Creative works from Telusuna Members

కంఠము విప్పవే కవి కోకిల

చాకలకొండ రమాకాంతరావు

కంఠము విప్పవే కవి కోకిల,
తుంటరి తనము - తగునా యిలా? ||కంఠము||

1. ఒంటరి తనమనే వగ వదలవే,
వెంట నీకున్నాడు వేంకటనాధుడే,
కంటకపు భ్రమలతో కలతలు చెందక,
మంట కలిపి మధన మురిపముగ పాడవే ||కంఠము||

2. ఎండ, వానలు రెండు ఉండునీ వనమున
దండగ మారి దిగులేలనే,
కొండల రాయుడే కోరి శ్రోతగ ఉండ
గుండెలో నీకిక గుబులేలనే? ||కంఠము||

3. జడి వాన కురసిన, వడ గాలి వీచిన,
పిడుగులు పడిన, తడబడక సాగవే
గుడిలోని దేముడు గుండెలో నుండగ,
వాడి అండన నిలచి వడి పాడవే. ||కంఠము||

4. ఏడు కొండలవాడే ఎదుట నీ కుండగ
మోడు వార్చెడి కలత మది నేలనే
వేడి వేంకటపతిని, ఒద్దికగ తలపోసి
తడ బడక తియ్యగ యిక పాడవే. ||కంఠము||

చాకలకొండ రమాకాంతరావు శనివారం, November 3, 2007


#maa telugu talliki mallepU daMDaa#

Back to list