Creative works from Telusuna Members

స్వామి పదములు కడుగ కుండ, సఫలమగునా జన్మము

రమాకాంతరావు చాకలకొండ

రాగం: శివరంజని

స్వామి పదములు కడుగ కుండ, సఫలమగునా జన్మము?
కామితార్ధములెన్ని కూడిన, కూరునా కైవల్యము? ||స్వామి||

1. నామ మాధురి గ్రోలకుండే నెటుల గల్గును మోక్షము,
కామ, క్రోధము కూల కుండ నంటున వైరాగ్యము,
తామసంబు తరుగ కుండ తగ్గునా వ్యామోహము,
రామ రామని పలుక కుండ రమ్యమగునా జీవనం? ||స్వామి||

2. కర్మ ఫలములు తొలుగు కుండ కల్గునా సాఫల్యము,
మర్మ మెరిగి మ్రొక్క కున్న మదిన తీరున దుఃఖము,
ధర్మ మార్గము త్రొక్క కుండ కల్గునా ఎద శాంతము
నిర్మలంబుగు భక్తి కన్న ఏది భువిన దివ్యము? ||స్వామి||

3. జపము, తపము చేయకే చక్కనౌన జీవితం,
రిపుల బ్రోచిన హరిని పొగడేకే రాగమగునా సవ్యము,
ఒప్పగ శ్రీ వేంకటేసుని శరణ మందకే జన్మము,
ఎప్పుడైన తప్పుకొనునా జనన మరణ చక్రము. ||స్వామి||

రమాకాంతరావు చాకలకొండ
May 19, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list