Creative works from Telusuna Members

ఆనాటి సినిమా పాట - అమృతాల తేట

అమెరికా కోకిల


ఆనాటి సినిమా పాట - అమృతాల తేట –
యీనాటి సినీ పాట చెవిలోన పోటా? జిల గొలిపే తీట?

పల్లవి. పాత పాత పాటలకు పల్లవే ప్రాణం,
లేత లేత గీతాలకు లేదు లే మానం. ||పాత||

అనుపల్లవి. కమ్మనైన పాతకాల పాటల్లోన,
మకరందం మాధుర్యం యిమ్ముగ తేలు,
నమ్మకముగ యీనాటి పాటల్లోన,
నానాటికి దిగజారే నైజం తేలు. ||పాత||

తరియించగ తియ్యని ఆ పాటల్లోన, త
న్మమయమై పోవును మనసు, శరీరం,
చురకత్తుల పొడుపులాంటి యీపాటల్లో,
తెరమీద చెప్పరాని టంకు టమారం. ||పాత||

ఆనాటి పాటలు అమృత కలశం,
యీనాటి పాటలు ఇసుక దుమారం,
ఆనాటి పాటలు అమృత గానం,
యీనాటి పాటల్లో అంతట లోపం. ||పాత||

వన్నెలున్న సొగసుల ఆలనాటి పాటలు
వెన్నెల్లో విరిజాజుల వర్షం బోలు.
సున్నాగ మిగిలిన యీ సంగీతంలో
సన్నాయి అపస్వరాలు మిన్నగ తేలు. ||పాత||

అబ్బా అని అనిపించే యీ పాటల్లో
జబ్బులెన్నో ఉన్నాయో తెలుపగ లేము,
డబ్బాలో రాళ్ళేసి డమ డమా కుదిపినా,
అబ్బా ఆ ధ్వనులెన్నో ఎంతో మేలు. ||పాత||

తెలుగు కవులు తెర వెనుక లేకున్నార?
మెలుకువలు లేనివారు ముందున్నారా?
కలికాలం మా బాధ తప్పదన్నార?
కలం కదుప లేక వీరు గమ్ముగున్నారా? ||పాత||

తెరనంతో కబళించిన ధూర్తు లున్నార?
తెలుగు దనం లేనట్టి దున్న లున్నార?
సరిగమలు సరిగ రాని చవటలున్నారా?
సిరి కొరకు స్వరములను అమ్ముకొన్నారా? ||పాత||

రచన: అమెరికా కోకిల


#maa telugu talliki mallepU daMDaa#

Back to list