Creative works from Telusuna Members

JalaJala Jaredy

Ramakantha Rao Chakalakonda

జల జలా జారెడి కాల వాహిని లోన
తెలియకే సాగెడి ధార యీ జీవితం. ||జల జలా||

1. గతమనే హిమ శైల గంగా ప్రవాహములా,
గతు లెన్నో మారుచు, గతి తోటి కదలుచూ,
మది స్మృతుల మలుపులతో ముందుకు ఉరుకుచూ
సతతము సాగెడి సరిత్తు యీ జీవితం. ||జల జలా||

2. కష్టముల కొండలపై కదమును త్రొక్కుచూ,
నష్టముల రాళ్ళను ఢీ కొని సాగుచూ,
ఇష్టమను పూవనుల ఇంపుగా మరలుచూ,
పుష్టిగా సాగెడి - ప్రవాహమే జీవితం. ||జల జలా||

3. సుఖ, దుఃఖ సంధ్యలలో సతతమూ సాగుచూ,
పగలు, రేయని లేక పయనము చేయుచూ,
శగలు, పొగలను దాటి శ్రమలను ఓర్చుకొని,
ఆగక సాగెడి అలుగు యీ జీవితం. ||జల జలా||

4. మత్తు గొలిపెడి మధుర మమతలను అలలతో
ఎత్తుగా ఎగురుచు చిత్తుగా ఓడుచూ,
ఎత్తులో ఉన్న ఆ ఏడుకొండల వాని
హత్తుకొని పదములపై ఆగు నీ జీవితం. ||జల జలా||

చాకలకొండ రమాకాంతరావు
June 1, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list