Creative works from Telusuna Members

Banisatvapu

Ramakantah Rao Chakalakonda

బానిసత్వపు బురదలోన బండ రాయిగ ఉండి పోయి
ఏండ్ల తరబడి కాంతి కానక, వెలికి రాను దారి లేక
మూల్గి మగ్గెడి సోదర, నీకు యిచ్చెద ఆసర.

1. రాజకీయపు రంకు లోన, రాటు బొంకుల రొచ్చులోన
స్వార్ద పరులు వేసినట్టి, సంకెలందు చిక్కి పోయి
సొలసి పోయిన సోదర, నీకు యిచ్చెద ఆసర. | బానిసత్వపు||

2. బ్రతుకు తెరువుకు దారి లేక, గతక డానికి మెతుకు లేక
వాడి పోయి వంగిపోయి, ఒగ్గి వాడి చిక్కి శల్యమై,
నీరసించిన సోదర, నీకు యిచ్చెద ఆసర. | బానిసత్వపు||

3. ఆగడాలతో అలసిపోయి, అరువులందు మునిగి పోయి
త్రాగడానికి నీరు కరువై, తలను దాచను నీడ అరుదై
వీగి పోయిన సోదర, నీకు యిచ్చెద ఆసర. | బానిసత్వపు||

4. ఆశ కంతు లేని నేతల, చేతి పావుగ చక్కిపోయి
మోసము, నిరాశ నీదై, నొసటి రాతను తిట్టుకొంటు
మూగ పోయిన సోదర, నీకు యిచ్చెద ఆసర. | బానిసత్వపు||

5. ఒకటి రెండై, రెండు మూడై, కలసి ఒకటిగ ప్రతిఘటించి
చీకటిని తొలగించు దివ్వెగ, పాటవించే ప్రగతి రవ్వగ
కూకటి కదల్చర, నీకు నీవే ఆసర. | బానిసత్వపు||


6. ఆత్మ వంచన ఆరట, అందుకో యీ బావట, ఆత్మ బలమే వూరట
పట్గుకో యీ కాగడ, పట్టు దలతో ఆగక,
సాగు ముందుకు సోదర, నీ శక్తే నీకు ఆసర. | బానిసత్వపు||

రమాకాంతరావు చాకలకొండ
March 13, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list