Creative works from Telusuna Members

తనువులున్న వరకే తమకములు తాపములు

రమాకాంతరావు చాకలకొండ

తనువులున్న వరకే తమకములు తాపములు,
తనువు వీడిన పిదప తగులునే శ్రమలు? ||తనువులున్న||

1. తనువు నేననుకొంటే తప్పవు బాధలు
తనువు నేను వేరు యనకొన్న సుఖములు,
తన, పర వారన్న బేధములే పాశములు,
తనువు వీడిన పిదప ఎవరు నీ వారలు. ||తనువులున్న||

2. మనమున మోహములు మహిలోన సహజములు
తన, మన బేధములు తనువుకే పరిమితములు,
కనులకు కట్టినవి కఠినపు మోహములు
కనులు విప్పిన చాలు కఱకు వేదాంతములు. ||తనువులున్న||

3. అనువుగా ఉన్నవి శ్రీహరి పదములు,
ఎనలేని వైరాగ్య మార్గ దీపికలు,
కొని యాడ అవి తీర్చు కామితార్ధములు,
గొన్న వారికి యవే ముక్తి ద్వారములు. ||తనువులున్న||

రమాకాంతరావు చాకలకొండ
May 23, 2007 Cincinnati OH USA



#maa telugu talliki mallepU daMDaa#

Back to list