Creative works from Telusuna Members

కల్యాణ వైభోగ కమనీయ వేళలో

రమాకాంతరావు చాకలకొండ



పల్లవి. కల్యాణ వైభోగ కమనీయ వేళలో, కొ
మ్మలార కూడి పట్టరే హారతి. ||కల్యాణ||
అనుపల్లవి. అలమేలమంగకు, అతివ పద్మావతికి
వలరాయ జనకునికి యీయరే హారతి. ||కల్యాణ||

1. రమణులార రండో శ్రీ రమణుని కండో
రమణీలలామ రమను చూడండో,
భామిని పద్మమ్మ సిగ్గు మోమును కండో
ఇమ్ముగ అందరికి ఆరతీయండో. ||కల్యాణ||

2. ఇంతులందరు చేరి ఇందిరనాధునిక,
ఇంతి పద్మావతి, ఇందిరను కండో
అందరికి భాగ్యములు అందించు వీరికి
సంతసముగ నేడు స్వస్తి పలకండో. ||కల్యాణ||

3. పంతములు మానేసి పడతులార రండో
చెంత నిలిచి హరికి చేతుల మ్రొక్కండో
వంతులుగ అందరు వెండి పళ్ళము బట్టి
కంతుని జనకులకు హారతీయండో. ||కల్యాణ||

రమాకాంతరావు చాకలకొండ
May 9 2007, Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list