ఖగవాహన నీ కారుణ్యమే గదా, జగములో నా కొక దారి జూపినది, నగరాజ ధర నీదు నయగారమే కదా, నిజమైన శాంతిని ఎదన నింపినది, సిగఫింఛమౌళి నీ సంపర్గమే కదా, చితికిన బ్రతుకుకు చిగురు నిచ్చినది, నిగమాగమా వినుత నీ నాణ్యతే గదా, నెఱ నమ్మిన నాకు భుక్తి గూర్చినది, తొగ కన్నుల స్వామీ! తిరు వేంకటేశ్వర, వగ గొని ప్రార్ధింతు వరము నిమ్ము, జగములో ఎన్నెన్ని జన్మలు ఎత్తిన, తెగని బంధము గూర్చి తోడు నిమ్ము. స్వామి! శ్రీ వేంకటేశ్వర! యీ శరీరము, జీవితము నీ దాన శీలతే! దారి తెన్ను కానక జీవించు నాకు, నీ దయలే గదా ఒక మార్గము జూపినది. నగరాజ ధర! నీ మృదు స్వభావమే గదా నాకు మనసులో నిజమైన శాంతిని నింపినది. సిగ (శిఖ = సిగ) ఫింఛమౌళి! నీ సాంగత్యమే గదా, చితికి వాడిన నా బ్రతుకుని చిగురింపజేసి క్రొత్త జీవితము ప్రసాదించినది. కలువ కన్నుల నా స్వామి, తిరుమలాధీశ! నీపై ప్రేమతో ఒక ప్రార్ధన చేతును, నాకు ఒక వరము ప్రసాదించుము. యీ జీవి యీ విశ్వములో ఎన్ని జన్మలు ఎత్తిన, నీతో ఎన్నడూ తెగని బంధము గూర్చి నీ తోడు నాకిమ్ము. చాకల కొండ రమాకాంత రావు |
#maa telugu talliki mallepU daMDaa# |