపమైనపెట్టడు వేరొక్కరోజు

మూర్ఛిల్లు అపుడునపుడు యోగావేశవసుడై సంజ్ఞలేమిలేక
జంగములవోలె గంజాయి సేవించునొకపుడు జనులచ్చరవునొంద
విన్యాసముల జేయు రాముడనటంచునొక తడవ
రామబంటు నటంచు తోక తగిలించుకొను నింకొక తడవ
పింఛమునలంకరించుకొని కృష్ణుడనంటు
వెన్నముద్దలారగించు మక్కువతో
నమాజు జేయు కొన్నినాళ్ళు, క్రీస్తుదలయు మరిన్నినాళ్ళు
వెర్రివాడో, వేదాంతియో, భక్తుడో
జ్ఞానియో నెరుగలేకుండిరి పండితులు పామరులు నైన

ఈ సందేహమ్మును దీర్పనెంచి నటుల
యాతని నెదుర్కొని వచ్చి సూటిగ ప్రశ్నించె
నరేంద్రుడు దేవుడున్నాడా యని చూపించగలవా యని
నాతని తీక్షణత దెలిసిన తదుపరి కల్గించె జ్ఞానోదయానుభూతి
ఒక్క క్షణమాత్ర స్పర్శచే నాతని సందేహము దొలగ

నరేద్రుడు వివేకానందుడై
ప్రజ్వలింపజేసె ప్రపంచవ్యాప్తముగ
రామకృష్ణుని దివ్యజ్ఞాన వ్యక్తిత్వమును
సర్వమత సమానత్వమును అద్వైత సిద్ధాంతమును
వేదాన్త భేరీని మ్రోగించి, ఆయన పేరున మఠము స్థాపించి

పరమేశ్వర జ్ఞానానుభూతిలేక
బతుక నశక్య మన్నట్టు గన్పట్టినావు
తాంత్రిక యోగనిష్టతో భవానీ దర్శనమొందినావు
భక్తిసేవాతత్పరతన హరిహరాదుల సాక్షాత్కరించికొనినావు
వేదాంతశాస్త్రముల సారమంతగ్రోలి
జ్ఞానయోగివై నిర్గుణ నిరాకార కాలాతీత
అద్వితీయ అంతర్యామియౌ నాచైతన్య సత్యస్వరూపము గాంచినావు

ధన కనక విశేషముల స్పర్శ నొందిన
దేహమంత కంపరము బొందువాడు
జిజ్ఞాసుల సందేహంబుల దీర్ప నలసట
నెరుగక దినమంత బోధించువాడు
కాంతలందరు దేవి ప్రతిరూపులనియే దలచువాడు
నందరకు శారదాదేవి మాతయౌ నవకాశమొసగినాడు

ముముక్షువుల మతమార్గమేదైన, దేవుని నామమేదైన
నవి జేర్చు గమ్యమొక్కటేనని
కాంతురందరు నా యొక్క జ్ఞానజ్యోతినే నని
మనము జేయు కర్మలేమైన మనసులు లగించు ధ్యేయము ముఖ్యమని
నిస్సంకోచముగ స్వానుభవమున చెప్పగల్గిన గురువీయనే

సంసారమందు సారమునె గైకొని
వృత్తిచే పూజారి మనోవృత్తిచే భాగవతుడయి
జీవినని తాపత్రయపుటుచ్చులో పడక
జీవాత్మపు స్వేచ్చాయుత మార్గముననుసరించ గల్గిన
నిరాడంబర, నిర్మల, నిర్వికార, వినయ సంపన్న హంస
శ్రీ రామకృష్ణ పరమహంస


గమనిక: నే చదివినవి, విన్నవి కల్గించిన భావముల నాధారముగ ఇది
వ్రాయడమైనది.


#maa telugu talliki mallepU daMDaa#

Back to list