Creative works from Telusuna Members

వెన్నెల దీపం వెలుగులతో

రమాకాంతరావు చాకలకొండ

రాగం: హంసధ్వని

వెన్నెల దీపం వెలుగులతో, వసుధకు వచ్చును చల్లదనం,
వెన్నుని చల్లని చూపులతో ఉల్లము కొచ్చును వెచ్చదనం. ||వెన్నెల||

1. ఆమని అడుగుల సవ్వడితో, అవనికి వచ్చును క్రొత్తదనం,
రాముని చల్లని వీక్షణతో, రాళ్ళకూ వచ్చును మెత్తదనం. ||వెన్నెల||

2. కోయిల కమ్మని గానముతో, కొమ్మల కొచ్చును కులుకుదనం
మాయా లోలుని మాటలతో, మనసుల కొచ్చును మంచిదనం. ||వెన్నెల||

3. వసుధపై వరుణుని జల్లులతో, వనముల కొచ్చును పచ్చదనం,
దశరధ రాముని కొలువులతో, బ్రతుకుల కొచ్చును నిండుదనం. ||వెన్నెల||

4. తెమ్మెర ముద్దుల సరసముతో, తుమ్మెద కొచ్చును జాణతనం,
కమ్మగ 'రమణను' నామముతో, గుండెల కొచ్చును తియ్యదనం. ||వెన్నెల||

రమాకాంతరావు చాకలకొండ
May 10 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list