Creative works from Telusuna Members

తత్వమెరిగిన నాడు, తాపములు సున్న

రమాకాంతరావు చాకలకొండ

తత్వమెరిగిన నాడు, తాపములు సున్న
సత్త్వము హరి యన్న, సంతాపమే సున్న. ||తత్వమెరిగిన||

1. సర్వ జీవులయందు, సమభావముంచిన,
సర్వేశుడు హరికి సామ్యముగ కన్న, ఎ
వరు పర వారలు, ఎవరు నీ వారలు,
సర్వమెరిగిన నాడు భేదములు సున్నా. ||తత్వమెరిగిన||

2. తామసము వదిలేసి తత్వమును కన్న,
ప్రేమనే భావమును పెద్దది చేసిన,
నమ్మి హృదయమునందు నరహరిని కన్న,
కామ, క్రోధము కందు తావు లేదన్న. ||తత్వమెరిగిన||

3. జాలి, కరుణ, దయల జ్యోతి వెలిగించిన,
మాలిమిగ అందరిపై మమతలు పంచిన,
మేలుగ హృదమును వెన్నగ మార్చిన, వన
మాలి వేంకని దర్శనమే యన్నా! ||తత్వమెరిగిన||

రమాకాంతరావు చాకలకొండ
May 2, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list