పల్లవి.. భువి లోని భాగ్యములు మా కెందుకు ? దివి లోని సౌఖ్యములు యింకెందుకు ? || భువి లోని|| అనుపల్లవి. రవి కోటి మండల రంజిల్లు దీప్తుల హరి పదములే దొరక మా సేవకు.! || భువి లోని|| 1. నవ దివ్య స్ఫూర్తులు నదుల వలె ఉప్పొంగ, భావ జలధిగ మారి వాహినులు కాగ, కవి హృదయము మాలో కోకిలై పాడగ అవిరళ సంపదలు అసలెందుకు ? || భువి లోని|| 2. చవి చూడగ ఎద హరి దివ్య నామము, భువి లోని తేనియలు ఊసెందుకు, రవి శశి నయనుని రంజిల్లు తేజము భువి లోన దరి నుండు దివిటెందుకు? || భువి లోని|| 3. నవ దివ్య రూపముగ రావణారి ఎదుట, భువి కాంత రమణుడు అండగ నుండగ అవగుణములు హరమై, అమృతత్వము పెరుగ జీవకోటికి వేరు వెలుగెందుకు? || భువి లోని|| 4. నావగ భవసింధు దాటించు వాడు ఆ, ఈవికాడు హరి వేంకటేసుడే ఉండ, ప్రక్క త్రోవలు బట్టి ఇక్కట్లలో మునగి నవ్వగ నల్గురు నొప్పెందుకు? || భువి లోని|| రమాకాంతరావు చాకలకొండ May 27, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |