Creative works from Telusuna Members

పూజింపరే హరిని పూజింపరే

రమాకాంతరావు చాకలకొండ

పూజింపరే హరిని పూజింపరే, తో
యజ నేత్రుని తిరుమల వాసుని. || పూజింపరే||

1. మనసు నిలకడ చేసి మాధవుని మ్రోక్కరే
జనన మరణ సుడుల చక్కగా తేలరే,
తనువు పై మమతలు తొలగించి చూడరే,
అనువగా దరినున్న అలమేలు పతిని. || పూజింపరే||

2. రామ రామ యనుచు రమ్యముగ పలుకరే,
కామ క్రోధములనే కలుషములు కడగరే,
తామసము తెగనరికి తత్వమును కొలవరే
శ్యామల సుందరుని, సరసిజ పతిని. || పూజింపరే||

3. నాణ్యమైన బుద్ది నేర్పుగా నేర్వరే, సు
గుణములు మదిలోన సొంపుగ మలుపరే,
ఫణి శయనుడు హరి ప్రహ్లాద వరదుని, శ
రణము చేగోని సుఖములు బడయరే. || పూజింపరే||


రమాకాంతరావు చాకలకొండ
June 24, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list