Creative works from Telusuna Members

వైరాగ్య వీధులలో విహరించు హృదయము

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. వైరాగ్య వీధులలో విహరించు హృదయము
ధరణి భాగ్యములపై దృష్టి జూపేనా?
అనుపల్లవి. కరి కృపాలుని గుణము కీర్తించు మానసము
భూరి సంపదలకై బాట వీడేనా? || వైరాగ్య||

1. శౌరి శరణమునున్న సంతృప్త మానసము
నరుల సాయము గోర చేయి జాచేనా?
హరి పాద కమలముల నందిన హృదయము
దారి తప్పి వేరు దిశల కరిగేనా? || వైరాగ్య||

2. మధుర మగు శ్రీహరి నామ సుధను గ్రోలు
మది మనుజుల పొగడ నోరు విప్పేనా?
ఆది దేవుని అండ ఆనందముల దేలు
ఎద అన్య సుఖములు ఎంచి కోరేనా? || వైరాగ్య||

3. తిరుమలేశుని తత్వ మెరిగిన హృదయము,
పరమార్ధము మరచి పరుగు లెట్టేనా?
సిరి నాధు సన్నిధిన స్థిరమొందిన ఎద
కోరి కల్మషముల కాలు పెట్టేనా? || వైరాగ్య||

రమాకాంతరావు చాకలకొండ
May 16 2007, Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list