రాగం: అభోగి సంగీతం: శ్రీమతి ఇందిరామణి రచన: చాకలకొండ రమాకాంతరావు తెలుసునా తెలుగు వాడ! తెలుగు భాష తేటని తెలుసునా తెలుగు మాట తేనియల మూటని. ||తెలుసునా|| 1. తెలుసునా తెలుగు గడ్డ ధరణిలోన మిన్నని, తెలుసునా తెలుగు తల్లి భాషలకే రాణని. తెలుసునా తెలుగు జాతి తాల్మిలోన మిన్నని, తెలుసునా తెలుగు నీతి భువిలోన బలమని. ||తెలుసునా|| 2. తెలుసునా తెలుగు బాష పాయసాల వూటని తెలుసునా తెలుగు మాట తియ్యనైన పాటని. తెలుసునా తెలుగు పలుకు పంచదార చిలకని తెలుసునా తెలుగు కులుకు తెమ్మెరల తూలని. ||తెలుసునా|| 3. తెలుసునా తెలుగు భూమి వీరులకు చోటని, తెలుసునా తెలుగు బిడ్డ త్యాగానికి దీటని, తెలుసునా తెలంగాణ, ఆంధ్ర, సీమ ఒకటని తెలుసునా తెలుగు తల్లి అందరికి అమ్మని. ||తెలుసునా|| 4. తెలుసునా తెలుగు ఖ్యాతి దిగంతాల వ్యాప్తని తెలుసునా తెలుగు బాణి తేటగీతి తెల్లని, తెలుసునా తెలుగు సొగసు సీసమంత సొంపని తెలుసునా తెలుగు నేల శ్రీనివాస వాసమని. ||తెలుసునా|| |
#maa telugu talliki mallepU daMDaa# |