Creative works from Telusuna Members

స్వార్ధము విడనాడర, సమరసము చూపర

రమాకాంతరావు చాకలకొండ

స్వార్ధము విడనాడర, సమరసము చూపర,
అర్ధమే పరమార్ధమన్న, వ్యర్ధమౌను జన్మర. || స్వార్ధము||

1. పదిమంది పొట్టగొట్టి, నిధినెంతో కూడ బెట్టి,
బీద బిక్క నోరు గొట్టి, బంధువులకు పంచిబెట్టి
వ్యాధులతో బాధలతో, వయసంతా వాడి పోవ
సాధించిన దేమిర, సమాధిలో చోటుర ? || స్వార్ధము||

2. నీతి విడచి, దారి తప్పి, న్యాయాన్ని మట్టు పెట్టి,
జాతి, మత బేధాలతో ద్వేషాలు రెచ్చగొట్టి,
పదవులను నిక్కు బెట్టి, పైసలను కొల్లగొట్టి,
విత్తమంత ఎవ్వరికో, వదలి వెళ్ళి పోదువుర. || స్వార్ధము||

3. పరమార్ధము విలువెఱిగి, పదిమందికి మేలుచేసి,
పరమపద పటములోన పై పైకి ఎక్కర,
హరి పదము చేబూని, హరి దాసుల సేవించి
నర జన్మము ధన్యతొంద, నియతిని సాధించర. || స్వార్ధము||

రమాకాంతరావు చాకలకొండ
June 29, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list